అంతరించి పోకుండా.. తరించి పోతూ..!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. బాగున్నారా..! ఈ రోజు మనం చాలా అరుదైన ఓ కళ గురించి తెలుసుకుందాం. అసలే తోలుబొమ్మలాట అంతరించిపోతోంది. అందులోనూ ఈ అరుదైన తోలుబొమ్మల ఆట గురించి

Updated : 08 Aug 2022 06:40 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌.. బాగున్నారా..! ఈ రోజు మనం చాలా అరుదైన ఓ కళ గురించి తెలుసుకుందాం. అసలే తోలుబొమ్మలాట అంతరించిపోతోంది. అందులోనూ ఈ అరుదైన తోలుబొమ్మల ఆట గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కేవలం ఒకే ఒక్క కళాకారిణి మాత్రమే వీటిని ఆడించగలరు. మరి ఆ వివరాలేంటో వెంటనే తెలుసుకుందామా!

కేరళ రాష్ట్రంలోని మోనిపల్లికి చెందిన రంజని ఈ తోలుబొమ్మలాటకు సంబంధించిన ఒకే ఒక్క కళాకారిణి. ప్రస్తుతం ఆమెకు 21 సంవత్సరాలు. తనకు 12 సంవత్సరాల వయసున్నప్పుడు తన బామ్మ నుంచి ఈ కళను నేర్చుకుంది. ఈమె కనుక అప్పుడు నేర్చుకుని ఉండకపోతే ఈ కళ అంతరించిపోయిన వాటి జాబితాలోకి ఎప్పుడో చేరిపోయి ఉండేది. ఈ కళను నోకువిద్యాపావకల్లి అంటారు. మలయాళంలో నోకు అంటే చూడటం అని అర్థం. విద్య అంటే టెక్నిక్‌ అని అర్థం.

కళ్లకు కట్టినట్లు...
రంజని ఈ నోకువిద్యాపావకల్లి కళ ద్వారా రామాయణ, మహాభారత ఇతివృత్తాలను కళ్లకు కట్టినట్లు ప్రదర్శిస్తుంది. ప్రదర్శనలో రంజనితో పాటు మరో ఇద్దరు వ్యక్తులు ఆమెకు సహాయంగా ఉంటారు. ఒకరు డోలులాంటి వాయిద్యాన్ని వాయిస్తుంటే... ఇంకొకరు చిడతలు కొడుతూ.. కథలను ఆలపిస్తారు.

కొన్నేళ్ల క్రితం చేసిన బొమ్మలతో..
రంజని ఆడించే బొమ్మలను దాదాపు ముప్ఫైఅయిదు సంవత్సరాల క్రితం వాళ్ల నాన్న తయారు చేశారు. ఇప్పుడు వాటి బాగోగులను ఆమె సోదరుడు చూసుకుంటున్నాడు. ఇలా రంజని ఈ అరుదైన కళ అతరించిపోకుండా.. దీని సేవలో తరిస్తోంది. నేస్తాలూ.. మొత్తానికి ఇవీ ప్రపంచంలోకెల్లా అత్యంత అరుదైన తోలుబొమ్మలాటైన నోకువిద్యాపావకల్లి విశేషాలు.


ఒకే తీగతో...

మామూలుగా తోలుబొమ్మలాట అంటే తెర వెనక మనుషులుండి వాళ్ల చేతులతో అయిదారు తీగలతో బొమ్మలను ఆడిస్తారు. కానీ ఈ నోకువిద్యాపావకల్లిలో కేవలం ఒకే తీగతో బొమ్మను ఆడించాల్సి ఉంటుంది. అది కూడా ముక్కుకు కింద, పెదవి పైన ఉంటే చిన్న స్థలంలో సన్నని కర్రను బ్యాలెన్స్‌ చేస్తూ.. బొమ్మను ఆడించాల్సి ఉంటుంది. ఇది చాలా కష్టమైన ఆట. రంజని వాళ్ల బామ్మ మరో ముగ్గురు మనవరాళ్లకు ఈ కళను నేర్పిద్దామని ఎంత ప్రయత్నించినా వాళ్లు నేర్చుకోలేకపోయారు. కేవలం రంజని మాత్రమే ఈ కళను బతికిస్తోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈ కళ కేవలం ఈమెకు మాత్రమే తెలుసు. ఇంకెవరికీ రాదు.


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని