Updated : 09 Aug 2022 04:42 IST

మేడ మీద పంట!

‘ప్రతిరోజూ మనం శుభ్రమైన పండ్లు, కూరగాయలు తింటే ఆరోగ్యంగా ఉంటాం. అలాగే మంచి నీరు తాగాలి’ అని పాఠం ముగించారు సైన్స్‌ మాస్టారు. మధ్యాహ్నం ఏ క్లాసూ లేకపోవడంతో బెల్‌ కొట్టగానే పిల్లలంతా ఇళ్లకు పరుగు తీశారు. రవి పుస్తకాల సంచి భుజాన తగిలించుకుని ఇల్లు చేరాడు.

‘అమ్మా.. తాజా కూరలు, పండ్లు తినాలట. ఈరోజు పాఠంలో చెప్పారు’ అన్నాడు. ‘మనం ఎప్పుడు అలాంటివే తింటున్నాం. మీ నాన్నగారు అవే తెస్తారు కూడా’ అంది సుమతి.

సుమతి కుటుంబం విశాఖపట్నంలో ఉంటోంది. ‘ఒరేయ్‌ రవీ బాగున్నావా!’ పలకరించాడు అప్పుడే వచ్చిన రాఘవయ్య. ‘హాయ్‌.. తాతయ్యా’ అన్నాడు రవి. ‘మావయ్య గారూ.. ఇదేనా రావడం’ అంది సుమతి.

‘అవునమ్మా.. భోజనం చేసి బయలుదేరాను’ అంటూ తాను తెచ్చిన కూరగాయలు, పండ్ల సంచి చేతికందించాడు.

‘ఎందుకు మావయ్యా.. ఇవన్నీ ఇక్కడ దొరుకుతున్నాయిగా..’ అంది సుమతి. ‘ఇక్కడివా.. రసాయనాల్లో ముంచిన కూరలు, రంగులేసిన పండ్లు. నేను తెచ్చినవి మన పొలంలో ఎరువులు లేకుండా పండించినవమ్మా’ అన్నాడు.

‘అదేంటి తాతయ్యా! ఇక్కడ కొనే కూరలు మంచివి కావా’ అని అనుమానంగా అడిగాడు రవి. ‘కాదురా.. మనవడా.. మూడు నెలల్లో కాయాల్సిన పంటను నెల రోజుల్లో పండించడానికి రకరకాల విష రసాయనాలను వాడుతున్నారు. పండ్లకు ఇంజెక్షన్‌లు చేస్తున్నారు. వాటి వల్ల క్యాన్సర్లు, కిడ్నీ, లివర్‌ వ్యాధులు వస్తున్నాయి’ అన్నాడు రాఘవయ్య.

‘తాతయ్యా..! నువ్వేమీ చదువుకోలేదు కదా.. ఇవన్నీ నీకెలా తెలుసు’ అన్నాడు రవి. ‘తాతయ్య చదువుకోలేదని నీకెవరు చెప్పారు. ఆయన అప్పట్లోనే అగ్రికల్చర్‌ బీఎస్సీ చేశారు. వ్యవసాయం మీద మక్కువ కొద్దీ ఊరిలోనే ఉండి పొలం, తోటలు చూసుకుంటున్నారు’ అన్నాడు అప్పుడే వచ్చిన రవి తండ్రి, రాఘవయ్య కొడుకు మాధవ.

‘అలాగా’ అన్నాడు రవి. ‘మరి ఈ ఎరువులు వేసిన పంటలు తినకుండా ఉండాలంటే.. ఎలా తాతయ్యా..’ అన్నాడు మళ్లీ. దగ్గరగా పొలాలు ఉన్న వారు ఎరువులు వేయకుండా పంటలు పండించుకోవాలి. కూరగాయలు, పండ్లు ఇప్పుడు మిద్దె పంటలుగా పండించుకుంటున్నారు. పెరట్లో కూడా మొక్కలు వేసుకుంటే అందం, ఆరోగ్యం తెలుసా!’ అన్నాడు రాఘవయ్య.

‘ఈ రోజు మా సైన్స్‌ మాస్టారు ఇదే చెప్పారు తాతయ్యా’ అన్నాడు రవి. ‘అవును రవీ. ఇప్పుడు మిద్దె మీద.. అరుదుగా దొరికే అంజీరా, డ్రాగన్‌ ఫ్రూట్స్‌ కూడా పండిస్తున్నారు తెలుసా! పైగా ఈ పంటల్లో మనం మట్టి ఇసుక, కొబ్బరి పీచు, వానపాముల ఎరువు, వేప పిండిలాంటి సహజసిద్ధ ఎరువులు వాడతాం. దీనివల్ల ఏ విధమైన హానీ ఉండదు’ అన్నాడు రాఘవయ్య.

‘భలే భలే తాతయ్యా! మనం మేడ మీద రేపే మొక్కలు వేద్దాం. నాన్నా.. మీ ఆఫీసులో బయట పడేసిన రంగు డబ్బాలు తెప్పించండి’ అన్నాడు రవి. ‘సరే రవీ! నేను మన ఊరు నుంచి మంచి మట్టి, మొక్కలు, విత్తనాలు, సేంద్రియ ఎరువులు తెప్పిస్తాను’ అంటూ ఫోన్‌ చేశాడు తాతయ్య.

మరుసటి రోజు మాధవ డబ్బాలు తీసుకు రావడం, ఆదివారం కావడంతో రవి స్నేహితులు శ్రీజ, వేణు, మాధవ్‌ వచ్చారు. ట్రాక్టర్‌లో మట్టి, మొక్కలు కూడా వచ్చాయి. అంతా టిఫిన్లు చేసి మేడ మీదకు చేరారు. ఏ మొక్క ఎక్కడ వేయాలో సుద్దముక్కతో గీశారు రాఘవయ్య. మట్టి, కుండీల్లో నింపి మేడ మీదకు చేర్చారు. రాఘవయ్య ఒక్కొక్కటి వివరిస్తూ.. ‘ఇది ఏడాకుల బెండ విత్తనం. ఏడు ఆకులు రాగానే మొగ్గ వేసి పువ్వై, కాయలు కాస్తుంది’ అని చెబుతూ విత్తనాలు నాటించారు.

సుమతి అందరికీ మిఠాయిలు తెచ్చింది. కొంతసేపటికి కుండీలు అన్నీ సర్దారు. అంతవరకు మురికిగా ఉన్న డాబా కాస్త తెల్లని డబ్బాలతో, ఆకు పచ్చని మొక్కలతో కళకళలాడింది. ‘ఒరేయ్‌ రవీ.. ఇది జొన్నపొత్తు విత్తనం. నీకిష్టమని తెప్పించాను’ అని ఒక డబ్బాలో రవితో నాటించాడు రాఘవయ్య. అన్నీ చూసుకుంటూ అంతా మెట్లు దిగారు. మరుసటి రోజు క్లాసులో దీని గురించే కబుర్లన్నీ, శ్రీజ, వేణు, మాధవ్‌ కిందటి రోజు రవి ఇంట్లో వేసిన మొక్కల గురించే అందరికీ చెప్పారు. రవి, సుమతి కలిసి రోజూ మొక్కలకు నీరు పోస్తున్నారు. వారం తరువాత వచ్చిన రాఘవయ్య విత్తనాలు మొలకెత్తడం చూసి చాలా సంతోషించాడు.

ఒక కుండీలో వచ్చిన కొత్తిమీర కోసి రసంలో వేసింది సుమతి. ‘మన ఇంట్లో పండినవి అంటే ఎంతో ఆనందమమ్మా’ అన్నారు రాఘవయ్య. మూడు నెలలు తిరగకుండానే మొక్కలన్నీ ఎదిగి కాయలు, పండ్లు కాశాయి. ఒక వైపు వంకాయలు, బెండకాయలు, పాదుగా పాకిన దొండ.. కిందకు వేలాడుతున్న బీర, ఇక ఆకు కూరల సంగతి సరే సరి.

తోటకూర, గోంగూర, బచ్చలి గుబురుగా పెరిగాయి. రోజూ కావాల్సినవి ఉదయాన్నే కోసి వండుతోంది సుమతి. చుట్టుపక్కల ఇళ్ల వాళ్లు, తోటి స్నేహితులు వచ్చి చూడడంతో ఒకింత ఆనందపడ్డాడు రవి.

- కూచిమంచి నాగేంద్ర


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని