Published : 11 Aug 2022 00:24 IST

ఈ విద్యార్థులు.. ప్రకృతి నేస్తాలు!

హలో ఫ్రెండ్స్‌.. పచ్చదనంతోనే సమృద్ధిగా వర్షాలు కురుస్తాయనీ, అప్పుడే పర్యావరణ పరిరక్షణ సాధ్యమని మీరంతా పుస్తకాల్లో చదువుకొనే ఉంటారు. రోజురోజుకీ వివిధ కారణాల వల్ల అడవుల విస్తీర్ణం తగ్గిపోతుందని టీచర్లు చెప్పే ఉంటారు. ఇటువంటి పరిస్థితుల్లో పచ్చదనాన్ని పెంపొందించేందుకు కొందరు విద్యార్థులు ముందుకొచ్చారు. వారేం చేస్తున్నారో, ఎవరు పర్యవేక్షిస్తున్నారో తెలుసుకోండి మరి..

రాజస్థాన్‌ రాష్ట్రంలో పలీ జిల్లా పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఓ వినూత్న కార్యక్రమాన్ని చేపడుతున్నారు. అదేంటంటే.. ఆయా బడుల్లోని విద్యార్థులంతా మొక్కలను నాటి, వాటికి తమ పేర్లు పెట్టుకోవాలి. అంతేకాదు... ఆ మొక్కల సంరక్షణ బాధ్యతలనూ వారే చూసుకోవాలి.

50 వేల మొక్కలు
పలీ జిల్లాలో పరిశ్రమల సంఖ్య ఎక్కువ. గత 20 ఏళ్లలో మైనింగ్‌, విచ్చలవిడిగా నీటి వాడకంతో ఏటా వేసవిలో అక్కడ కరవు పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ సమస్య నుంచి బయటపడేందుకు యంత్రాంగం ‘స్వచ్ఛ విద్యాలయ-స్వస్థ విద్యాలయ’ పేరిట నూతన కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. జిల్లాలోని మొత్తం 2000 ప్రభుత్వ పాఠశాలలు ఇందులో భాగస్వాములయ్యాయి. ఆయా బడుల్లోని విద్యార్థులంతా కలిసి ఇప్పటివరకూ దాదాపు 50 వేల మొక్కలు నాటారట. బడిలో చదువు పూర్తయ్యే వరకూ ఆ మొక్కల బాధ్యతలను.. చిన్నారులే చూసుకోవాల్సి ఉంటుంది.

బహుమతులు కూడా..
ఏటా ఎండాకాలంలో పలీ జిల్లా వ్యాప్తంగా తీవ్ర నీటి ఎద్దడి నెలకొంటుంది. ఆ సమయంలోనూ మొక్కలు ఎండిపోకుండా.. బడులకు దగ్గరగా ఉండే పిల్లలే.. ప్రతి రోజూ వెళ్లి, వాటికి నీళ్లు పోయాలట. వేసవి సెలవులు ముగిసి, మళ్లీ తరగతులు ప్రారంభమయ్యే నాటికి మొక్కలను బాగా సంరక్షించిన పాఠశాలలకు బహుమతులు కూడా ఇస్తామని అధికారులు ప్రకటించారు. మొదటి బహుమతిగా రూ.లక్ష, రెండో బహుమతిగా రూ.70 వేలు, మూడో బహుమతిగా రూ.50 వేలు ఇవ్వనున్నారు. ప్రతిరోజూ నాటిన మొక్కల వివరాలను ఆయా స్కూల్‌ ప్రతినిధులు.. స్థానిక అధికారులకు అందించాలి. గ్రామాల్లోని రోడ్ల పక్కన, ఖాళీ స్థలాల్లో నాటిన మొక్కల రక్షణకు ట్రీగార్డులను దాతల నుంచి సేకరించే పనిలో అక్కడి అధికారులు నిమగ్నమయ్యారు. మొక్కలు నాటడం, వాటిని పర్యవేక్షించడం పూర్తయ్యాక.. తరవాతి దశలో విద్యార్థులకు నీటి సంరక్షణ పద్ధతులపైన అధికారులు అవగాహన కల్పించనున్నారట. ఈ ఆలోచన భలే బాగుంది కదూ! మనం కూడా ఖాళీ సమయాల్లోనో, పుట్టినరోజు సందర్భంగానో మొక్కలు నాటడంతోపాటు, వాటిని పెంచే బాధ్యత తీసుకుందాం ఫ్రెండ్స్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts