Published : 12 Aug 2022 00:21 IST

పండితుడి గర్వభంగం!

పాండిత్య ప్రదర్శనలో భాగంగా ఒక పండితుడు అనేక దేశాలు తిరుగుతూ.. శాకుంతల అనే రాజ్యానికి వచ్చాడు. ఆ పండితుడిని రాజు చంద్రసేనుడు సాదరంగా ఆహ్వానించి, ఉచితాసనంపైన కూర్చోబెట్టాడు. వచ్చిన పండితుడు తన గురించి చెప్పుకొంటూ ‘నా పేరు రుద్రశర్మ. ఇప్పటివరకూ వివిధ రాజ్యాల్లో నా ప్రతిభా పాటవాలు ప్రదర్శించాను. అనేక సత్కారాలు పొందాను’ అని గర్వంతో చెప్పాడు. అంతేకాక.. ‘మీరు ఎటువంటి ప్రశ్నలడిగినా, వాటికి చిటికెలో సమాధానాలు చెప్పగలను. అన్ని శాస్త్రాల్లో నాకు విశేష పరిజ్ఞానం ఉంది. మీ రాజ్యంలోని పండితులు కూడా అడిగే ప్రశ్నలకు జవాబులు చెప్పి, నా అంత గొప్పవాడు లేడని నిరూపించుకుంటా’ అంటూ సభాముఖంగా ప్రకటించాడు.

‘అయ్యా! మీరు చెప్పినట్లే చేద్దాం. ఈరోజుకు మా అంతఃపుర అతిథి గృహంలో విశ్రాంతి తీసుకోండి. రేపు మీ ప్రతిభా పాటవాలను సభలో ప్రదర్శించవచ్చు’ అని రుద్రశర్మతో మర్యాదపూర్వకంగా చెప్పాడు మహారాజు చంద్రసేనుడు. రుద్రశర్మ ఆవేశంతో ‘రాజా.. నేను ఎక్కడికి వెళ్లినా అదే రోజు నా ప్రతిభా పాటవాలు ప్రదర్శించడం అలవాటు. ఇప్పుడే సభాముఖంగా మీ పండితులు అడిగే ప్రశ్నలకు జవాబులు చెబుతాను. వెంటనే పోటీని ప్రారంభించండి’ అంటూ అహంకారంతో సవాల్‌ విసిరాడు. చంద్రసేనుడు చేసేదిలేక.. తన ఆస్థానంలోని పండితులతో ‘రుద్ర శర్మ సవాల్‌ను మీరు స్వీకరించి, ప్రశ్నలు సంధించండి’ అంటూ ఆజ్ఞ జారీ చేశాడు.

రాజు గారి ఆదేశంతో సభలో ఉన్న పండితులు అనేక శాస్త్రాల్లో క్లిష్టమైన ప్రశ్నలను రుద్రశర్మ ముందు ఉంచారు. కానీ, రుద్ర శర్మ వాటన్నిటికీ సులువుగా జవాబులు చెప్పాడు. ఆయన అపర మేధస్సుకు ఆశ్చర్యపోయిన రాజు.. ‘మీరు మహా పండితులు. మా రాజ్యం వచ్చి మీ నైపుణ్యం ప్రదర్శించారు. మీ ప్రతిభ అసాధారణం. మిమ్మల్ని మేం సాదరంగా సత్కరించుకుంటాం’ అని ఒక ప్రత్యేకమైన ఆసనం తెప్పించాడు. దాని మీద ఆసీనులు కావాలని రుద్రశర్మను కోరాడు రాజు.

రుద్రశర్మ మరింత అహంకారంతో ‘ఈ రాజ్యంలో నన్ను ఓడించేవారు లేరని ఒప్పుకోండి. అప్పుడే సత్కారం అందుకుంటాను’ అని అన్నాడు. సభలో ఉన్న వారంతా రుద్రశర్మ మాటలకు బాధపడ్డారు. ఇంతలో సభా ప్రాంగణంలో ఉన్న ఒక రైతు రుద్రశర్మను ఉద్దేశిస్తూ.. ‘అయ్యా! ఎప్పటి నుంచో నాకో సందేహం ఉండిపోయింది. ఎంతమందిని అడిగినా చెప్పలేకపోయారు. అది మీరు తీరుస్తారా?’ అని అడిగాడు. ‘మహా మహా పండితులు అడిగిన క్లిష్ట ప్రశ్నలకే సులువుగా జవాబు చెప్పిన వాడిని నేను, పామరుడవు.. నువ్వు అడిగే ప్రశ్నకు చిటికెలో సమాధానం చెబుతా’ అని అహంకారంతో అన్నాడు రుద్రశర్మ.

‘అయ్యా.. విత్తు ముందా? చెట్టు ముందా?’ అని అడిగాడు రైతు. రుద్ర శర్మ ఎగతాళిగా నవ్వుతూ ‘ఇదీ ఒక ప్రశ్నేనా? విత్తు లేకుండా చెట్టు ఉంటుందా? విత్తనమే ముందు’ అని జవాబు చెప్పాడు. అప్పుడు రైతు.. ‘చెట్టు లేకుండా.. విత్తుంటుందా?’ అని మరో సందేహం వెలిబుచ్చాడు. రుద్రశర్మ ఏం సమాధానం చెబుతాడోనని సభలోని వారందరూ ఆసక్తిగా ఎదురు చూడసాగారు. రుద్రశర్మకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. కాసేపు ఆలోచించి.. ‘ఇది సమాధానం లేని ప్రశ్న’ అని దాటవేత ధోరణిలో మాట్లాడాడు.

మహారాజు చంద్రసేనుడు కలగజేసుకొని ‘మీరు మహా పండితులని గర్వంతో విర్రవీగారు. ఒక సామాన్య రైతు అడిగిన ప్రశ్నకు సమాధానమే లేదంటున్నారు. మీరు ప్రతిభావంతులు అనడంలో సందేహం లేదు. కానీ నాకన్నా మించినవారు లేరు అనే అహంకారం.. ప్రతిభకు శోభను చేకూర్చదు. మీరు గర్వంతో మా సత్కారాన్ని తిరస్కరించడం సరైనది కాదు. వినయ విధేయతలతో కూడిన ప్రతిభతోనే గౌరవం లభిస్తుంది. ఈ చిన్న విషయం మీకు తెలియంది కాదు. అహంకారం వీడి మీ గొప్పతనాన్ని మంచికి ఉపయోగించండి. అంతకు మించిన ఆనందం లేదు’ అని కనువిప్పు కలిగించాడు.

రుద్రశర్మ తలదించుకొని ‘మహారాజా! నాకు సరైన గుణపాఠం నేర్పారు. అహం వీడి ఇకనుంచి మంచిగా మెలుగుతాను. ఒక రైతు ప్రశ్నకు సమాధానం ఇవ్వలేని నేను, నేర్చుకోవాల్సింది ఇంకా ఎంతో ఉందని అర్థమైంది’ అంటూ రాజును క్షమాపణ కోరాడు. రాజు సత్కారం పొంది.. తిరుగు పయనమయ్యాడా పండితుడు.

- మొర్రి గోపి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని