Published : 13 Aug 2022 00:28 IST

ఎవరు గొప్ప?

అది ఎండాకాలం. ఒకరోజు అడవిలోని జంతువులన్నీ చెట్ల కింద సేద తీరుతున్నాయి. మృగరాజు ఒక పెద్ద బండరాయి మీద కూర్చొంది. అలాగే చెట్ల మీద పక్షులూ విశ్రాంతి తీసుకుంటున్నాయి. చెట్ల కింద నీడతో పాటు చల్లటి గాలి జంతువులను మైమరిపిస్తోంది. అప్పుడే ఆహారం తిని ఉండటంతో జంతువులకు నిద్ర కూడా ముంచుకొస్తోంది. పిల్ల జంతువులు నీడ పట్టున ఆడుకుంటున్నాయి.

ఇంతలో ఎలుగుబంటి.. ‘పచ్చని చెట్లతో మన అందరినీ కన్నతల్లిలా కాపాడుతున్న ఈ అడవి తల్లి మేలు మర్చిపోలేం. మనల్ని తన సంతానంగా భావించి అన్ని రకాలుగా రక్షణ కల్పిస్తున్న దీని గురించి ఎంత చెప్పినా తక్కువే’ అంది. పిల్ల జంతువులకు అర్థం కాకపోయినా ‘అవును.. అవును’ అని గట్టిగా అరిచాయి.

ఆ అరుపులకు పెద్ద జంతువులు కళ్లు తెరిచాయి. నిద్రాభంగం కలిగించిన కూనల వైపు కోపంగా చూశాయి. అప్పుడు మృగరాజు జంతువులను ఉద్దేశించి... ‘అవును.. ఎలుగుబంటి చెప్పింది నిజమే. అడవి తల్లి రుణం తీర్చుకోలేనిది. మనల్ని కంటికి రెప్పలా కాపాడుతోంది. ఏ కష్టం వచ్చినా, కన్నీళ్లు వచ్చినా ఒకరికొకరం ఓదార్చుకునేలా చేస్తుంది. తల్లి ఒడిలో బిడ్డలు ఎలా సేద తీరుతారో మనం కూడా అలా నిశ్చింతగా ఉన్నాం. అటువంటి అడవిని కాపాడుకునే బాధ్యత కూడా మనదే’ అంది. సింహం మాటలతో నక్క విభేదించింది. పచ్చని చెట్లతో అడవి కళకళలాడటంలో మాంసాహార జంతువులే కీలకమంది. నక్క మాటలను శాకాహార జంతువులతోపాటు కొన్ని పక్షులు వ్యతిరేకించాయి.

దాంతో అడవి అభివృద్ధి విషయంలో మాంసాహార, శాకాహార జంతువులు, పక్షులు మూడు వర్గాలుగా విడిపోయాయి. ముందుగా పక్షులు.. ‘మృగరాజా! మా కిలకిలరావాలతోనే అడవి మేల్కొంటుంది. మేము చెట్ల మీదే నివాసం ఉంటాం. గూళ్లు కూడా కొమ్మలపైనే కట్టుకుంటాం. చెట్లతో మాకు అవినాభావ సంబంధం ఉంది. మేము చెట్లు అందించే పండ్లను ఆహారంగా తీసుకుంటాం. పచ్చని చెట్లతో అడవి కళకళలాడిందంటే మా పక్షి జాతే దానికి కారణం. మేం కేవలం పండ్లనే ఆహారంగా తీసుకుంటాం. మేము తిని విసర్జించిన పండ్లలోని గింజలు మొక్కలుగా మారి మహా వృక్షాలుగా ఎదుగుతున్నాయి. కాబట్టి అడవి పచ్చగా ఉండటంలో మా పాత్ర మర్చిపోలేనిది’ అన్నాయి.

ఆ తర్వాత శాకాహార జంతువులు సింహంతో ‘మృగరాజా! మేం అడవిలో ఆకులు, భూమిలో దొరికే దుంపల మీద ఆధారపడతాం. మాలో కొన్ని జీవులు.. దుంపల కోసం నేలను తవ్వుతాయి.  తద్వారా చెట్ల వేర్లు మరింతగా భూమి లోపలికి వెళ్లేందుకు మేము కారణమవుతున్నాం. లేకపోతే చిన్నపాటి గాలులు, వర్షాలకే ఇక్కడి చెట్లు నేలకూలేవి. ఒకరకంగా ఈ అటవీ భూమిని సారవంతం చేస్తున్నాం. అలాగే మాలో మరికొన్ని శాకాహార జంతువులు చెట్ల కొమ్మలు, ఆకులు, చిగుళ్లను ఆహారంగా తీసుకుంటాయి. కొమ్మలు, ఆకులు, చిగుళ్లు తినటం ద్వారా చెట్లు శాఖోపశాఖలుగా విస్తరించటానికి, బలంగా ఎదిగేందుకు ఉపకరిస్తుంది’ అని చెప్పాయవి.

మాంసాహార జంతువులు మాట్లాడుతూ ‘మృగరాజా! శాకాహార జంతువులు, పక్షులకు మన గురించి తెలిసినట్టు లేదు. ఒకరకంగా మనం లేకపోతే ఈ అడవే ఉండదని అవి గ్రహించాలి. మనం మాంసాహార జంతువులమైనా ఈ చెట్లను కంటికి రెప్పలా కాపాడుతున్నాం. విత్తనాలు ఎవరు వేశారు? మొక్కలు ఎవరు నాటారు? చెట్లను ఎవరు పెంచారు? ఎవరు నీళ్లు పోశారు? అనేది ప్రధానం కాదు మృగరాజా!.. మనం అడవిలో లేకపోతే ఒక్క చెట్టు అయినా ఉంటుందా! మనకు భయపడి కలప దొంగలు అడవిలోకి వచ్చే సాహసం చేయటం లేదు’ అన్నాయవి.

ఆ మూడింటి వాదనలు విన్న తర్వాత.. గట్టిగా నవ్వింది సింహం. ‘మీరంతా చెప్పింది నిజమే. నేను మొదట చెప్పినట్టు ఈ అడవి అభివృద్ధిలో మనందరి పాత్రా ఉంది. దీనిలో ఒకరు ఎక్కువా కాదు.. మరొకరు తక్కువా కాదు’ అందది.
సింహం మాటలు ఏ వర్గానికీ నచ్చలేదు. ఎవరికి వారు.. ‘అడవి అభివృద్ధిలో మాదే కీలకపాత్ర.. మేమే గొప్ప’ అని అరవసాగాయి. వాటి అరుపులు సింహానికి కోపం తెప్పించాయి. ఆగ్రహంతో గట్టిగా గర్జించింది. ‘ఈ అడవిని మనం నిర్మించలేదు. ప్రకృతి సహజంగా ఏర్పడింది. మనం లేకపోతే అడవి ఉంటుంది. కానీ అడవి లేకపోతే మన మనుగడ కష్టం అనే విషయాన్ని తెలుసుకోండి. ఎటువంటి తారతమ్యాలు లేకుండా వనం మనకు ఆశ్రయం కల్పిస్తోంది. చివరకు మనం బతకడానికి ఆహారం, నీరు కూడా అందిస్తోంది. ఎవరికి వారు నేనంటే నేనే గొప్ప అనుకోవటం కాదు. అడవి గొప్పతనం వల్లనే మనమంతా చల్లగా ఉంటున్నాం. ఈ విషయాన్ని అందరూ గుర్తించాలి’ అంది.

మృగరాజు మాటలకు పక్షులు, శాకాహార, మాంసాహార జంతువులు సిగ్గు పడ్డాయి. చివరకు అవన్నీ ఒకచోటికి చేరి.. మనందరి అభివృద్ధిలో అడవి పాత్ర గొప్పదని నినదించాయి. ‘మనందరిలో ఎవరు గొప్ప?’ అని మృగరాజు అడగ్గా.. ‘అడవే గొప్ప’ అని గట్టిగా సమాధానం చెప్పాయవి.

- తమ్మవరపు వెంకట సాయి సుచిత్ర


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని