పిల్లల కోసం.. అక్క సాయం!

హలో ఫ్రెండ్స్‌.. మన ఇంటి ముందుకో, వీధి చివరికో వచ్చే బస్సులోనో, ఆటోలోనో ఎక్కి.. రోజూ స్కూల్‌కి వెళ్లివస్తుంటాం కదూ.. కానీ, అందరి పరిస్థితి ఒకేలా ఉండదు కదా. తాను పడిన కష్టాలు,

Published : 13 Aug 2022 00:28 IST

హలో ఫ్రెండ్స్‌.. మన ఇంటి ముందుకో, వీధి చివరికో వచ్చే బస్సులోనో, ఆటోలోనో ఎక్కి.. రోజూ స్కూల్‌కి వెళ్లివస్తుంటాం కదూ.. కానీ, అందరి పరిస్థితి ఒకేలా ఉండదు కదా. తాను పడిన కష్టాలు, మరెవరూ పడొద్దనుకున్న ఓ అక్క.. ఊరి పిల్లలందరూ బడికెళ్లి చదువుకునేందుకు గొప్ప సాయం చేస్తోంది. ఆ వివరాలే ఇవీ..

మహారాష్ట్రలోని థానె జిల్లాలో పాలట్పాడ అనే ఓ మారుమూల గ్రామం ఉంది. ఆ ఊరి పిల్లలు చదువుకోవాలంటే దాదాపు గంటసేపు ప్రయాణించాల్సి ఉంటుంది. అంతేకాదు.. మధ్యలో కిలోమీటరు పొడవుండే ఓ చెరువును దాటాల్సి ఉంది. ఆ ఊరికి చెందిన బరాఫ్‌ అనే ఓ అక్క సొంతంగా పడవ కొనుగోలు చేసి మరీ.. గ్రామంలోని పిల్లలు స్కూల్‌కు వెళ్లివచ్చేందుకు చెరువు దాటిస్తోంది.

రోజూ ఆలస్యమయ్యేది..  
ఆ అక్క అలా చేసేందుకు ఓ కారణం ఉంది ఫ్రెండ్స్‌. అదేంటంటే.. అందరిలాగే చిన్నతనంలో తాను కూడా దాదాపు 80 నిమిషాల పాటు ప్రయాణం చేసి.. బడికెళ్లి చదువుకునేది. కానీ, మధ్యలో ఉండే చెరువును దాటలేక తొమ్మిదో తరగతిలోనే చదువును మానేసింది. చెరువు దాటేందుకు నాలుగైదు పడవలున్నా.. అవి సమయానికి వచ్చేవి కాదట. దాంతో కొన్నిసార్లు నీటి లోతు తక్కువగా ఉండే గట్టు నుంచి నడుచుకుంటూనే ఆలస్యంగానైనా బడికి వెళ్లేది. కానీ, రోజూ ఆలస్యంగా వస్తుందనీ, దుస్తులు తడిచిపోయాయనీ టీచర్లు కోప్పడేవారట. అలా కొన్ని రోజుల తరవాత ఏకంగా బడికెళ్లడమే మానేసింది. తనలా మరెవరూ చదువుకు దూరం కాకూడదనీ, సొంతంగా ఓ పడవ కొనుగోలు చేసి మరీ.. ఊరి విద్యార్థులను ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఉచితంగా చెరువు దాటిస్తోంది.

ఎవరికైనా పడవలే దిక్కు
దాదాపు 30 వరకూ కుటుంబాలు ఉండే పాలట్పాడ గ్రామంలో నివసించే వారికి వ్యవసాయం, చేపలు పట్టడమే జీవనాధానం. అత్యవసర పరిస్థితుల్లోనూ పడవ ప్రయాణమే దిక్కు. బరాఫ్‌ అక్క వాళ్ల నాన్న కూడా అనారోగ్యంతోనే చనిపోయారట. చిన్నతనంలోనే పడవ నడపడం నేర్చుకొని ఉండటంతో.. ఇప్పుడు ఊరి పిల్లలను రోజూ చెరువు దాటిస్తోంది. ఎంతైనా ఈ అక్క గ్రేట్‌ కదూ! అక్కడి చిన్నారులు కష్టపడి అంతదూరం ప్రయాణించి మరీ, చెరువును దాటుతూ తరగతులకు వెళ్తున్నారు కదా.. అందుకే, అన్ని సౌకర్యాలున్న మనం కూడా మారాం చేయకుండా బుద్ధిగా బడికెళ్లి.. చక్కగా చదువుకుందాం నేస్తాలూ.. సరేనా!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని