ఏది స్వచ్ఛం?

సురేంద్రపురంలో శరణ్యుడు నడిపే గురుకులంలో చదివేందుకు పిల్లలు ఎంతో ఉత్సాహం చూపిస్తారు. అందులో ప్రవేశానికి తల్లిదండ్రులూ అనేక ప్రయత్నాలు చేస్తారు. అక్కడ పిల్లలకు పాఠాలతో పాటుగా అనేక జీవన అంశాలూ బోధిస్తారు. వాటి వల్ల పిల్లలు ఎంతటి పెద్ద విషయాన్నైనా, ఇట్టే గుర్తు పెట్టుకొని..

Published : 14 Aug 2022 00:42 IST

సురేంద్రపురంలో శరణ్యుడు నడిపే గురుకులంలో చదివేందుకు పిల్లలు ఎంతో ఉత్సాహం చూపిస్తారు. అందులో ప్రవేశానికి తల్లిదండ్రులూ అనేక ప్రయత్నాలు చేస్తారు. అక్కడ పిల్లలకు పాఠాలతో పాటుగా అనేక జీవన అంశాలూ బోధిస్తారు. వాటి వల్ల పిల్లలు ఎంతటి పెద్ద విషయాన్నైనా, ఇట్టే గుర్తు పెట్టుకొని.. వాటిని తమ దైనందిన జీవితంలో అన్వయించుకునేందుకు ఉపయోగపడతాయి. విద్యార్థులను అన్ని రంగాల్లో ఉన్నతంగా తీర్చిదిద్దుతాడని శరణ్యుడికి మంచి పేరుంది.

ఒకరోజు శరణ్యుడు పిల్లలందరినీ పిలిచాడు. అందరం కలిసి నగర విహారానికి వెళ్దామని, త్వరగా సిద్ధం కావాలని చెప్పాడు. విహారం అనగానే గురుకులంలోని పిల్లల ఆనందానికి అవధుల్లేవు. విహారానికి వెళ్లవచ్చు కదా అని త్వరత్వరగా సిద్ధమయ్యారు. అవసరమైన సామగ్రినంతా చేతి సంచుల్లో సర్దుకుని బయలుదేరారు. శరణ్యుడు విద్యార్థులను నగరంలోని అన్ని ప్రదేశాలకు తీసుకుని వెళ్లాడు. అక్కడ చూడదగిన పెద్ద పెద్ద భవనాలు, క్రీడా ప్రాంగణాలు, ఉద్యానవనాలు, మ్యూజియాలు అన్నీ చూపించాడు.

రాత్రి బాగా పొద్దుపోయింది. దాంతో పిల్లలందరిలో ఆకలి దప్పులు మొదలయ్యాయి. ఇది గమనించిన శరణ్యుడు దగ్గరలోని ఒక ఇంటి యజమాని దగ్గరకు వెళ్లి, పిల్లల విషయం చెప్పాడు. వెంటనే ఆ ఇంటి యజమాని, తన కుటుంబ సభ్యులను పిలిచి వారికి అవసరమైనవి సమకూర్చమన్నాడు. వారు పిల్లలను ఇంట్లోకి పిలిచి.. తినడానికి ఆహార పదార్థాలతోపాటు తేనె, తాగేందుకు ఆవు పాలు కూడా ఇచ్చారు. అవి రుచిగా ఉండటంతో పిల్లలకు భలే నచ్చాయి. ఆ రాత్రికి అందరినీ తన ఇంటి పైనున్న గదిలో ఉండమని చెప్పాడా యజమాని. తిరిగి తిరిగి అలసిపోవడంతో.. విద్యార్థులంతా స్నానాలు చేసి నిద్రపోయారు.

తెల్లవారగానే అందరూ మేల్కొని ఇంటి యజమానికి కృతజ్ఞతలు చెప్పి, గురుకులానికి వెళ్లిపోయారు. ఆరోజు సాయంత్రమే.. విద్యార్థులందరినీ సమావేశపరిచాడు శరణ్యుడు. ‘నగర విహారాన్ని మీరందరూ బాగా ఆనందించి ఉంటారని అనుకుంటున్నాను. అక్కడ మీరు రకరకాల మనుషులను, వివిధ వేషభాషలను, ఆచారాలను గమనించే ఉంటారు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను’ అన్నాడు. ‘అడగండి’ అన్నట్లుగా తలూపారు విద్యార్థులు.

‘నిన్న మీరు చూసిన వాటిలో స్వచ్ఛమైనది ఏది?’ అన్నాడు గురువు. వెంటనే ఒక పిల్లవాడు ‘ఆవు పాలు.. ఎందుకంటే అవి చాలా స్వచ్ఛంగా నీళ్లు కలపకుండా ఉన్నాయి’ అన్నాడు. అందుకు ఆయన ‘నువ్వు చెప్పింది నిజమే.. ఇంకా..’ అంటూ మరో సమాధానం కోసం ఎదురుచూశాడు శరణ్యుడు. ‘పుట్ట తేనె’ అని జవాబిచ్చాడో విద్యార్థి. అది కూడా సరైన సమాధానం కాదంటూ.. ఇంకొంత సమయం ఎదురుచూడసాగాడాయన. వెంటనే చంద్రశేఖర్‌ అనే విద్యార్థి ‘నిన్న రాత్రి మనమందరం ఆకలి దప్పులతో ఉంటే.. మనకు సహాయపడిన ఇంటి యజమాని చాలా స్వచ్ఛమైన వారు’ అన్నాడు గురువు వైపు చూస్తూ..

ఆ సమాధానానికి ఎంతో సంతోషించిన ఆయన ఆ విద్యార్థిని అభినందిస్తూ ‘నువ్వు చెప్పింది అక్షరాలా నిజం. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా స్వచ్ఛమైనది సహాయ గుణం. ఎందుకంటే.. నిన్న ఆ ఇంటి యజమానికి మనకు ఆశ్రయం ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ, మనందరి ఇబ్బందిని గుర్తించిన ఆయన సహాయం చేయాలన్న గొప్ప మనసుతో ముందుకొచ్చారు. దీనివల్ల మీరు ఎప్పటికీ ఆ మేలు మరిచిపోరు. ఇలా అందరం అత్యవసర సమయాల్లో ఉన్నవారికి సహాయం చేస్తే, మిమ్మల్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు. వారు ఇంకొంత మందికి సహాయపడతారు’ అంటూ వివరించాడు గురువు. విద్యార్థులందరూ చప్పట్లు కొట్టి.. తమ అంగీకారం తెలిపారు.

- సింగంపల్లి శేషసాయి కుమార్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని