మురిసె.. మురిసె.. మువ్వన్నెలు!

ఆగస్టు 15 అంటే భారతీయులందరికీ పండగ. పిల్లలమైన మన సంగతి చెప్పక్కర్లేదు. మనకు ఎంతో నచ్చే రోజు ఇది. మరి, మనం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మన స్నేహితులకు ఏమైనా

Published : 15 Aug 2022 01:43 IST

ఆగస్టు 15 అంటే భారతీయులందరికీ పండగ. పిల్లలమైన మన సంగతి చెప్పక్కర్లేదు. మనకు ఎంతో నచ్చే రోజు ఇది. మరి, మనం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మన స్నేహితులకు ఏమైనా బహుమతులిద్దామా..! అదీ మనం సొంతంగా తయారు చేసి! మరి అది ఎలానో నేర్చుకుందామా!

కావాల్సిన వస్తువులు
1.కాషాయం, ఆకుపచ్చ, తెలుపు రంగులోని చార్టులు 2.కత్తెర 3.జిగురు 4.పెన్సిల్‌ 5.పెన్ను 6.స్కేలు 7.చిన్న రిబ్బను

ఎలా చేయాలి అంటే...

* ముందుగా తెలుపురంగు చార్టును తీసుకుని దాన్ని నిలువుగా మధ్యలో అమ్మానాన్న సాయం తీసుకుని కత్తిరించుకోవాలి.

* తర్వాత కాషాయ రంగు చార్టును తీసుకుని పావుభాగం మాత్రమే మడిచి, ఆ పావు భాగాన్ని కత్తిరించుకోవాలి. ఆకుపచ్చరంగులోని చార్టునూ అచ్చం ఇలాగే కత్తిరించాలి.

* ఇప్పుడిక ఆకుపచ్చ, కాషాయరంగు చార్టు ముక్కలను సముద్రంలోని అలల్లా కత్తెర సాయంతో కత్తించాలి.

* వాటిని ముందుగానే కత్తిరించి పెట్టుకున్న తెలుపు రంగు చార్టు మీద జిగురు సాయంతో అతికించుకోవాలి.

* కాసేపు ఆరనిచ్చిన తర్వాత.. దాన్ని మూడుసార్లు మడవాలి. తర్వాత మడత విప్పి కత్తెర సాయంతో ముక్కలుగా కత్తిరించాలి.

* ఇప్పుడు కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులున్న చిన్న చిన్న చార్టు ముక్కలు తయారవుతాయి.

* ఇలా తయారైన చిన్న ముక్కనొకదాన్ని తీసుకుని దాన్ని నిలువుగా మధ్యలోకి మడవాలి. ఇప్పుడు పెన్సిల్‌ సాయంతో ఆ చివర, ఈ చివర గుర్తులు పెట్టుకోవాలి. ఇప్పుడు కత్తెర సాయంతో చివర్లను కత్తిరించాలి. కత్తిరించిన తర్వాత ఈ చిన్న ముక్క ఈక ఆకారంలో ఉండేలా చూసుకోవాలి. ఇలాగే అన్ని ముక్కలను కత్తిరించుకోవాలి.

* తర్వాత ఆ ముక్కలను మళ్లీ నిలువుగా మధ్యలోకి మడిచి.. కత్తెర సాయంతో పక్షి ఈకల్లా చిన్న చిన్నగా కత్తిరించాలి.

* ఇప్పుడు తెలుపు రంగు చార్టును వృత్తాకారంలో కత్తిరించుకోవాలి. దానికి పక్షి ఈకల్లా సిద్ధం చేసి పెట్టుకున్న ముక్కల్ని జిగురు సాయంతో అతికించాలి.

* దాన్ని కాసేపు అలా ఆరనివ్వాలి. ఈ లోపు తెలుపురంగు చార్టును చిన్న వృత్తాకారంలో కత్తిరించుకోవాలి. దీనిపై స్కేలు సాయంతో గీతలు గీసుకుని, దాన్ని బ్లూ పెన్‌ సాయంతో అశోక చక్రంలా తయారు చేసుకోవాలి.

* ఇప్పుడిక అశోక చక్రాన్ని మధ్యలో అతికించడమే.

* కాసేపాగిన తర్వాత మువ్వన్నెల రంగులో తయారైన ఆకృతిని రివర్స్‌లో తిప్పాలి. ఒక చిన్న రిబ్బను ముక్కను కత్తిరించి జిగురు సాయంతో అతికించాలి. ఇంకేం మువ్వెన్నెల వృత్తం సిద్ధం. దీన్ని బ్యాడ్జీలా ధరించొచ్చు. అలంకరణగానూ వాడొచ్చు.

* ఇలాంటివి ఎన్నంటే అన్ని తయారు చేసి స్నేహితులకు బహుమతిగానూ ఇవ్వొచ్చు. మొత్తానికి మురిసె.. మురిసె.. మువ్వన్నెలు భలే ఉంది కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని