Published : 16 Aug 2022 01:05 IST

రంగుల దృశ్యం!

ల్లమల అడవుల్లో ఓ సీతాకోకచిలుకల గుంపు నివసిస్తోంది. అందులో ఒక సీతాకోకచిలుక తన అందాన్ని చూసి తానే తెగ మురిసిపోయేది. రంగురంగుల రెక్కలతో తనంత అందంగా ఎవరూ లేరని దాని ఉద్దేశం.  

‘ఈ లోకమంతా ఎన్నెన్నో అందమైన పక్షులు, జంతువులు, చెట్లు, ప్రకృతి రమణీయతలో మనం కూడా ఒక భాగమని’ తన స్నేహితులు ఎంత చెప్పినా వినేది కాదు. ‘మీరు చెప్పినవి అందమైనవే కావచ్చు కానీ, వాటికంటే నా రంగురంగుల రెక్కలే అందమైనవి’ అని గర్వపడుతూ ఉండేది.

‘ఈ లోకంలో మనకంటే చాలా అందమైనవి ఉన్నాయని స్నేహితులు చెబుతూ ఉంటారు కదా! ఒకసారి చూద్దాం’ అని బయలుదేరింది సీతాకోకచిలుక. అలా వెళుతూ వెళుతూ ఉండగా ఎన్నో పూలు పూచిన మొక్కలు కనిపించాయి. అందులో ఒక మొక్క మాత్రం చూపు తిప్పుకోలేనంతగా విరగబూసింది. ఎంతో అందాన్ని, సువాసనను వెదజల్లుతోంది.

‘ఈ పూలు ఎంత బాగున్నాయి. ఇంత మంచి సువాసనను వెదజల్లుతున్నాయి. ఈ రంగురంగుల పూలు నాకంటే బాగున్నాయి’ అని మనసులో ఒక్కక్షణం అనుకుంది. వెంటనే.. ‘ఇవి ఎన్నాళ్లుంటాయి.. రెండు రోజులే కదా!’ అనుకొని ఆ పూల మకరందాన్ని పీల్చుకుంది.

ఎగురుతూ ఎగురుతూ ఉండగా ఒక కమ్మని పాట వినిపించింది. ఆ తీయని కంఠానికి తాను కూడా గొంతు కలిపింది. ‘గొంతే ఇంత తీయగా ఉంటే, ఆ పక్షి ఇంకెంత అందంగా ఉంటుందో’ అని అటుగా చూసింది. చిటారు కొమ్మల్లో నల్లగా ఉన్న పక్షి కనిపించింది.

‘కంఠం తియ్యగా ఉన్నా, రూపం నల్లగా ఉందిలే’ అనుకొని ముందుకు కదిలింది. పోతూ పోతూ ఉండగా చిన్ని చిన్ని పులి కూనల అరుపులు వినిపించాయి. రంగురంగుల చారలతో ముద్దు ముద్దుగా ఆడుకుంటున్న పిల్లలు, తల్లి కనిపించాయి. వాటిని చూడగానే ఒకసారి ముద్దాడాలనుకొని తమాయించుకొంది.

‘అమ్మో! అవి క్రూర మృగాలు’ అనుకుంటూ, అక్కడి నుంచి జారుకుంది సీతాకోకచిలుక. రంగురంగుల ఈకలతో పురివిప్పి నాట్యం చేస్తున్న పక్షిని చూసింది.

‘పక్షులు ఇంత అందంగా ఉంటాయా!?’ అనుకొని అసూయపడింది. ‘హా... ఏముందిలే! ఇది తన జోడీని ఆకర్షించడం కోసం ఇలా నాట్యం చేస్తోంది’ అనుకొని ముందుకు ఎగిరింది. పోతూ పోతూ ఉండగా ఒక్కసారిగా నీటి బిందువులు మీద పడ్డాయి.
‘వర్షమేమో!’ అని కంగారుపడింది. ఆకాశం వైపు చూసింది. కానీ వాన లేదు. మరి ఎక్కడి నుంచి ఈ నీటి బిందువులని ముందుకు వెళ్లి పరిశీలించింది. చాలా పై నుంచి కిందకు నీళ్లు దూకుతున్నాయి. కిందకు దూకి అంతెత్తుకు ఎగురుతున్నాయి. ఆచుట్టుపక్కలంతా దుమ్మురేగినట్లు తుంపర్లు తుంపర్లుగా నీటి బిందువులు పడుతున్నాయి. ఆ నీటి బిందువుల గుండా సూర్యకాంతి ప్రసరించి ఇంద్రధనుస్సులోని రంగులు కనిపిస్తున్నాయి.

గంతులు వేస్తూ... ‘అద్భుతం ఇంతకుముందు ఎప్పుడూ ఇలాంటి అనుభూతి పొందలేదు. ఇలాంటి ప్రదేశాన్ని చూడలేదు.’ అని ఆశ్చర్యపోయింది. ‘అయినా, ఇది మానవ నిర్మితం’ అనుకుంటూ ముందుకు కదిలింది.

దూరంగా ఏదో లయాత్మక శబ్దం వినిపించింది. చూద్దామని అటువైపుగా కదిలింది సీతాకోకచిలుక. ‘వందేమాతరం.. భారత్‌ మాతాకీ జై’ అన్న నినాదాలు వినిపించసాగాయి. తెల్లని దుస్తుల్లో, పచ్చని రిబ్బన్లతో, రంగురంగుల పూలతో పిల్లలు ముద్దు ముద్దుగా చూడముచ్చటగా ఉన్నారు. అంతకంటే ముఖ్యంగా చేతిలో త్రివర్ణ పతాకం ఊపుతూ... ‘వందేమాతరం’ అంటుంటే సీతాకోకచిలుక ఒళ్లు పులకరించిపోయింది. పిల్లలందరూ వరుస కట్టి మూడు రంగుల జెండా ఊపుతూ కదులుతుంటే రంగులు కదులుతున్నట్లు అనిపించింది. వారు చేసే శబ్దం వినడానికి, ఆ రంగులు చూడడానికి వారి వెంటే వెళ్లింది సీతాకోకచిలుక.

దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన వీరుల గురించి తెలుసుకుంది. కులమతాలు తెలియని, పేద, ధనిక భేదం లేని జాతీయ జెండా గురించి విన్నది. తను కూడా ఈ ప్రాంతంలో, ఈ దేశంలోనే పుట్టానని, తనకూ దేశభక్తి ఉందని నిరూపించుకోవాలనుకుంది. జెండా ఎగరవేసినప్పుడు వందనం చేసింది. ఆ జెండా చుట్టూ తిరిగి దాని కర్రపై వాలింది. అప్పుడు అందరూ ఆ దృశ్యాన్ని ఫొటోలు తీసుకోవడం చాలా ఆనందం అనిపించింది. తనదే అందమనే గర్వం లేకుండా దేశభక్తితో అక్కడ నుంచి బయలుదేరింది సీతాకోకచిలుక.

- ఆవుల చక్రపాణి యాదవ్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని