ఇక్కడ బాల్యం దొరుకును!

రఘురామయ్య తన బాల్యమిత్రుడు, రిటైర్డ్‌ ఉపాధ్యాయుడు పరంధామయ్యను కలవడానికి చిరునామా వెతుక్కుంటూ వెళ్తున్నారు. పరంధామయ్య రిటైర్‌ అయిన తర్వాత విశాఖపట్నం శివారు ప్రాంతం మధురవాడలో విశాలమైన స్థలం కొనుక్కొని, చక్కని ఇల్లు నిర్మించుకున్నారు. పిల్లలు కూడా విజయవాడలో ఉద్యోగాలు చేస్తున్నారు. రఘురామయ్య కూడా విశాఖలోనే

Published : 18 Aug 2022 01:21 IST

ఘురామయ్య తన బాల్యమిత్రుడు, రిటైర్డ్‌ ఉపాధ్యాయుడు పరంధామయ్యను కలవడానికి చిరునామా వెతుక్కుంటూ వెళ్తున్నారు. పరంధామయ్య రిటైర్‌ అయిన తర్వాత విశాఖపట్నం శివారు ప్రాంతం మధురవాడలో విశాలమైన స్థలం కొనుక్కొని, చక్కని ఇల్లు నిర్మించుకున్నారు. పిల్లలు కూడా విజయవాడలో ఉద్యోగాలు చేస్తున్నారు. రఘురామయ్య కూడా విశాఖలోనే ఉంటున్నారు. తన మిత్రుడు ఇక్కడ ఉన్నాడని తెలిసి, కలుద్దామని మధురవాడ వచ్చారు.

ఆ చిరునామా ఆటో అతడికి తెలియకపోవడంతో, అక్కడ ఒక దుకాణం దగ్గర ఆగి అడిగారు. దుకాణ యజమాని ఆ చిరునామా చూసి... ‘ఆ సందులోకి వెళ్లండి’ అంటూ దగ్గర్లోని ఓ వీధి చూపించాడు. ఆ సందులోకి ఆటో వెళ్లకపోవడంతో, ఆటో డ్రైవర్‌ రఘురామయ్యని అక్కడే దింపేశాడు. ఆ సందు నుంచి నడుచుకుంటూ రఘురామయ్య ఇంటి ముందుకు వచ్చేటప్పటికి ఎదురుగా... ‘ఇక్కడ బాల్యం దొరుకును’ అనే బోర్డు కనబడింది. రఘురామయ్య ఆ బోర్డు చూసి కాస్త ఆశ్చర్యపోయినా, ఆ పక్కనున్న పేరు చూసి నవ్వుకున్నారు. ఆ పక్కన గల పేరు పరంధామయ్య మాస్టారిది. బోర్డు పక్కనే ఉన్న గేటు తెరిచి లోపలికి అడుగు పెట్టారు. చాలామంది పిల్లలు లోపల గ్రౌండ్లో కనిపించారు. విశాలమైన స్థలంలో చెట్లు కూడా ఉన్నాయి. ఇల్లు మాత్రం చాలా చిన్నదిగా ఉంది. ముందుకు వెళ్లేటప్పటికీ బాల్యమిత్రుడు పరంధామయ్య కనబడ్డారు. గ్రౌండ్లో పిల్లలతో ఆయన ఆడుకుంటున్నారు. రఘురామయ్య గారిని చూసి.. ‘రఘు బాగున్నావా?’ అంటూ పలకరిస్తూ ముందుకు వచ్చారు. ‘బాగున్నాను! పరంధామయ్య’ అంటూ... ఏంటి పిల్లలతో ఇలా ఆడుకుంటున్నావు, ముందు బోర్డు చూస్తే ఇక్కడ బాల్యం దొరుకును అని రాసి ఉంది, ఏమిటి సంగతి?’ అని ప్రశ్నించారు.

‘రా.. అలా టీ తాగుతూ మాట్లాడుకుందాం’ అంటూ ఇంటి ముందుకు తీసుకువెళ్లి.. ‘కాంతం’ అంటూ భార్యను పిలిచారు పరంధామయ్య. ఆమె బయటకు వచ్చి, రఘురామయ్యను చూసి... ‘అన్నయ్యగారు బాగున్నారా, వదినా పిల్లలు ఎలా ఉన్నారు’ అని కుశల ప్రశ్నలు వేసింది. ‘అంతా బాగున్నాం అమ్మా!’ అని రఘురామయ్య చెప్పారు. ‘మీరు మాట్లాడుతుండండి, నేను టీ తీసుకొస్తా’ అంటూ కాంతం వంటగది వైపు వెళ్లింది. 

రఘురామయ్య, పరంధామయ్యతో... ‘ఆ బోర్డు సంగతి ఏమిటి?’ అని అడిగారు. ‘మనం చిన్నప్పుడు ఎన్నో ఆట్లాడుకున్నాం, చాలా కబుర్లు చెప్పుకున్నాం, ఎన్నెన్నో కథలు విన్నాం కదా!’ అన్నారు.

‘అవును’ అంటూ తలాడించారు రఘురామయ్య. ‘మరి నేటి బాలలు అవన్నీ అనుభవిస్తున్నారా?’ అని ప్రశ్నించారు పరంధామయ్య. ‘అంత సమయం వాళ్లకు ఎక్కడ ఉంది రా! నిరంతరం చదువు, లేకపోతే సెల్‌ఫోన్‌లో ఆటలు... బయటకు వెళ్లే తీరుబడేలేదు.. కథలు చెప్పే తాతయ్యలు, అమ్మమ్మలు, నానమ్మలు కరవు. పాఠశాలకు వెళ్లినా ర్యాంకులు, మార్కుల గోలే. మరి వారికి ఆటాడే స్వేచ్ఛ ఎక్కడ ఉంది?’ అని సమాధానం చెప్పారు రఘురామయ్య.

‘ఆ లోటు తీర్చడానికే నేను ప్రయత్నం చేస్తున్నాను రా! నిరంతరం మార్కుల గోలలో పడి, ఆటలకు పిల్లలు దూరం అవుతూ.. శారీరకంగా మానసికంగా దృఢత్వం కోల్పోతున్నారు. కాసేపు ఖాళీ సమయం దొరికినా, సెల్‌ఫోన్‌కు బానిసలైపోతున్నారు. అందువల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటుంది నేటి బాల్యం. దాన్నుంచి వారిని బయటికి తీసుకురావాలి. ఆనందకరమైన బాల్యం వారికి అందివ్వాలి, శారీరకంగా మానసికంగా వారు ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కొనే విధంగా సన్నద్ధం కావాలి, అదే నా ఆశయం, ఆ దిశగా ఒక చిన్న ప్రయత్నమే... ‘ఇక్కడ బాల్యం దొరుకును’. ప్రతి ఆదివారం ఒక రెండు గంటలు సమీపంలో ఉన్న పిల్లలు ఇక్కడికి వచ్చి మన గ్రామీణ ఆటలు ఆడుకోవచ్చు’ అంటూ అసలు విషయం చెప్పారు పరంధామయ్య.

రఘురామయ్య గ్రౌండ్‌ వైపు చూశారు. పిల్లలు చాలా ఆనందంగా కేరింతలు కొడుతూ ఏకాగ్రతను పెంచే బొంగరాలాట, గోలీలాట, ఆనందం పంచే కోతికొమ్మచ్చి, దాగుడుమూతలు ఆడుకుంటున్నారు. తన బాల్యం గుర్తొచ్చింది. తన మనవళ్లు ఇప్పుడు అనుభవిస్తున్న బాల్యం కూడా రఘురామయ్య గుర్తు చేసుకున్నారు. ఉసూరుమంటూ బండెడు పుస్తకాలు మోసుకొని వచ్చి, అలా సోఫాలో పడేసి చతికిల పడిపోతారు. స్నాక్స్‌ తినేసి మళ్లీ హోంవర్క్‌ అంటూ పుస్తకాలతో కుస్తీ పడుతుంటారు. ఆదివారం అయినా ఖాళీ ఉండదు. ఖాళీ ఉంటే.. సెల్‌ఫోన్లో చిక్కుకుపోతారు. ఒక ఆటా ఉండదు, పాటా ఉండదు. మరి వారి కళ్లలో ఆనందం ఎక్కడ ఉంటుంది. మిత్రుడు పరంధామయ్య ఇప్పుడు చేస్తున్న పని చాలా మంచిది. పిల్లలకు వారి బాల్యం వాళ్లకు అందివ్వాలి. బాల్యం కోల్పోతే తిరిగి ఇవ్వలేం. రఘురామయ్యను అభినందిస్తూ.. ‘చాలా మంచి పని చేశావు! ఇటువంటి ఆశయం ప్రతి ఒక్కరిలో కలగాలి. తల్లిదండ్రులు కేవలం తమ పిల్లల్ని మార్కులను సాధించే యంత్రాలుగా చూస్తున్నారు. వారి బాల్యాన్ని వారికి ఇవ్వకుండా దూరం చేస్తున్నారు. ఈ నీ ప్రయత్నం తల్లిదండ్రుల్లో మార్పునకు శ్రీకారం అవుతుంది. సెల్‌ఫోన్‌ ఉచ్చులో పిల్లలు పడకుండా కాపాడే బాధ్యత మన అందరిదీ. నేను కూడా నా వంతు సహాయం చేస్తాను. నేను నా మనవలను ప్రతి ఆదివారం ఇక్కడికి తీసుకొచ్చి వారికి కూడా బాల్యమందిస్తాను, నేను కూడా నాకు తెలిసిన కథలు పిల్లలందరికీ చెప్తాను’ అన్నారు.

పరంధామయ్య భార్య కాంతం టీ, వేడి వేడి పకోడీలు తెచ్చి టీపాయ్‌ మీద పెట్టింది. ఇద్దరు మిత్రులూ తింటూ పిల్లల ఆటలు చూస్తూ ఆనందంగా మాట్లాడుకున్నారు. రఘురామయ్య మిత్రుడి వద్ద సెలవు తీసుకుని బయటకు వచ్చారు. బోర్డును మళ్లీ చదువుతూ, ఆనందంగా అడుగులు వేశారు.

- మొర్రి గోపి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని