బామ్మ మాట.. బంగారు బాట!

‘బామ్మా బామ్మా.. కథ చెప్పవా!’ అంటూ సాయంకాలం ఇంటి ముందు అరుగు మీద కూర్చున్న సుగుణమ్మ చుట్టూ మూగారు పిల్లలు. అంతలో కోటి వచ్చి.. ‘ఏయ్‌! ఆమె మా బామ్మ.. మీరంతా దూరంగా జరగండి’ అంటూ గట్టిగా అరుస్తూ పక్కనున్న పిల్లలను నెట్టేసి మరీ.. స్థలమంతా ఆక్రమించుకుని కూర్చున్నాడు.

Published : 21 Aug 2022 01:04 IST

‘బామ్మా బామ్మా.. కథ చెప్పవా!’ అంటూ సాయంకాలం ఇంటి ముందు అరుగు మీద కూర్చున్న సుగుణమ్మ చుట్టూ మూగారు పిల్లలు. అంతలో కోటి వచ్చి.. ‘ఏయ్‌! ఆమె మా బామ్మ.. మీరంతా దూరంగా జరగండి’ అంటూ గట్టిగా అరుస్తూ పక్కనున్న పిల్లలను నెట్టేసి మరీ.. స్థలమంతా ఆక్రమించుకుని కూర్చున్నాడు. కోటి దబాయింపు చూసి భయపడిన పిల్లలు.. వెంటనే దూరంగా జరిగారు. సుగుణమ్మకు మనవడి ప్రవర్తన అస్సలు నచ్చలేదు. బాగా ఆలోచించింది. కోటిని ఇంట్లో తల్లిదండ్రులు బాగా గారాబం చేయడంతో అలా తయారయ్యాడని ఆమెకు అర్థమైంది.

కోటికి ఏం కావాలన్నా గట్టిగా అరుస్తుంటాడు. అన్నం తినేటప్పుడు బాగా పేచీ పెట్టడం, ప్రతి విషయంలోనూ తనే గెలవాలని మంకుపట్టు పడుతుంటాడు. అలిగి తిండి తినకుండా, అనుకున్నది సాధించిన సందర్భాలూ ఉన్నాయి. కొడుకు మీద అమితమైన ఇష్టంతో ఏదడిగినా కాదనకుండా తీసుకొచ్చి ఇస్తుంటారు. దాంతో ‘ఆడిందే ఆట.. పాడిందే పాటగా’ తయారయ్యాడు. ఈ మధ్యనే మనవడిని చూద్దామని వచ్చింది సుగుణమ్మ. కోటి గురించి తెలుసుకున్న ఆమె.. ఎలాగైనా మనవడి ప్రవర్తనలో మార్పు తీసుకురావాలని అనుకుంది.

కథలు వినడానికి రోజూ రమ్మంటే రాడు. అది మనసులో పెట్టుకున్న సుగుణమ్మ, చుట్టు పక్కల పిల్లలను ప్రేమగా చేరదీయడం ప్రారంభించింది. ఇంట్లో చేసిన తినుబండారాలను వారికి పంచిపెట్టేది. వాళ్లంతా బామ్మకు అలా దగ్గరగా, ప్రేమగా ఉండటం చూసి, కోటి సహించలేక పోయాడు. అందుకే ఆ రోజు అరుగు మీద చుట్టూ చేరిన వాళ్లను బెదిరించి మరీ, బామ్మకు దగ్గరగా వచ్చి కూర్చున్నాడు. మనవడిలో మార్పు తీసుకొచ్చేందుకు అదే సరైన సమయమని భావించిందామె. రోజూలా రాజులు, రాక్షసుల కథలు కాకుండా.. ఓ పిల్లవాడి కథ చెప్పసాగింది.

అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో సాగర్‌, సంతోష్‌ అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వారిలో సాగర్‌కు డబ్బున్న వారి అబ్బాయినని బాగా గర్వం ఉండేది. సంతోష్‌ పేదింటి పిల్లవాడు. తన గొప్పతనాన్ని చెప్పుకోవడం కోసమే సంతోష్‌తో స్నేహం చేసేవాడు సాగర్‌. మిత్రుత్వం విలువ తెలిసిన సంతోష్‌.. సాగర్‌ ఏం చేసినా భరించేవాడు. ఒకరోజు సాయంత్రం పిల్లలతో కలిసి తోటకు వెళ్లాడు సాగర్‌. వారంతా కోతి కొమ్మచ్చి, దాగుడు మూతలు, కబడ్డీ ఆటలు ఆడుతున్నారు. వాళ్లకు తాను తెచ్చుకున్న మిఠాయిలు చూపించాడు. పాపం పిల్లలంతా.. ‘మాకూ మిఠాయిలు పెట్టవా!’ అని అడిగారు. ‘చింపిరి జుట్టూ.. చిరిగిన దుస్తులు మీరూనూ.. మీకు ఎందుకు పెడతా? ఆశ.. దోశ.. అప్పడం.. వడ’ అని ఊరిస్తూ ఒక్కడే తినసాగాడు.

పిల్లలు నిరాశగా వెళ్లి, అక్కడే ఉన్న జామ చెట్టు కాయలను కోసుకున్నారు. మళ్లీ ఆటలో మునిగిపోయారు. చెట్టు కింద కూర్చొని తింటున్న సాగర్‌ను, పైన ఉన్న కోతుల గుంపు చూసింది. అందులో ఒక కోతి పిల్ల కిందికి దిగి, మిఠాయిలు ఇవ్వమని కిచకిచా అరవసాగింది. ‘వాళ్లకే పెట్టలేదు. ఇక నీకు ఇస్తానా?’ అనుకుంటూ పక్కనే ఉన్న రాయి తీసి దాని మీద విసిరాడు. అంతే.. అది చూసిన కోతులు ఒక్కసారిగా కిందకు దూకాయి. సాగర్‌ మీదకు ఎగబడ్డాయి. భయంతో గట్టిగా అరవసాగాడు. అక్కడ ఆడుకుంటున్న పిల్లలంతా ఆ అరుపులు విని పరుగెత్తుకొని వచ్చారు. తమ జేబుల్లో ఉన్న జామకాయలు తీసి, వాటి వైపు విసిరారు. అవి సాగర్‌ను వదిలి పెట్టి కాయల వెంటపడ్డాయి. సంతోష్‌ గబగబా స్నేహితుని దగ్గరకు వచ్చి భయం లేదని భుజం తట్టాడు.

పిల్లలు దగ్గరకు వచ్చి ‘సాగర్‌.. నీకేం కాలేదు కదా!’ అని అడుగుతుంటే.. అతడికి తప్పు తెలిసి వచ్చింది. తన అహంకారానికి సిగ్గుపడ్డాడు. స్నేహితులను దగ్గరకు తీసుకొని, క్షమించమని అడిగాడు. అందరినీ ఇంటికి కూడా తీసుకెళ్లాడు. వాళ్లమ్మకు విషయం చెప్పాడు. కొడుకులో వచ్చిన మార్పునకు ఆమె సంతోషించింది. ఇంట్లో ఉన్న మిఠాయిల డబ్బా చేతికి ఇచ్చి.. పిల్లలకు పంచమంది.

‘విన్నారా పిల్లలూ.. అహంకారంతో ఆ పిల్లలను తక్కువగా చూసినా, అవేమీ మనసులో పెట్టుకోకుండా సాగర్‌ను ఎలా కాపాడారో..’ అంది సుగుణమ్మ. అందుకే.. ఎవరికైనా అహంకారం, గర్వం ఉండకూడదనీ, అందరితో కలిసి మెలిసి ఉండాలనీ బామ్మ చెబుతుంటే.. కోటికి కూడా తాను చేసిన పొరపాటు ఏంటో తెలిసొచ్చింది. పిల్లలందరికీ క్షమాపణలు చెప్పాడు. మనవడిని దగ్గరకు తీసుకొని సంబరపడింది సుగుణమ్మ.

- వురిమళ్ల సునంద


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని