తలా కొంత.. పిల్లలకు అండ!

హాయ్‌ ఫ్రెండ్స్‌..! ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెడుతుంటారని తెలిసే ఉంటుంది. సర్కారు బడుల్లో చదివే వారిలో అధిక శాతం పేద కుటుంబాల నుంచి వచ్చిన వారే కావడంతో.. ప్రభుత్వమే ఆ పిల్లలకు పౌష్టికాహారం

Published : 23 Aug 2022 00:31 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌..! ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెడుతుంటారని తెలిసే ఉంటుంది. సర్కారు బడుల్లో చదివే వారిలో అధిక శాతం పేద కుటుంబాల నుంచి వచ్చిన వారే కావడంతో.. ప్రభుత్వమే ఆ పిల్లలకు పౌష్టికాహారం అందిస్తోంది. ఒక చోట మాత్రం ఊరి ప్రజలే తలా కొంత పోగుచేసి.. నిరుపేద పిల్లలకు అండగా నిలుస్తున్నారు. ఆ వివరాలే ఇవీ..

ర్ణాటక రాష్ట్రంలో బొగసె అనే మారుమూల గ్రామం ఒకటుంది. జిల్లా కేంద్రానికి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఊరి ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి వరకూ అందుబాటులో ఉంది. ఉపాధ్యాయుల చొరవతో ఇక్కడ 9వ, 10వ తరగతి విద్యార్థులకు గ్రామస్థులే మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్డును సమకూరుస్తున్నారు.

అందరినీ సమానంగా చూడాలని..  

బొగసె పాఠశాలలో 8, 9, 10వ తరగతుల్లో మొత్తం 80 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇటీవల కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఎనిమిదో తరగతి వరకే పిల్లలకు ప్రతి రోజూ మధ్యాహ్న భోజనంలో ఒక గుడ్డు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. బడ్జెట్‌ సరిపోకపోవడంతో ఆపై తరగతుల వారికి మాత్రం ఆ అవకాశం లేకుండా పోయింది. అయితే, ఈ బొగసె బడిలో 8, 9, 10వ తరగతులు ఒకే భవనంలో కొనసాగుతున్నాయి. ఎనిమిదో తరగతి విద్యార్థులకు భోజనంలో గుడ్డు పెట్టి.. వారితోపాటు అన్నం తినే తొమ్మిది, పదో తరగతి వారికి లేకపోవడం ఉపాధ్యాయులను ఆలోచనలో పడేసింది. అందరినీ సమానంగా చూడాలనుకొని, ఎలాగైనా వారికీ గుడ్డు అందించాలని అనుకున్నారు.

ఉపాధ్యాయుల సాయం..

ఆ మరుసటి రోజే ఉపాధ్యాయులు.. పాఠశాల యాజమాన్య కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. 9, 10వ తరగతి విద్యార్థులకు కూడా గుడ్డు పంపిణీ చేయాలనీ, అందుకు ఆ గ్రామస్థుల సహకారం తీసుకోవాలని నిర్ణయించారు. వెంటనే, కమిటీ సభ్యులంతా కలిసి గ్రామస్థులతో సమావేశమయ్యారు. విషయం చెప్పడంతో.. వారూ తలా కొంత ఆర్థిక సాయం అందించేందుకు ముందుకొచ్చారు. అలా కొంత మొత్తం జమ చేశారు. అందులోంచి ప్రతి రోజూ రూ.600తో తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకూ గుడ్డు అందించడం ప్రారంభించారు. అంతేకాదు.. ఆ పాఠశాల ఉపాధ్యాయులు కూడా ఒక నెల వేతనాన్ని విరాళంగా అందించారు. ఈ గ్రామంలో 80 ఇళ్లు మాత్రమే ఉన్నాయట. చుట్టుపక్కల ఉన్న అయిదు గ్రామాల విద్యార్థులకు బొగసె పాఠశాల ఒక్కటే దిక్కు. నిజంగా పేద పిల్లల కోసం ఉపాధ్యాయుల చొరవ, గ్రామస్థుల ఉదారత చాలా గ్రేట్‌ కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని