ఎద్దు చెప్పిన బుద్ధి!

పరుగు పరుగున వచ్చిన ఒక ఎద్దు ఓ కొండ గుహలో జొరబడింది. అక్కడంతా చీకటిగా ఉంది. రొప్పుతూ అలసట తీర్చుకుంటున్న దానికి లోపలి నుంచి ఏదో అలికిడి వినిపించింది. దాన్నిబట్టి అంతకు ముందు నుంచే ఆ గుహలో మరో జంతువు ఉన్నదన్న విషయం గ్రహించింది. కొద్దిగా భయపడింది. అయినా అంతకంటే మరో అవకాశం లేకపోవడంతో, ధైర్యం తెచ్చుకుని ....

Published : 23 Aug 2022 00:32 IST

రుగు పరుగున వచ్చిన ఒక ఎద్దు ఓ కొండ గుహలో జొరబడింది. అక్కడంతా చీకటిగా ఉంది. రొప్పుతూ అలసట తీర్చుకుంటున్న దానికి లోపలి నుంచి ఏదో అలికిడి వినిపించింది. దాన్నిబట్టి అంతకు ముందు నుంచే ఆ గుహలో మరో జంతువు ఉన్నదన్న విషయం గ్రహించింది. కొద్దిగా భయపడింది. అయినా అంతకంటే మరో అవకాశం లేకపోవడంతో, ధైర్యం తెచ్చుకుని అప్రమత్తంగా ఉండాలని మాత్రం నిర్ణయించుకుంది.

ఇంతలో లోపల నుంచి ‘ఎవరు నువ్వు? నా అనుమతి లేకుండా ఇక్కడకు ఎందుకు వచ్చావు? త్వరగా ఇక్కడ నుంచి వెళ్లిపో’ అనే మాటలు వినిపించాయి. మాటలు విన్న ఎద్దుకు ఆ కంఠధ్వనిని బట్టి.. లోపల ఉంది తాను భయపడాల్సినంత ప్రమాదకరమైన జంతువు కాదని గ్రహించింది. కానీ అది ఏ జంతువో మాత్రం నిర్ధారించుకోలేకపోయింది. దానికి కారణం ఆ జంతువు గొంతు మార్చి గంభీరంగా మాట్లాడినట్లు అనిపించాలని ప్రయత్నం చేస్తోందని ఊహించింది.

అందుకే ధైర్యం తెచ్చుకుని ‘మిత్రమా! నేను ఒక ఎద్దును. అడవిలో మేతకు వచ్చి దారి తప్పిపోయాను. ఈలోగా ఒక సింహం నన్ను వేటాడి తినాలని వెంటబడింది. దాని బారి నుంచి తప్పించుకుని ఈ గుహలోకి చేరాను. ఆ సింహం ఇక్కడ నుంచి వెళ్లిపోగానే నేను నా దారిన వెళ్లిపోతాను. అంతవరకూ నన్ను ఇక్కడ ఉండనీయండి. నా వల్ల నీకు ఏ ఇబ్బందీ ఉండదు’ అంది బతిమాలుతున్న ధోరణిలో.

ఎద్దు అలా బతిమాలాడుతున్నట్లు మాట్లాడే సరికి అందులో ఉన్న జంతువుకు మరింత గర్వం, అహంకారం పెరిగింది. ఆ ఎద్దుకు తన గొప్పదనాన్ని చాటాలని నిర్ణయించుకుంది. అదీకాక అంతలా బతిమాలుతోందంటే అది పిరికిదై ఉంటుందని, అందుకే తాను ఏమి చేసినా అది ఏమీ అనలేదని నిశ్చయించుకుంది. అందుకే ఆ జంతువు ‘ఇది నా ఇల్లు. ఇక్కడ నుంచి త్వరగా వెళ్లిపో... లేకపోతే నిన్ను ఏం చేస్తానో నాకే తెలియదు. కావాలంటే చూడు నా దెబ్బ’ అంటూ ఆ జంతువు, ఎద్దును తన కొమ్ములతో పొడవడం మొదలెట్టింది.

ఎద్దుకు కాస్త చికాకుగా అనిపించినా, ఆ కొమ్ముల వాడితనం దాన్ని ఏమీ చేయలేకపోయింది. కానీ పదే పదే పొడుస్తుంటే కాస్త చికాకుగా ఉంది. అయినా చేసేది లేక ఆ బాధను భరించసాగింది. ఆ క్రమంలో తనను ఇబ్బంది పెడుతున్న జంతువు మెడ కింద చిన్న గెడ్డం ఉన్నట్లు దాని స్పర్శ వల్ల గ్రహించింది. అదీకాక దాని కొమ్ముల వాడితనం వల్ల అది ఒక మేకపోతు అని గ్రహించింది.

ఎద్దు, మేకపోతుతో.. ‘మిత్రమా! నా పరిస్థితి వివరంగా చెప్పినా నువ్వు ఇలా ప్రవర్తించడం సబబు కాదు. మనం ఇద్దరం ఇప్పుడు వాదులాటకు దిగితే, మన ఉనికి బయట ఉన్న సింహానికి తెలుస్తుంది. అప్పుడు మన ఇద్దరిలో ఒకరికి కానీ, ఇద్దరికి కానీ ప్రమాదం జరిగే పరిస్థితి కలగవచ్చు. కాబట్టి కాసేపు ఓపిక పట్టు. సింహం వెళ్లి పోగానే, నేను వెళ్లి పోతాను. నీ నివాసంలో నువ్వు సుఖంగా ఉండవచ్చు’ అంది.

అయినా మేకపోతు హింసించడం మానలేదు. కొమ్ములతో పొడుస్తూనే ఉంది. చేసేది లేక ఎద్దు కొంతసేపు భరించింది. ఇంతలో బయట అలజడి సద్దుమణిగింది. ఆ విషయం గ్రహించిన ఎద్దు... ‘హమ్మయ్య! సింహం ఎప్పుడు పోతే నాకేం? అది వెళ్లే వరకూ, మేయడానికి మంచి మేత దొరికింది’ అని బయటకు అంటూ మేకపోతు గడ్డాన్ని పళ్లతో సున్నితంగా లాగడం మొదలు పెట్టింది. ఆ చర్యతో మేకపోతుకు నొప్పి కలిగింది. విడిపించుకోవాలనే ప్రయత్నంలో భాగంగా వెనక్కి లాగింది. వెంట్రుకలు ఎద్దు పళ్ల మధ్య ఇరుక్కుపోయినందువల్ల చుర్రుమన్నాయి. పెనుగులాడసాగింది.

‘నా గడ్డాన్ని వదులు. నొప్పిగా ఉంది’ అంది బాధగా మేకపోతు. ఆ మాటలకు ఎద్దు.. ‘గడ్డం కాదు మిత్రమా! దీన్ని గడ్డి అంటారు. దీని రుచి నీకు తెలియదేమో. నీ ఆహారం ఏమిటో నాకు తెలియదు. కానీ నా ఆహారం మాత్రం ఇదే’ అంటూ ఆ గడ్డాన్ని మరింతగా మెలిపెట్టి గుంజసాగింది. ఆ బాధ భరించలేక మేకపోతు గట్టిగా అరుస్తూ.. ‘అయ్యో! ఇది గడ్డి కాదు. నా మూతి కింద ఉన్న గడ్డం. నేను ఒక మేకపోతును. నా ఆహారం కూడా గడ్డే. దాని రుచి నాకూ తెలుసు. ఇంతసేపూ నిన్ను ఇబ్బంది పెట్టినందుకు నన్ను క్షమించు’ అంది బాధతో బతిమాలుతూ.

ఆ మాటలు విన్న ఎద్దు... ‘మిత్రమా! ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవాలి కానీ, అలుసుగా ఆటలాడుకోకూడదు. ఆపద ఎవరికైనా ఒకటే. కానీ మనకంటే పైవాళ్లు ఆపదలో ఉంటే కొంటెతనం ప్రదర్శిస్తే, ఆ ఆపద తీరాక వాళ్లు మనల్ని చితకగొట్టేస్తారని గ్రహించు. నిజానికి నువ్వు మేకపోతువని.. ఇందాకే గ్రహించాను. అయినా సింహం బయట ఉన్నంత వరకూ నీ హింసను భరించాను. అది ఈ తావు నుంచి ఇందాకే వెళ్లిపోయింది. ఆ వెంటనే నేనూ వెళ్లిపోవచ్చు. కానీ అలా వెళ్లిపోతే నన్ను చులకనగా జమకడతావు. అదీకాక ఇకమీదట కూడా మరెవరితోనైనా ఇలాగే ప్రవర్తిస్తావు. అందుకే చిన్న గుణం పాఠం చెప్పాలని నీ గడ్డాన్ని, నీకు పెద్దగా ప్రమాదం జరగకుండా గుంజాను. ఆ దెబ్బతో నువ్వు హడలిపోయి దారిలోకి వచ్చావు. ఇకపైనైనా ఇలాంటి చిల్లర అల్లర్లు మానుకుని ఆపదలో ఉన్నవారికి సాయం చెయ్యడానికి ప్రయత్నించు’ అని బయలుదేరబోయింది. ఆ మాటలు విన్న మేకపోతు ‘మిత్రమా! ఆగాగు నేనూ ప్రాణ భయంతోటే ఈ గుహలో దాక్కున్నాను. నీ వల్ల ఏదైనా ఆపద వస్తుందేమోనని ఆత్మరక్షణ కోసం అలా ప్రవర్తించాను. నన్ను క్షమించు. నన్ను కూడా నీతో పాటు ఈ అడవి దాటించు’ అంది బతిమాలే ధోరణిలో. ‘సరే పద. మనం ఇప్పుడు ఒకరికొకరం తోడుగా ఈ అడవిని దాటుదాం’ అంది ముందుకు నడుస్తూ.

-ఆదిత్య కార్తికేయ

 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని