పిల్లల మనసెరిగిన మాస్టారు!

‘శేఖర్‌ మిమ్మల్ని మల్లేపల్లి ఉన్నత పాఠశాలకు బదిలీ చేస్తున్నాం’ అన్నారు జిల్లా విద్యాశాఖాధికారి. ‘అనుకోకుండా ఈ బదిలీ ఏమిటి సార్‌’ అన్నారు శేఖర్‌. ప్రస్తుతం కాకినాడ ఉన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు శేఖర్‌. మంచివారు, పిల్లల మనసెరిగినవారు. పైగా వ్యక్తిత్వ వికాస నిపుణుడు. ఆయనంటే అందరికీ గౌరవమే.

Published : 24 Aug 2022 00:19 IST

‘శేఖర్‌ మిమ్మల్ని మల్లేపల్లి ఉన్నత పాఠశాలకు బదిలీ చేస్తున్నాం’ అన్నారు జిల్లా విద్యాశాఖాధికారి. ‘అనుకోకుండా ఈ బదిలీ ఏమిటి సార్‌’ అన్నారు శేఖర్‌. ప్రస్తుతం కాకినాడ ఉన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు శేఖర్‌. మంచివారు, పిల్లల మనసెరిగినవారు. పైగా వ్యక్తిత్వ వికాస నిపుణుడు. ఆయనంటే అందరికీ గౌరవమే.

‘మల్లెపల్లి పాఠశాలలో ఉపాధ్యాయులందరూ చాలా క్రమశిక్షణ కలవారు. పైగా పాఠాలు బాగా చెప్పగలిగిన వారే. కానీ అక్కడ ఎప్పుడూ పరీక్షల్లో విద్యార్థులు ఎవ్వరూ ఉత్తీర్ణులు కావడం లేదు. నేను రెండుసార్లు పాఠశాల సందర్శించా... అంతా బాగానే ఉంది. క్లాస్‌లు బాగా జరుగుతున్నాయి. పిల్లల హాజరు బావుంది. కానీ పరీక్షలో మాత్రం చాలా మంది ఫెయిల్‌ అవుతున్నారు. కారణం తెలుసుకుని సరిదిద్ది రావాలి. నా మాట కాదనరనే నమ్మకంతో మిమ్మల్ని ఈరోజే మల్లేపల్లి బదిలీ చేస్తున్నా’ అన్నారు జిల్లా విద్యాశాఖాధికారి. ‘భలే వారు సార్‌.. పిల్లల బాగు కోసం ఎక్కడికన్నా వెళతాను సార్‌’ అని బయలుదేరారు శేఖర్‌.

మల్లేపల్లిలో విశాలమైన ఆవరణలో.. పెద్ద పాఠశాల. తనెప్పుడు అలాంటి స్కూల్‌ చూడలేదు. వరుసగా ఉన్న క్లాస్‌ రూంలు. పెద్ద ఆటస్థలం. ఒక పక్క పెద్ద చెరువు, తామర పువ్వులతో కళకళలాడుతోంది. హెడ్‌మాస్టర్‌ దగ్గరకు వెళ్లి తనను తాను పరిచయం చేసుకున్నారు. ‘రండి శేఖర్‌.. మీ గురించి సార్‌ ఫోన్‌ చేశారు. మా ఉపాధ్యాయులను పరిచయం చేస్తాను’ అంటూ తీసుకువెళ్లారు హెడ్‌మాస్టర్‌. ఆయన్ను అనుసరించారు శేఖర్‌. పెద్దపెద్ద తరగతి గదులు, కూర్చోవడానికి బెంచ్‌లు, మంచి కాంతి, చాలా బాగున్నాయి. పిల్లలంతా శ్రద్ధగా పాఠం వింటున్నారు. ‘పిల్లలూ.. ఈయన కొత్తగా వచ్చిన సోషల్‌ మాస్టారు.. పేరు శేఖర్‌’ అన్నారు హెడ్‌ మాస్టారు.

‘గుడ్‌ మార్నింగ్‌ సార్‌..’ అన్నారు పిల్లలంతా. అలా అన్ని తరగతి గదులు తిరిగి వచ్చారు శేఖర్‌. ఎక్కడా లోపం కనపడలేదు. ‘శేఖర్‌ ఒక్క పీరియడ్‌ కూడా వదలకుండా పాఠాలు చెప్పిస్తున్నాం. క్లాస్‌ వర్క్‌, హోమ్‌ వర్క్‌ రోజూ ఇస్తున్నారు. అంతా బాగానే ఉంటోంది.. కానీ పరీక్షల సమయంలోనే పిల్లలు బేజారెత్తిపోతున్నారు’ అన్నారు హెడ్‌ మాస్టర్‌. ‘సరే సార్‌.. నేను చూస్తాను’ అన్నారు శేఖర్‌. సాయంత్రం ఇతర మాస్టార్లతో మాట్లాడారు. అందరూ బాగా అనుభవం ఉన్నవారే. ఇక ఇటునుంచి కాదు, పిల్లల వైపు నుంచి తెలుసుకోవాలి అనుకున్నారు. మరుసటి రోజు టెన్త్‌క్లాస్‌లో బాగా చదివే స్టూడెంట్‌ రవిని రమ్మని, తన బండి మీద అలా తీసుకుని వెళ్లారు. ఒకచోట ఆపి బిస్కెట్‌ ప్యాకెట్‌ తీసుకున్నారు. ఒక బిస్కెట్‌ వాడికిచ్చి... ‘మీ క్లాస్‌లో పాఠాలు అంత బాగా చెబుతున్నా కిందటి సారి ఎవ్వరూ పాస్‌ అవ్వలేదు. కారణం ఏమిటి?’ అన్నారు. ‘నిజమే సార్‌, అంతా బాగా చెబుతారు. కానీ ఒకరు వదలగానే మరొకరు పాఠం చెప్పడానికి వచ్చేస్తారు. అందరికీ సిలబస్‌ అయిపోవాలనే తపనే తప్ప మాకు కొంత ఊపిరి తీసుకునే సమయం కూడా ఇవ్వరు. ఈసారి కూడా పాస్‌ అవ్వడం కష్టం. ఇలాగే అయితే..’ అన్నాడు.

‘అదేమిటి ఈ విషయం టీచర్లకు చెప్పలేదా!’ అన్నారు శేఖర్‌. ‘ఎవరు చెప్పనిస్తారు సార్‌. వచ్చీ రాగానే పాఠం మొదలు పెట్టేస్తారు. మధ్యలో మాట్లాడనివ్వరు. పీరియడ్‌ అవ్వగానే మరో తరగతికి పరుగులు తీస్తారు. ఈలోగా మరో మాస్టారు వచ్చేస్తారు. ఆయనా అంతే.. మా స్కూల్‌లో విద్యార్థులు ఫెయిల్‌ అయిన దగ్గర నుంచి ఈ ఒత్తిడి ఇంకా పెరిగింది’ అన్నాడు రవి. ఓహో.. పిల్లల మీద ఒత్తిడి ఈ విధంగా ఉందన్నమాట అనుకున్నారు శేఖర్‌.

హెడ్‌ మాస్టారిని కలిసి.. ‘సార్‌ ఇక మీదట డ్రిల్‌ పీరియడ్‌, డ్రాయింగ్‌ పీరియడ్‌ ప్రతి రోజు ఉండాల్సిందే. అలాగే ప్రతి పీరియడ్‌కు.. పీరియడ్‌కు మధ్యలో పది నిమిషాల సమయం ఉండాలి’ అన్నారు శేఖర్‌. ‘అలాగైతే ఎలా పాఠాలు పూర్తి కావద్దూ’ అన్నారు హెడ్‌ మాస్టర్‌. ‘నిజమే మీరన్నది. కానీ పిల్లల మీద ఒత్తిడి మీకే మాత్రం తెలియడం లేదు. ఇలాగే చెప్పుకుంటూ పోతే ఒక్కరూ పాస్‌ కారు. ఈ స్కూల్‌ మూసేసే పరిస్థితి వస్తుంది. నా మాట వినండి’ అన్నారు శేఖర్‌. డ్రిల్‌, డ్రాయింగ్‌ మాస్టార్లను కలిసి... ‘ఈ రోజు నుంచి మీ పీరియడ్లు మీరు తీసుకోండి. హెడ్‌మాస్టారుతో నేను చెబుతాను’ అన్నారు.

‘హమ్మయ్య.. ఇన్నాళ్లకు మాకు పని దొరికింది. మా పీరియడ్‌లలో కూడా లెక్కలు చెప్పాలని, సైన్స్‌ చెప్పాలని ఒక్కసారి కూడా జరగనివ్వడం లేదు సార్‌. హెడ్‌ మాస్టారుకు ఏమీ చెప్పలేక, ఊరికే కూర్చోలేక సతమతమౌతున్నాం’ అన్నారు వారు. ఆ రోజు నుంచి పిల్లలు ఆటపాటలు, డ్రాయింగ్‌లో కూడా పాల్గొంటున్నారు. క్లాస్‌ అయిన తరువాత విద్యార్థులతో మాస్టార్లు కాసేపు మాట్లాడాలి అన్న శేఖర్‌ విన్నపం మంచి మార్పు తెచ్చింది. పిల్లల్లో ఒత్తిడి తగ్గి జ్ఞాపకశక్తి పెరిగింది. అలా నెలరోజుల్లోనే ఆ స్కూల్‌ వాతావరణమే మారిపోయింది. తరువాత ఆ స్కూల్‌లో పదో తరగతి విద్యార్థులందరూ పాస్‌ అయ్యారు. పిల్లల మనసెరిగిన శేఖర్‌ మాస్టారును అందరూ అభినందించారు.

- కూచిమంచి నాగేంద్ర


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని