పిల్లలే గురువులు.. పెద్దలే విద్యార్థులు!

హలో నేస్తాలూ.. ఇప్పుడంటే మనల్ని అమ్మానాన్నలు బడికి పంపిస్తున్నారు కానీ తాతముత్తాతల కాలంలో ఎవరూ పెద్దగా చదువుకోలేదు కదా! కనీసం పేరు కూడా రాసుకోలేని అమ్మమ్మలు,

Published : 25 Aug 2022 00:21 IST

హలో నేస్తాలూ.. ఇప్పుడంటే మనల్ని అమ్మానాన్నలు బడికి పంపిస్తున్నారు కానీ తాతముత్తాతల కాలంలో ఎవరూ పెద్దగా చదువుకోలేదు కదా! కనీసం పేరు కూడా రాసుకోలేని అమ్మమ్మలు, తాతయ్యలకు కొందరు పిల్లలే గురువులయ్యారు. నిజంగా ఫ్రెండ్స్‌.. వారితో అక్షరాలు దిద్దిస్తూ.. చదువు కూడా చెబుతున్నారు. అదెక్కడో, ఎలా చేస్తున్నారో తెలుసుకోండి మరి..

ఝార్ఖండ్‌ రాష్ట్రంలో దంకా అనే గ్రామం ఒకటుంది. ఇక్కడి వారిలో అధికశాతం గిరిజనులే. లాక్‌డౌన్‌ సమయంలో విద్యార్థులు చదువుకునేందుకు ఇళ్ల గోడలపై ఏర్పాటు చేసిన బ్లాక్‌ బోర్డులు.. స్కూళ్లు తెరుచుకోవడంతో నిరుపయోగంగా మారాయి. ఇప్పుడవే బోర్డులను ఆ ఊరి విద్యార్థులంతా వారి అమ్మమ్మలకు, తాతయ్యలకు చదువు చెప్పేందుకు ఉపయోగిస్తున్నారు. అయితే, ఆ ఆలోచన మాత్రం అక్కడి ప్రభుత్వ పాఠశాల మాస్టారు సపన్‌ కుమార్‌దే.

ఆన్‌లైన్‌ క్లాసులు లేక..
కొవిడ్‌ కట్టడికి విధించిన లాక్‌డౌన్‌తో పాఠశాలలన్నీ మూతబడటంతో.. పిల్లలంతా ఆన్‌లైన్‌ క్లాసులకే పరిమితమయ్యారు. కానీ, ఈ ఊరి విద్యార్థులకు మాత్రం స్మార్ట్‌ఫోన్లు లేకపోవడంతో, కొందరికి ఉన్నా సిగ్నళ్లు అందకపోవడంతో చదువుకు దూరమయ్యారు. దాంతో విద్యార్థులకు ఎలాగైనా పాఠాలు చెప్పాలని సపన్‌ కుమార్‌ మాస్టారు ఓ వినూత్న ప్రయత్నం చేశారు. అదే ఊరిలోని ఇళ్ల గోడలకు బ్లాక్‌ బోర్డులు ఏర్పాటు చేయడం. స్థానికంగా దొరికే బురద, ఆవు పేడ, బూడిద, గంజి నీళ్లతో వీటిని తయారు చేశారు. మైక్‌ సెట్‌ సాయంతో టీచర్లు పాఠాలు చెబుతుంటే.. పిల్లలంతా ఆ బోర్డులపైనే రాసుకునేవారు. ఈ ప్రయత్నాన్ని అప్పట్లో ‘మన్‌ కీ బాత్‌’లో మన ప్రధాని నరేంద్ర మోదీ కూడా మెచ్చుకున్నారు.

నిరుపయోగంగా ఉన్నాయని..
లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత పాఠశాలలన్నీ యథావిధిగా తెరుచుకున్నాయి కదా! దాంతో దాదాపు 300కు పైగా బ్లాక్‌ బోర్డులన్నీ నిరుపయోగంగా మారాయి. వాటిని ఎలాగైనా ఉపయోగించుకోవాలని, ఆ మాస్టారు ఓ కొత్త ఆలోచన చేశారు. అదే.. అక్షరం ముక్క కూడా రాని తాతయ్యలు, అమ్మమ్మలు, నాయనమ్మలకు చదువు చెప్పించడం. ప్రతి ఆదివారం రెండు గంటలపాటు పిల్లలే ఆ బోర్డులపైన తమ ఇంట్లోని పెద్దలకు అక్షరాలు నేర్పిస్తున్నారు. ప్రతి ఒక్కరికీ వారి పేరుతోపాటు చిరునామా రాయడం వచ్చేలా చేస్తున్నారు. దీనికంతటికీ అయ్యే ఖర్చును సపన్‌ కుమార్‌ మాస్టారే సొంతంగా భరిస్తున్నారు. ఇప్పటివరకూ దాదాపు 138 మంది పెద్ద వయసు వారిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దారట. మనవళ్లు, మనవరాళ్ల దగ్గర చదువు నేర్చుకోవడం తమకు ఎంతో ఆనందాన్నిస్తుందని ఆ ఊరి పెద్దవాళ్లు మురిసిపోతున్నారు. ‘మా తాతయ్యకి పేరు రాయడం నేర్పించాను. ఇకనుంచి వేలిముద్ర వేయాల్సిన అవసరం లేదు. చదువు రాదనే చిన్నచూపూ ఉండదు’ అని ఓ అక్క చెబుతోంది. ‘నేను చిన్నప్పటి నుంచి అసలు బడికే వెళ్లలేదు. మా మనవడు అక్షరాలు నేర్పడంతో ఇప్పుడు సొంతంగా పేరు రాయగలుగుతున్నా’ అని ఓ తాతయ్య సంబరపడిపోతున్నాడు. మొత్తానికి ఈ మాస్టారి ఆలోచన భలే ఉంది కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని