పందెంలో ఓడిన సింహం!

ఒక అడవిలో సమీరం అనే ఎలుగుబంటి ఉండేది. దానికి పందెం కాయడమంటే మహా ఇష్టం. సమీరం తెలివితేటల గురించి విన్న మృగరాజు తనతో పందెం కాయడానికి రమ్మని ఎలుగుబంటికి ఆహ్వానం పంపింది. వెంటనే.. సింహం వద్దకు వచ్చింది ఎలుగుబంటి.

Updated : 26 Aug 2022 04:23 IST

ఒక అడవిలో సమీరం అనే ఎలుగుబంటి ఉండేది. దానికి పందెం కాయడమంటే మహా ఇష్టం. సమీరం తెలివితేటల గురించి విన్న మృగరాజు తనతో పందెం కాయడానికి రమ్మని ఎలుగుబంటికి ఆహ్వానం పంపింది. వెంటనే.. సింహం వద్దకు వచ్చింది ఎలుగుబంటి. ‘నీ గురించి చాలా విన్నాను. నాతో ఏవైనా మూడు పందేలు కాసి గెలువు చూద్దాం. నీవు అడిగింది ఇస్తాను’ అంది సింహం. సరేనంది ఎలుగుబంటి.

‘మహారాజా! నన్ను చూసి భయపడి పెద్దపులి పారిపోతుంది’ అని మొదటి పందెం కాసిందది. ‘అది జరగని పని’ అంది సింహం. ‘నా వెంట రండి’ అని ముందుకు నడిచింది ఎలుగుబంటి. దాన్ని అనుసరించింది సింహం. కొంతదూరం వెళ్లాక తన నివాసం బయట నక్కతో కబుర్లు చెబుతూ కనిపించింది పెద్దపులి. అటువైపుగా వేగంగా నడిచింది ఎలుగుబంటి. సింహం చెట్టు చాటున నిలబడి చూడసాగింది. అడుగుల శబ్దానికి నక్క, పులి తలతిప్పి చూడటంతో ఎలుగుబంటి కనిపించింది. దాన్ని చూడగానే పులి పరుగెత్తింది. నక్క కూడా పులితో పాటే వెళ్లిపోయింది. అది చూసి ‘ఎలుగుకు భయపడి పులి పరుగెత్తడమేంటి?’ అంటూ ఆశ్చర్యపోయింది సింహం.

‘నాకంతా అయోమయంగా ఉంది. రెండో పందెం ఏంటో చెప్పు?’ అని ఎలుగుబంటిని అడిగింది సింహం. ‘మహారాజా.. రేపు నా పుట్టినరోజు ఉంది. అందరినీ ఆహ్వానిస్తున్నాను. మీరు తప్పకుండా రావాలి. నా పుట్టినరోజు వేడుకలో గజరాజు చిందులేస్తుంది. ఇది రెండో పందెం’ అంది ఎలుగు. ‘గజరాజు ఏంటి.. ఎలుగుబంటి జన్మదిన వేడుకల్లో నాట్యం చేయడమేంటి.. అదంతా జరగని పని’ అని మనసులో అనుకుంటూ బయటకు మాత్రం సరేనంది సింహం. ‘మహారాజా.. నా పుట్టినరోజు వేడుకలకు చేపల రాజును, రాణిని ఆహ్వానించాను. వారు తప్పకుండా వస్తారు. ఇది నా మూడో పందెం’ అంది ఎలుగుబంటి.

‘చెరువులో ఉండే చేపలు జన్మదిన వేడుకలకు ఎలా వస్తాయి? అది కూడా జరగని పని’ అనుకుంటూ అలాగేనన్నట్లు తలూపింది సింహం. ‘మహారాజా.. మీరు మూడు పందేలు గెలవమన్నారు. నేను అదనంగా నాలుగోది కూడా కాస్తున్నాను. నా పుట్టినరోజు వేడుకలకు వచ్చిన జంతువులన్నీ నా కాళ్లు పట్టుకుని నమస్కరిస్తాయి. చూడండి’ అంది ఎలుగుబంటి. సింహానికి మతిపోయినంత పనైంది. ‘సరే చూద్దాం’ అందది. తరవాతి రోజు ఎలుగుబంటి జన్మదిన వేడుకలకు వెళ్లింది మృగరాజు. జంతువులన్నీ కానుకలతో వచ్చాయి. ‘గజరాజా.. నా పుట్టినరోజు సందర్భంగా నిన్ను ఒక కోరిక కోరుతున్నాను. నెమలితో కలిసి నాట్యం చేస్తూ.. అందరినీ ఆనందపరచాలి’ అంది ఎలుగు. ఏనుగు మారుమాట్లాడలేదు. తల, తొండం ఊపుతూ, కాళ్లను లయబద్ధంగా కదిలిస్తూ నాట్యం చేయసాగింది. అది చూసిన సింహం ఆశ్చర్యంతో తలగోక్కుంది.

ఇంతలో ఒక కోతి పల్లె నుంచి తెచ్చుకున్న డబ్బాలో నీళ్లు నింపి, అందులో చేపలను తీసుకొచి వచ్చింది. ‘మిత్రమా! నీ పుట్టినరోజు వేడుకలకు వస్తామంటున్న చేపల రాజును, రాణిని కూడా తీసుకొచ్చాను’ అని ఎలుగుతో అంది కోతి.  పుట్టినరోజు వేడుకలకు వచ్చిన చేపలను చూసి సింహానికి మతిపోయినంత పనైంది. ‘శెభాష్‌.. మూడు పందాలు గెలిచావు. పుట్టినరోజు కానుకగా ఏం కావాలో కోరుకో’ అని అడిగింది సింహం. ‘మహారాజా.. నన్ను ఒకరోజు ఈ అడవికి రాజుగా ప్రకటించండి’ కోరింది ఎలుగుబంటి. ‘అదెంత పని’ అంటూ.. ‘ఈ క్షణం నుంచి రేపు ఇదే సమయం వరకూ ఎలుగుబంటే ఈ అడవికి రాజుగా ఉంటుంది’ అని ప్రకటించింది సింహం.

వెంటనే జంతువులన్నీ పూలు చల్లి.. ఒక్కొక్కటిగా ఎలుగుబంటి పాదాలకు నమస్కరించసాగాయి. ‘మహారాజా.. నాలుగో పందెం కూడా గెలిచాను’ అంది ఎలుగు మెల్లిగా. సింహం విందు ఆరగించి.. జూలు గోక్కుంటూ గుహకు వెళ్లిపోయింది. ‘ఈ అడవిలోని నాలుగు ఎలుగుబంట్లలో ఒకదానికి భయంకరమైన అంటురోగం వచ్చిందని విన్నాను. అందుకే ఏ ఎలుగు కనిపించినా దూరంగా పరుగెడుతున్నానని పెద్దపులికి చెప్పి.. నన్ను చూడగానే పారిపోయేలా చేశావు. ధన్యవాదాలు మిత్రమా..’ అని నక్కతో అంది ఎలుగుబంటి.

‘గజరాజా.. ప్రతిరోజూ నీకు నేను తేనె తెచ్చి ఇస్తున్నందుకు ప్రతిగా.. మాట తప్పకుండా నా పుట్టినరోజు వేడుకల్లో నాట్యం చేసి అలరించావు. ధన్యవాదాలు’ అని ఏనుగుతో అంది ఎలుగు. చేపల రాజును, రాణిని తీసుకొచ్చిన కోతికీ కృతజ్ఞతలు తెలిసింది ఎలుగు. ‘ఏదో ఒకరోజు నేను ఈ అడవికి రాజునవుతానని మీ అందరితో పందెం కాశాను. మీరు అది జరగని పని అన్నారు. అదే జరిగితే కాళ్లు పట్టుకుని నమస్కరిస్తామన్న మీరు, మీమాట నిలబెట్టుకున్నందుకు చాలా సంతోషం’ అని జంతువులతో అంది ఎలుగు. అవి కూడా అవునన్నట్లు తలూపాయి. గుహకి వెళ్లాక.. ‘అసలు పందెం కట్టడమే చెడ్డ అలవాటు’ అనుకుంటూ నిద్రలోకి జారుకుంది సింహం.

- డి.కె.చదువులబాబు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని