నమ్మకమే గెలిచింది!

ఉదయగిరి రాజ్యానికి రాజు విక్రముడు. అతని పాలనను ఇతర దేశ రాజులూ ఎంతగానో మెచ్చుకునేవారు. ఉదయగిరికి పొరుగున ఉన్న సింహగిరిని జయంతుడు పాలించేవాడు. ఒకసారి సభ కొలువుతీరి ఉండగా విక్రముడి పాలన గురించి ప్రస్తావన వచ్చింది.

Updated : 27 Aug 2022 06:28 IST

ఉదయగిరి రాజ్యానికి రాజు విక్రముడు. అతని పాలనను ఇతర దేశ రాజులూ ఎంతగానో మెచ్చుకునేవారు. ఉదయగిరికి పొరుగున ఉన్న సింహగిరిని జయంతుడు పాలించేవాడు. ఒకసారి సభ కొలువుతీరి ఉండగా విక్రముడి పాలన గురించి ప్రస్తావన వచ్చింది. ‘ఆయన పాలనలో ప్రజలు కూడా ఎంతో నిజాయతీతో ఉంటారట’ అన్నారు పండితులు. ‘మహారాజా! నాకు ఆ రాజును, అక్కడి ప్రజలను ఒకసారి పరీక్షించాలని ఉంది. అనుమతి ఇవ్వండి’ అని కోరాడు మంత్రి ప్రభాకరుడు. ‘అలాగే వెళ్లిరండి’ అన్నాడు రాజు. ప్రభాకరుడి పెదనాన్న కొడుకు శంకరయ్య ఉదయగిరి రాజ్యంలోని రామాపురంలో ఉన్నాడు. మరుసటి రోజే ప్రభాకరుడు అతని ఇంటికి చేరుకున్నాడు. మంచీచెడూ మాట్లాడుకున్నాక భోజనం చేసి విశ్రాంతి తీసుకున్నాడు. ‘అన్నయ్యా! నీ పొలం వరకు వెళ్లి ఒకసారి చూసి వద్దాం పద’ అన్నాడు.

‘అలాగే తమ్ముడూ.. వెళ్దాం పద’ అన్నాడు శంకరయ్య. కాలినడకన పొలం చూసి వస్తూ.. ఆ బాటలో ఓ వరహాల సంచీని కావాలనే జారవిడిచాడు ప్రభాకరుడు. ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్లి.. కబుర్లు చెప్పుకొని నిద్రపోయారు. తెల్లవారింది.. ప్రభాకరుడు జారవిడిచిన సంచి రైతు చంద్రయ్యకు దొరికింది. దాన్ని తీసుకుని ఆ ఊరి గ్రామాధికారికి ఇచ్చి, ఎక్కడ దొరికిందో చెప్పాడు. ఒక గంట తరవాత గ్రామాధికారి పంపిన మనిషి ఆ ఊరిలో ప్రతి వీధి తిరుగుతూ.. ‘వినండి... వినండి.. ఎవరో మన ఊరిలోని శంకరయ్య పొలం వద్ద వరహాల సంచీని పారేసుకున్నారు. అది గ్రామాధికారి దగ్గర భద్రంగా ఉంది. పోగొట్టుకున్నవారు తగిన ఆధారాలు చూపి తీసుకోవచ్చు’ అని దండోరా వేయసాగాడు. ఆ విషయం ప్రభాకరుడి చెవిన కూడా పడింది. శంకరయ్యకు అనుమానం కలగకుండా గబగబా లేచి వెళ్లి, నిన్న వేసుకున్న చొక్కా జేబులో చూసుకొని.. ‘అన్నయ్యా! ఆ వరహాల సంచి నాదే’ అన్నాడు కంగారుగా.

‘మరేం ఫరవాలేదు తమ్ముడూ... నీ సొమ్ము ఎక్కడికీ పోదు. మా రాజ్యంలో ఎవరైనా ఏ వస్తువైనా పోగొట్టుకుంటే.. అది ఎవరికైనా దొరికితే.. గ్రామాధికారి దగ్గరికే చేరుతుంది. నేనూ నీ వెంట వచ్చి గ్రామాధికారికి విషయం చెబుతాను’ అన్నాడు శంకరయ్య. ఇద్దరూ గ్రామాధికారి వద్దకు వెళ్లాక.. ప్రభాకరుడు తగిన ఆధారాలు చూపించాడు. గ్రామాధికారి ఆ సంచీని ఇస్తూ... ‘మీ సొమ్మును ఇక్కడే సరిచూసుకోండి’ అన్నాడు. అతడు దాన్ని తెరిచి.. ‘మొత్తం పది వరహాలు ఉండాలి కానీ తొమ్మిదే ఉన్నాయి’ అన్నాడు దీనంగా. ‘చంద్రయ్య ఎలా తెచ్చిన సంచిని అలాగే జాగ్రత్త చేసి మీకు ఇచ్చాను’ సమాధానమిచ్చాడు గ్రామాధికారి.

‘మీ సమాధానం సంతృప్తికరంగా లేదు. రాజుగారి వద్దకు వెళ్లి ఫిర్యాదు చేస్తాను’ అన్నాడు ప్రభాకరుడు. చెప్పినట్లుగానే వెంటనే కోటకు వెళ్లి జరిగిన విషయాన్ని రాజు విక్రముడికి చెప్పాడు. మరుక్షణమే చంద్రయ్య, గ్రామాధికారిని సభకు పిలిపించాడు రాజు. ఇద్దరినీ విషయం అడిగాడు. ‘మహారాజా! సరిగ్గా శంకరయ్య పొలం దగ్గర నాకు సంచి దొరికింది. మీరు ప్రకటించిన ఉత్తర్వుల ప్రకారమే నేను నడుచుకున్నాను. దొరికిన వస్తువును దొరికినట్లే గ్రామాధికారికి అప్పగించాను. అందులో ఏముందో తెరిచి కూడా చూడలేదు’ సమాధానమిచ్చాడు రైతు చంద్రయ్య.

‘అవును మహారాజా! చంద్రయ్య తెచ్చిన సంచీని నేను కూడా చూడలేదు. శంకరయ్యతో పాటు ఆయన బంధువు ప్రభాకరుడు వచ్చి సంచి రంగు చెప్పిన తర్వాతే.. లోపల దాచిన దాన్ని బయటకు తీసుకొచ్చి చూపించాను. అందులో ఏమున్నాయో చెప్పిన తరవాతే.. ముడి విప్పి చూపించమన్నాను. లెక్కబెట్టగానే పదికి బదులు తొమ్మిదే ఉన్నాయని అన్నాడు’ అని వివరించాడు గ్రామాధికారి. ‘ప్రభాకరుడు మన అతిథి. నువ్వు, చంద్రయ్య కలిసి ఒక వరహాన్ని కాజేశారని నేను నమ్ముతున్నాను.. మీ ఇద్దరినీ చెరసాలలో పెట్టించి, రేపు సూర్యోదయం తరువాత మీ ఇద్దరి కుడి చేతులను నరకాల్సిందిగా తీర్పు ఇస్తున్నాను’ అని ప్రకటించాడు రాజు. సభలో ఎవ్వరూ మారు మాట్లాడలేదు.

సభ ముగియడంతో.. ‘తమ్ముడూ బయలుదేరదాం పద’ అని ప్రభాకరుడితో అన్నాడు శంకరయ్య. ‘ఒక్క క్షణం అన్నయ్యా..!’ అన్నాడతను. ‘మహారాజా! నన్ను క్షమించండి. సంచిలో ఒక వరహా తగ్గిందని నేనే అబద్ధం ఆడాను. కానీ.. నీతి, నిజాయతీ, న్యాయం, ధర్మం మీ రాజ్యంలో నాలుగు పాదాల మీద నడుస్తున్నాయని ప్రత్యక్షంగా చూశాను’ అన్నాడు ప్రభాకరుడు. ‘ప్రభాకరా.. మా రాజ్యంలోని ప్రజలు ఎలాంటి వారో నాకు తెలుసు. మీ నుంచి స్పందన రావాలనే చంద్రయ్య, గ్రామాధికారికి శిక్ష అని సభలో ప్రకటించాను’ అన్నాడు రాజు. అక్కడి నుంచి సెలవు తీసుకొని.. సింహగిరికి చేరుకున్న మంత్రి ప్రభాకరుడు.. ‘మహారాజా! మీరు చెప్పినట్లే విక్రముడి పాలన అద్భుతం’ అని కొనియాడాడు.

- యు.విజయశేఖర రెడ్డి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని