ఎవరి కష్టాలు వారివి!

పూర్వం కళింగ రాజ్యాన్ని రాజవర్ధనుడనే రాజు పాలించేవాడు. ఆయన ఆహార, విహార ప్రియుడు. ప్రతిరోజూ కొత్త దుస్తులు ధరించేవాడు. ఒంటి నిండా ఆభరణాలు, చేతి వేళ్లకు సరిపడా వజ్రపుటుంగరాలూ ఉండేవి. ఆయన అలంకరణ గురించి రాజ్యంలో కథలు కథలుగా చెప్పుకొనేవారు.

Published : 28 Aug 2022 00:23 IST

పూర్వం కళింగ రాజ్యాన్ని రాజవర్ధనుడనే రాజు పాలించేవాడు. ఆయన ఆహార, విహార ప్రియుడు. ప్రతిరోజూ కొత్త దుస్తులు ధరించేవాడు. ఒంటి నిండా ఆభరణాలు, చేతి వేళ్లకు సరిపడా వజ్రపుటుంగరాలూ ఉండేవి. ఆయన అలంకరణ గురించి రాజ్యంలో కథలు కథలుగా చెప్పుకొనేవారు.

ఆ రాజ్యంలో గోపాలుడని ఒక వ్యవసాయ కూలీ ఉండేవాడు. అతడు చాలా పేదవాడు. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. రాజుగారి వైభవం ప్రజలు వింతగా చెప్పుకుంటూ ఉంటే వింటూ ఉండేవాడు. ఒకసారి కొత్తగా కట్టిన గుడి ప్రారంభానికి రాజుగారు... గోపాలుడున్న ఊరు వచ్చారు. ఆయన వైభవాన్ని, చుట్టూ అడుగులకు మడుగులొత్తుతున్న మందీమార్బలాన్ని, అధికారగణాన్ని చూసి గోపాలుడికి ఒళ్లు పులకరించి పోయింది. ‘జన్మ అంటే అది! బతకడం అంటే అది! నా బతుకూ.. ఒక బతుకేనా? నాలాంటి వారిని దేవుడు ఎందుకు పుట్టిస్తాడో?’ అన్నాడు పక్కనే ఉన్న తండ్రితో. ఏమీ జవాబు చెప్పక మౌనంగా ఉండిపోయాడు తండ్రి. తర్వాత కొంతకాలం గడిచింది. ఉన్నట్టుండి రాజుగారు అనారోగ్యం పాలయ్యారు. వైద్యుల ప్రయత్నాలు ఒక పట్టాన ఫలించలేదు. ఇదే అదనుగా తీసుకుని కళింగ మీదకు హఠాత్తుగా దాడికి పాల్పడ్డాడు పొరుగు రాజ్యం రాజు సర్పకేతు. మంత్రి, సేనాధిపతి సైన్యాన్ని ఆగమేఘాల మీద సిద్ధం చేశాడు.

‘రాజుగారు ప్రస్తుతం యుద్ధభూమికి రాలేరు. ఈ పరిస్థితుల్లో ఆయన యుద్ధం చేయాలని కూడా మనం ఆశించకూడదు. ఏం చేయాలో తోచడం లేదు’ అని మంత్రి, సేనాధిపతి బాధపడసాగారు.

ఈ విషయం తెలిసి రాజుగారు ఆ ఇద్దరినీ పిలిచి.. ‘నేనూ యుద్ధానికి సిద్ధంగా ఉన్నాను.  నా అనారోగ్యాన్ని లెక్కపెట్టను. రాజు యుద్ధంలో ముందు ఉండకపోతే సైనికుల మానసికబలం దెబ్బతింటుంది. ధైర్యమే విజయాన్నిస్తుందని నా నమ్మకం. అన్ని ఏర్పాట్లూ చేయండి’ అన్నాడు. మంత్రి, సేనాధిపతి ఆశ్చర్యపోయారు. యుద్ధం ప్రారంభమైంది. రాజుగారి నిర్ణయం ప్రజలను విస్మయానికి గురిచేసింది. అనారోగ్యంతో ఉన్న రాజుగారికి యుద్ధంలో జరగరానిదేదైనా జరిగితే ఎలా అంటూ ప్రజలూ, అంతఃపురవాసులూ ఆందోళన చెందసాగారు. గోపాలుడు కూడా రాజుగారు అనారోగ్యంతో యుద్ధంలో పాల్గొనడం మీద ఎంతో ఆందోళన చెందాడు.

రాజుగారు చూపిన తెగువ సైన్యాన్ని బాగా ప్రభావితం చేసింది. యుద్ధసమయంలో ఒక పక్క రాజుగారిని వెన్నంటి ఉండి కాపాడుకుంటూనే, ప్రాణాలకు తెగించి పోరాడి సైనికులు విజయాన్ని సొంతం చేసుకున్నారు. తర్వాత కొద్దిరోజులకు రాజవైద్యులు మంచి మంచి మందులతో ఆయనకు పూర్తి ఆరోగ్యం చేకూర్చారు. ఆ తర్వాత ఒకరోజు గోపాలునితో తండ్రి.. ‘చూశావు కదా! నువ్వనుకున్నట్లు రాజపదవి పూలబాట కాదు. అది ముళ్ల కిరీటం! రాజ్యానికి ఏ ఆపద వచ్చినా, దాని ప్రభావం మొదట రాజు మీదే పడుతుంది. రాజు ఏదో వైభవంగా జీవిస్తున్నాడని మనం అనుకుంటాం కానీ, ఎప్పుడూ ఏదో ఒక ప్రమాదం పొంచి ఉంటుంది. ఎంతో జాగరూకతతో కాలం గడపాల్సి ఉంటుంది. రాజ్యరక్షణ కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధంగా ఉండక తప్పదు. ఆ విధంగా చూస్తే మనమే అదృష్టవంతులం. పగలంతా కష్టపడ్డా, రాత్రి ప్రశాంతంగా కంటినిండా నిద్రపోగలం. కానీ వారికా అదృష్టం ఉండదు. దూరపుకొండలు నునుపు అనుకోకు. ఎవరి బాధ్యతలు వారికుంటాయి. అలాగే ఎవరి బాధలు వారికుంటాయి. బరువులు, బాధ్యతలు, కష్టాలు, సుఖాలూ లేనివారు ఎవరూ ఉండరు. రాజు అయినా, పేద అయినా ఇవి తప్పనిసరి అన్నాడు. గోపాలుడికి జ్ఞానోదయం అయింది. తన జీవితం మీద అయిష్టం పోయి ఇష్టం ఏర్పడింది.

- గంగిశెట్టి శివకుమార్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని