నక్క వాదన.. మేకల సాధన

మేకల మందకు కాపలాగా కుక్కను పెంచసాగాడో రైతు. దానికి ఒళ్లంతా బద్ధకమే! సందు దొరికితే కునుకు తీసేందుకు ప్రయత్నించేది. నిద్ర రాకపోతే.. కనిపించిన వారితో పనికిరాని వాదనలు పెడుతుండేది. ప్రతిరోజూ మేకల మందను అడవికి తీసుకెళ్లేవాడు రైతు.

Published : 30 Aug 2022 00:09 IST

మేకల మందకు కాపలాగా కుక్కను పెంచసాగాడో రైతు. దానికి ఒళ్లంతా బద్ధకమే! సందు దొరికితే కునుకు తీసేందుకు ప్రయత్నించేది. నిద్ర రాకపోతే.. కనిపించిన వారితో పనికిరాని వాదనలు పెడుతుండేది. ప్రతిరోజూ మేకల మందను అడవికి తీసుకెళ్లేవాడు రైతు. తప్పనిసరి పరిస్థితుల్లో కుక్క కూడా మందతోపాటే వెళ్లేది. ఒకరోజు రైతుతోపాటు మంద అడవిలో తిరుగుతుంది. వెంట ఉన్న కుక్కకు చిరాగ్గా అనిపించింది. దగ్గరలో లేత చిగుళ్లున్న చెట్టు కనిపించడంతో రైతు అటుగా కదిలాడు. ఆ చెట్టు ఎక్కి.. కొమ్మలను విరిచి కింద పడవేస్తున్నాడు. ఆ చిగుళ్లను కొన్ని మేకలు తింటున్నాయి. మరికొన్ని మాత్రం చుట్టుపక్కల మేస్తున్నాయి.

ఇదే అదునుగా భావించిన కుక్క.. బద్ధకంతో అక్కడే కూలబడిపోయింది. ఇంతలో అటుగా వెళ్తున్న ఉడుతను చూసిన కుక్క.. ‘ఉడుతా.. ఓ మతిమరుపు ఉడుతా..’ అంటూ వెక్కిరించినట్టు పిలిచింది. పరుగు పెడుతున్న ఉడుతకు కోపం వచ్చింది. ‘వంకరతోక కుక్కబావా.. ఏమిటి సంగతి?’ అంటూ కుక్క ముందుకు వచ్చింది. ‘నన్నే వెక్కిరిస్తున్నావు.. తిక్క తిక్కగా ఉందా?’ అంటూ మొరిగింది కుక్క. ‘మతిమరుపంటూ నన్ను వెక్కిరించావు. అది తప్పు కాదా?’ సమాధానమిచ్చింది ఉడుత. ‘నాతోనే వాదనకు దిగుతున్నావా?’ అని ఉరిమి చూసింది కుక్క.

‘అనవసర మాటలు కట్టిపెట్టు. బద్ధకస్తుడికి మాటలెక్కువ.. పని తక్కువ’ అని మా అమ్మమ్మ ఎప్పుడూ చెబుతుండేదంటూ తుర్రున చెట్టెక్కింది ఉడుత. కుక్క చిన్నబోయి చుట్టూ చూసింది. మందలో మేకపిల్లలు గుట్ట, పుట్ట ఎక్కుతూ దొరికిన మేత తింటూ.. ఒకదాని తలతో మరొకటి ఢీకొట్టుకుంటూ ఆడుకుంటున్నాయి. అది చూసి ‘పరువు పోలేదు’ అనుకుంటూ కునుకు తీసింది కుక్క. ఢీ కొట్టుకొనే మేకపిల్లల ఆటలో వచ్చే శబ్దానికి కుక్కకు నిద్రాభంగమైంది. మేకపిల్లలపైన కోపంతో చిందులు వేసింది. ‘మిత్రమా! ఈ ఆట కూడా మాకు ఒక రకమైన విద్యే. ఇందులో సాధన చేస్తూ మెలకువలు నేర్చుకుంటాం. కునుకు నీకు ఎంత ఇష్టమో, ఈ ఆట మాకు అంత ఇష్టం’ అని తెగేసి చెప్పింది ఒక మేక పిల్ల.

‘బుర్రలు పగల గొట్టుకోవడం కూడా ఒక విద్యేనా?’ అంటూ వాదనకు దిగింది కుక్క. ‘కొన్ని విద్యలు కూటి కోసమైతే, మరికొన్ని ఆత్మరక్షణకు ఉపయోగపడతాయి. ఈ విధంగా సాధన చేస్తూ పట్టు సంపాదిస్తాం’ అని వివరణ ఇచ్చింది మేక పిల్ల. ‘చాలు చాలులే నీ బడాయి. అల్లరి పనులకు అందమైన అబద్ధంతో కప్పిపుచ్చడంలో నీకు నువ్వే సాటి’ అంటూ దెప్పి పొడిచింది కుక్క. ‘సాధన చేసుకొనేవాడికి వాదనలు అనవసరమని మా బామ్మ చెప్పింది. నీకు ఇబ్బందిగా ఉంటే మేమే దూరంగా పోతాం’ అని చెప్పి మందలో మిగతా మేకలను పిలుచుకెళ్లిందా మేకపిల్ల. 

‘వాదనలో దమ్ముండాలి. అది లేకనే పారిపోతున్నారు’ అంటూ వాటిని ఎగతాళి చేసింది కుక్క. ‘నువ్వు ఏమనుకున్నా మా ఏకాగ్రత సడలిపోదు. నీతో వాదన చేసేంత తీరిక మాకు లేదు’ అంటూ గుంపుతో సహా ముందుకు కదిలింది మేక పిల్ల. విజయగర్వంతో కుక్క భౌ.. భౌ అంటూ మొరిగింది. మిట్టమధ్యాహ్నం కావడంతో రైతు కునుకు తీయడానికి ఓ పెద్ద చెట్టును వెతుక్కుంటూ ముందుకు వెళ్లాడు. కుక్క మాత్రం బద్ధకంతో అక్కడే ఉండిపోయి కునికిపాట్లు పడసాగింది. కొద్దిసేపు గడిచాక అక్కడికో నక్క వచ్చింది. ‘నిన్నెప్పుడూ ఈ అడవిలో చూడలేదే..’ అంటూ కుక్కతో మాట కలిపింది. నక్క మాటలతో కుక్కకు ఒక్కసారిగా నిద్రమత్తు వదిలిపోయింది. యజమాని జాడ కోసం దిక్కులు చూడడం మొదలు పెట్టింది.

‘నిన్నే.. మృగరాజు ఇటే వస్తున్నారు. నువ్వు కనిపిస్తే నీ పని అంతే..’ అంటూ భయపెట్టింది నక్క. ‘నేను, మా యజమాని కలిసి మేకల మందకు కాపుగా వచ్చాం. మా యజమాని నిన్ను చూస్తే బడితెపూజ చేయగలడు’ అంటూ తప్పించుకొనే మార్గాలు వెతకసాగింది కుక్క. ‘అంతవరకూ నేనుంటానా.. ఇప్పుడే వెళ్లి.. సింహానికి నీ సంగతి చెప్పనూ’ అని లొట్టలేసుకుంటూ మేక పిల్లలవైపు చూసింది నక్క. ఇదంతా చూస్తున్న ఉడుత.. ‘కుక్క బావా.. తిక్క కుదిరిందా?’ అంటూ పగలబడి నవ్వింది.

వాదనతో నక్కను నిలువరించడం కష్టమన్న విషయాన్ని గుర్తించిన కుక్క.. దాని దృష్టి మరల్చాలని అనుకుంది. ‘ఆ గుంపులో నీకు నచ్చిన మేకను పట్టుకుపో’ అంటూ నక్కకు ఆశ చూపిందది. నిజమేనని నమ్మిన నక్క.. గబగబా సాధనలో ఉన్న మేకల మధ్యకు వెళ్లింది. వెంటనే అవన్నీ తమ తలలతో నక్కను ఓ పట్టుపట్టాయి. ఆ దెబ్బలతో నక్క ఒళ్లు హూనమైంది. బతుకుజీవుడా అనుకుంటూ.. అడవిలోకి పారిపోయింది. ‘మిత్రులారా! పసలేని వాదన ప్రాణానికి చేటు.. నిరంతర సాధనే మేలు’ అని తెలుసుకున్నానంటూ లెంపలేసుకుంది కుక్క. ‘వాదనకు, సాధనకు తేడా తెలుసుకున్నందుకు సంతోషం’ అంటూ చెట్టెక్కేసింది ఉడుత. 

- బి.వి.పట్నాయక్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని