వీరేంద్రుడు... వినాయకుడు!

గడిచిన రెండు రోజులుగా వీరేంద్రుడు దిగులుగా ఉంటున్నాడు. గదిలోకి వెళ్లి ప్రతిసారీ అద్దం ముందు నిలబడి తన ముఖాన్ని చూసుకుంటున్నాడు. మళ్లీ దీనంగా వచ్చి అరుగు మీద కూర్చుంటున్నాడు. అనంతుడు, వీరేంద్రుడిని గమనించాడు. ‘వీరేంద్రా..! బాధగా కనబడుతున్నావు?

Published : 31 Aug 2022 00:18 IST

గడిచిన రెండు రోజులుగా వీరేంద్రుడు దిగులుగా ఉంటున్నాడు. గదిలోకి వెళ్లి ప్రతిసారీ అద్దం ముందు నిలబడి తన ముఖాన్ని చూసుకుంటున్నాడు. మళ్లీ దీనంగా వచ్చి అరుగు మీద కూర్చుంటున్నాడు. అనంతుడు, వీరేంద్రుడిని గమనించాడు. ‘వీరేంద్రా..! బాధగా కనబడుతున్నావు? పైగా బడికి వెళ్లడం లేదు. కారణం ఏంటి’ అని అడిగాడు.

‘‘నాన్నా! నా స్నేహితులు నా కుడి బుగ్గ మీద ఉన్న నల్ల మచ్చను చూసి ‘మచ్చోడా’ అని పిలుస్తూ వెక్కిరిస్తున్నారు. నాకు ఏడుపొస్తోంది. అందుకే బడికి వెళ్లడం లేదు’ అని బాధగా అన్నాడు. ‘నువ్వు అవేమీ పట్టించుకోకుండా ఉండు. వాళ్లకు అప్పుడు నోరు నొప్పి పుట్టి ఇక అనడం మానేస్తారు!’ అని సర్దిచెప్పాడు అనంతుడు. కానీ వీరేంద్రలో బాధ తగ్గలేదు.

‘రేపు వినాయక చవితి కదా, మట్టితో వినాయకుడి బొమ్మలు చేద్దాం. నీకు ఇష్టం కదా!’ బాధ తగ్గించడం కోసం అన్నాడు అనంతుడు. ‘నాకు బాధగా ఉంది నాన్నా! నేను రాలేను. బొమ్మలు చేయలేను!’ అంటూ తిరిగి గదిలోకి వెళ్లిపోయాడు వీరేంద్రుడు. గదిలో ఉన్న వినాయకుణ్ని చూడగానే ఆశ్చర్య పోయాడు. గది అంతా మెరిసిపోతోంది. కానీ వినాయకుడిని చూస్తే బాధగా ఉన్నాడనిపించింది. ‘స్వామీ.. మీరు నిజంగా మీరేనా?’ ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు వీరేంద్రుడు.

‘అవును! వీరేంద్రా! నేను వినాయకుడినే. కానీ నా బాధ నీకు చెప్పుకోవాలని ఇలా వచ్చాను!’ అన్నాడు వినాయకుడు. ‘దేవుడైన మీకు బాధలా?’ మళ్లీ ఆశ్చర్యపోతూ అడిగాడు వీరేంద్రుడు. ‘బాధ పడే కొద్దీ బాధలు పెరుగుతున్నాయి. అదే నా బాధ. నా చిన్నప్పుడు మా అమ్మ పార్వతి.. గుమ్మం దాటి లోపలకు ఎవర్నీ రానివ్వద్దని నన్ను కాపలాగా పెట్టింది. అమ్మ మాట విన్న నేను మా నాన్న శివుడిని కూడా అడ్డుకున్నాను. ఇందులో నా తప్పు ఏమైనా ఉందా?’ అని వినాయకుడు వీరేంద్రుణ్ని అడిగాడు.
‘మీ కథ నాకు తెలుసు స్వామీ. ఇందులో మీ తప్పు లేదు’ అని బదులిచ్చాడు వీరేంద్రుడు. ‘చాలా బాగా చెప్పావు. కానీ నాన్న కోపానికి నా అందమైన తల నేల కూలింది. ఏనుగు తల నాకు శాశ్వతమైంది. తప్పు చేయక పోయినా తలను పోగొట్టుకున్నాను. అందుకే బాధ పడుతున్నాను!’ అని చెప్పాడు వినాయకుడు.

‘అప్పుడు వీరేంద్రుడు.. స్వామీ తల మారిందని బాధ పడకండి. మీ ప్రమేయం లేకుండా మారిన తల గురించి బాధ పడటం దేనికి? ఆటంకాలను తొలగించి, విజయాలను కలిగించే దైవం మీరు. అందుకే ఏ శుభకార్యం చేపట్టినా... ముందుగా మీకే పూజ చేస్తాం మేము. ఎన్ని లోకాలు తిరిగినా రాని ఫలితం తల్లిదండ్రుల చుట్టూ తిరిగితే వస్తుందని నిరూపించారు. అమ్మానాన్నల విలువను ఈ లోకానికి చాటి చెప్పారు. చిట్టి ఎలుకను వాహనంగా చేసుకున్నారు. అల్పజీవులను ఆదరించి.. అన్ని జీవులనూ సమానంగా చూడాలని సందేశమిచ్చారు. గణాలకు అధిపతి అయిన గణపతి మీరు. భక్తుల బాధలు తీర్చే మీరు బాధ పడకూడదు. నాన్న మీ గురించి నాకంతా వివరించారు. నేను చెప్పిందంతా నిజమే కదా స్వామీ!’ వినాయకుని ముందు వినయంగా నిలబడి చేతులు జోడించాడు వీరేంద్రుడు.

వీరేంద్రుడి మాటలు విన్న వినాయకుడు ఒక్కసారిగా పగలబడి నవ్వాడు. ‘తప్పుగా మాట్లాడానా స్వామీ? ఎందుకు నవ్వుతున్నారు?’ కొంచెం బాధపడుతూ అడిగాడు వీరేంద్రుడు. అప్పుడు వినాయకుడు.. ‘నా తల మారిందని, నన్ను బాధ పడవద్దని చెప్పావు సరే! మరి నీ బుగ్గ మీద చిన్న నల్లమచ్చ ఉందని బాధ పడవచ్చునా?’ వినాయకుడు అలా అడిగే సరికి ఆలోచనలో పడ్డాడు వీరేంద్రుడు.

‘చూడు, వీరేంద్రా! లావుగా ఉన్నానని చంద్రుడు నన్ను వెక్కిరించాడు. కానీ తరువాత తన తప్పు తాను తెలుసుకున్నాడు. అలా నిన్ను వెక్కిరించిన వాళ్లే తప్పు తెలుసుకుంటారు. కానీ మనం బాధ పడి సమయాన్ని వృథా చేసుకోకూడదు. నీకు చెప్పాలనే ఇలా వచ్చాను. బాధ పడినట్లుగా నటించాను!’ అని అసలు విషయం చెప్పాడు వినాయకుడు.

వినాయకుడి మాటలతో వీరేంద్రుడిలో మార్పు మొదలైంది. బాధ పూర్తిగా తగ్గిపోయింది. ‘నాకోసం వచ్చారు. బాధ తగ్గించారు’ అంటూ మళ్లీ చేతులు జోడించి నమస్కారం పెట్టాడు వీరేంద్రుడు. ‘వీరేంద్రా..! విజయోస్తు..!’ అంటూ దీవించి మాయమయ్యాడు వినాయకుడు. ‘స్వామీ! అంటూ ఒక్కసారిగా అరుస్తూ మంచంపై నుంచి లేచాడు వీరేంద్రుడు. అది కల అని తెలుసుకున్నాడు. అద్దం దగ్గరకు పోలేదు. మంచం దిగి నేరుగా అరుగు మీదకు వెళ్లాడు. అక్కడ నాన్న మట్టితో చేసిన వినాయకుడి బొమ్మలను మురిపెంగా చూశాడు.

‘నాన్నా! బడికి వెళతాను. మట్టితో చేసిన వినాయకుడి బొమ్మలతోనే పూజ చేయమని నా స్నేహితులకు చెబుతాను. మీరు చేసిన ప్రతిమల్లో కొన్ని వారికి ఉచితంగా ఇస్తాను!’ అని హుషారుగా అన్నాడు వీరేంద్రుడు. ‘చాలా సంతోషం వీరేంద్రా! నీలో మార్పు రావడానికి కారణం?’ అని అడిగాడు అనంతుడు. ‘వినాయకుడు.. నాన్నా!’ అని చేతుల్లో ఉన్న మట్టి వినాయకుడి బొమ్మలను చూపిస్తూ, వీరేంద్రుడు బదులిచ్చాడు.

- కె.వి.లక్ష్మణ రావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని