బొటనవేలి కన్నా చిన్న!

హాయ్‌ నేస్తాలూ..! మీ ఇంట్లో నాన్నగారు కానీ, మీ తాతగారు కానీ న్యూస్‌ పేపర్‌ చదివేటప్పుడు మీరు ఓ విషయం గమనించారా. అది ఏంటంటే వాళ్లు ఆ సమయంలో కళ్లద్దాలు పెట్టుకుని ఉంటారు!

Published : 31 Aug 2022 00:18 IST

హాయ్‌ నేస్తాలూ..! మీ ఇంట్లో నాన్నగారు కానీ, మీ తాతగారు కానీ న్యూస్‌ పేపర్‌ చదివేటప్పుడు మీరు ఓ విషయం గమనించారా. అది ఏంటంటే వాళ్లు ఆ సమయంలో కళ్లద్దాలు పెట్టుకుని ఉంటారు! కానీ ఈ న్యూస్‌పేపర్‌ చదవాలంటే కేవలం కళ్లద్దాలు ఉంటే సరిపోదు. భూతద్దమూ ఉండి తీరాల్సిందే! కాస్త ఆశ్చర్యంగా ఉంది కదూ..! కానీ ఇది నిజంగా నిజం. మరి ఇంకెందుకాలస్యం ఈ కథనం చదివేయండి. మీకే పూర్తి వివరాలు తెలుస్తాయి సరేనా!

టెర్రానోస్త్రా... ఏంటి.. అలా చూస్తున్నారు. పలకడానికి కాస్త ఇబ్బందిగా ఉంది కదూ. ఇదే ఆ బుజ్జి పత్రిక పేరు మరి. ఇది పోర్చుగల్‌కు చెందిన న్యూస్‌పేపర్‌. 2012లో 3000 బుజ్జి పత్రిక కాపీలను అచ్చేశారు. ఈ పత్రిక పొడవు 25.35 మిల్లీమీటర్లు, వెడల్పు 18.27 మిల్లీమీటర్లు. అంటే మన బొటనవేలి కన్నా చిన్న అన్నమాట. దీన్ని చదవాలంటే కచ్చితంగా భూతద్దం ఉండాల్సిందే. ఇంతకీ ఈ పత్రిక బరువెంతో తెలుసా... కేవలం 1 గ్రాము మాత్రమే. ప్రస్తుతానికి ఇదే ప్రపంచంలోకెల్లా అతిచిన్న వార్తాపత్రిక. అందుకే ఇది ‘గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’లోనూ స్థానం సంపాదించింది. పత్రికను ఇలా చిన్నగా ముద్రించినందుకు పాఠకుల నుంచి చాలా ప్రశంసలూ వచ్చాయి. కెనడా, బ్రెజిల్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, నెదర్లాండ్స్‌, జపాన్‌ ప్రజల నుంచి సైతం.. తమకూ ఈ బుజ్జి పత్రిక కాపీలు కావాలని వినతులు వచ్చాయి. ఈ బుజ్జి పత్రికలు అమ్మగా వచ్చిన డబ్బులను ఆ యాజమాన్యం వారు సేవాకార్యక్రమం కోసం వెచ్చించారట.


ఇంతకు ముందు...

ఈ రికార్డు ఇంతకు ముందు మరో పత్రికకు ఉండేది. దాని పేరు ‘ఫస్ట్‌ న్యూస్‌’. ఇది 2007లో ప్రపంచంలోకెల్లా అతిచిన్న పత్రికగా ‘గిన్నిస్‌బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’లో స్థానం పొందింది. ఇది లండన్‌ కేంద్రంగా విడుదలైన ఓ పిల్లల పత్రిక. తర్వాత దీని రికార్డును టెర్రానోస్త్రా బద్దలు కొట్టింది. నేస్తాలూ.. మొత్తానికి ఇవీ విశేషాలు. ఈ బుజ్జి పత్రికల సంగతులు భలే ఉన్నాయి కదూ!



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని