అసలైన మిత్రులు

ఎదిర గుట్టల అడవిలో ఒక సింహం ఉంది. అడవిలో జంతువులు, పక్షులకు ఏ కష్టం వచ్చినా, జబ్బు చేసినా, తానే స్వయంగా వారి వద్దకు వెళ్లి ధైర్యం చెప్పి అవసరమైన సహాయం చేసేది. సింహం చేస్తున్న మంచి పనులతో, అది ఆ అడవిలోని అన్నిటికి పెద్దదిక్కులా మారింది.

Published : 02 Sep 2022 00:46 IST

ఎదిర గుట్టల అడవిలో ఒక సింహం ఉంది. అడవిలో జంతువులు, పక్షులకు ఏ కష్టం వచ్చినా, జబ్బు చేసినా, తానే స్వయంగా వారి వద్దకు వెళ్లి ధైర్యం చెప్పి అవసరమైన సహాయం చేసేది. సింహం చేస్తున్న మంచి పనులతో, అది ఆ అడవిలోని అన్నిటికి పెద్దదిక్కులా మారింది. అడవిలోని జీవులన్నింటికి తన మీద ప్రేమాభిమానాలు పెరిగాయి.

అది చూసిన కొన్ని జంతువులు వాటిలోని సహజ గుణం కొద్దీ అక్కసుతో... మెచ్చుకోకపోయినా మిగతా జంతువులకు సింహంపై చెడుభావం కలిగించడానికి విశ్వప్రయత్నాలు చేసి విఫలమయ్యేవి.

సింహం ఎదురుగా మాత్రం కపట ప్రేమాభిమానాలు కనబరిచేవి. ఇలా కాలం గడుస్తుండగా ఒకసారి వర్షాకాలంలో ఉన్నట్టుండి అడవిలోని జంతువులు, పక్షులకు వరుసగా చిన్న, పెద్ద ఆరోగ్య సమస్యలు వచ్చాయి. అవి ఎంతో ఆందోళన చెందాయి. సింహం స్వయంగా వెళ్లి జబ్బు పడ్డ జంతువులు, పక్షులను పరామర్శించింది. అనుభవమున్న ఎలుగుబంట్లను వైద్యసేవలకు నియమించింది. వైద్యానికి కావాల్సిన దుంపలు, ఆకు పసర్ల కోసం వాటి సేకరణలో ఆరితేరిన పందులు, కొండముచ్చులను నియమించింది.
సమష్టి కృషితో కొద్దిరోజుల్లోనే అడవిలోని జీవాలకు జబ్బులు తగ్గుముఖం పట్టాయి. తర్వాత అవి ఆరోగ్యంతో, సంతోషంగా జీవించసాగాయి. ఇలా ఉండగా ఒకరోజు పొద్దున్నే సింహం నిద్ర లేచేసరికి రెండు కళ్లు అంటుకుపోయాయి. కళ్లు తెరవడం కష్టమైంది, బలవంతంగా తెరిచి చూసినా ఏమీ కనిపించని పరిస్థితి. రెండు కళ్లూ ఎర్రగా అయ్యాయి. చేసేదిలేక కళ్లు తెరవకుండానే పడుకున్న చోటే కదలకుండా ఉండిపోయింది. తన కంటి సమస్య గురించి ఏమి చేయాలని ఆలోచించింది.

విషయం తెలిసిన అడవిలోని జీవులన్నీ సింహం గుహకు చేరుకున్నాయి, ఒక్కొక్కటిగా లోపలికి వెళ్లి చూడలేని స్థితిలో ఉన్న సింహానికి తమ పేరు చెప్పుకొని మరీ ఆరోగ్య పరిస్థితి గురించి ప్రశ్నల వర్షం కురిపించసాగాయి. ఒకవైపు కళ్ల మంట, మరో వైపు తనను పరామర్శించడానికి వచ్చిన వారికి సమాధానం చెప్పే పనితో సింహానికి బాధ మరింత ఎక్కువైంది. సింహానికి దగ్గరగా కూర్చుని... ‘అభిమానం అంటే ఇలా ఉండాలి. మిత్రుడికి కష్టం వచ్చిందని తెలియగానే ఆడవంతా కదిలి వచ్చింది’ అంది నక్క. ‘అవును అందరూ వచ్చారు. కానీ కొండ గొర్రె మాత్రం కనిపించలేదు’ అంది మరో నక్క.

‘లేదబ్బా.. నేను వచ్చినప్పుడు బయట ఎలుగుబంటి పక్కన కబుర్లాడుతూ కనిపించింది’ అంది మరో నక్క. ‘వచ్చి వెళ్లి పోవడం కాదు. కష్టాల్లో ఉన్నప్పుడు దగ్గరగా ఉండి చూసుకోవాలి’ అంది అది అందరికీ వినబడేటట్టు.

‘ఏమి చేస్తాం. చేసిన మేలు మర్చిపోయే బుద్ధిహీనులు అంతే’ అంది కొండ గొర్రె మీద సింహానికి చెడు భావం కలిగించాలనే ఉబలాటంతో ఆ నక్క. అలా సింహాన్ని పరామర్శించడానికి వచ్చే వాళ్లు, పోయే వాళ్లతో అక్కడ అంతా కోలాహలంగా ఉంది. అదంతా వింటున్న సింహానికి, తనపై అడవి జీవాలు చూపుతున్న అభిమానానికి సంతోషం కలిగినా కంటి బాధ తగ్గడం లేదు. అంత బాధలోనూ అంతకుముందు కొండ గొర్రె గురించి నక్కలు అనుకున్న మాటలు గుర్తొచ్చి సింహం ఆలోచనలో పడింది. దానికి తను ఎప్పుడైనా నష్టం కలిగించానా? ఇబ్బంది పెట్టానా? దగ్గరకు వచ్చి పలకరించనేలేదు అని తనలోతాను అనుకుంది. అలా ఆరోజు గడిచింది.

మర్నాడు కూడా సింహం కళ్ల పరిస్థితి మారలేదు. ఎలుగుబంట్లు తమకు తెలిసిన వైద్య సేవలు మొదటి నుంచి చేస్తూనే ఉన్నాయి. ఫలితం మాత్రం లేదు. బారెడు పొద్దు ఎక్కేసరికి కొండ గొర్రె పెనుగోలు గుట్టల్లో కంటి వైద్యంలో బాగా అనుభవం గల రెండు ఎలుగుబంట్లను వెంటబెట్టుకుని అక్కడికి చేరింది. అవి రెండూ సింహం కళ్లకు అన్ని పరీక్షలు చేశాయి. తర్వాత ఏవో మందులు వాడి సింహానికి కళ్లు కనబడేలా చేశాయి. కొండ గొర్రె తన కోసం పడిన కష్టానికి, తాపత్రయానికి ఎంతో ఆనందించి, అభినందించింది సింహం. ‘ఈ సేవాబుద్ధి మిమ్మల్ని చూసే నేర్చుకున్నా’ అంది కొండ గొర్రె.

- అమ్మిన శ్రీనివాసరాజు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని