గూడు గోడు తీరేలా...!

పెరుగుతున్న ధరలు ఒక వైపు... తగ్గుతున్న ఆదాయాలు మరో వైపు.. మధ్యతరగతి ప్రజలకు భారమవుతున్నాయి సొంతింటి కల దూరమవుతోంది.. కానీ ఓ నేస్తం వారికి గూడు చేరువయ్యేలా

Published : 02 Sep 2022 00:46 IST

పెరుగుతున్న ధరలు ఒక వైపు... తగ్గుతున్న ఆదాయాలు మరో వైపు.. మధ్యతరగతి ప్రజలకు భారమవుతున్నాయి సొంతింటి కల దూరమవుతోంది.. కానీ ఓ నేస్తం వారికి గూడు చేరువయ్యేలా ప్రయత్నిస్తున్నాడు.. ఇంతకీ ఎవరా నేస్తం?.. ఏంటా ప్రయత్నం..? తెలుసుకుందామా.. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఎంచక్కా ఈ కథనం చదివేయండి... మీకే తెలుస్తుంది అసలు విషయం!

ఆరవ్‌ గాంధీ. వయసు 17 సంవత్సరాలు. ప్రస్తుతం జైపుర్‌లో 12వ తరగతి చదువుతున్నాడు. ఇల్లులేని పేదవారికి ఓ గూడు ఇవ్వడం కోసం తక్కువ ఖర్చుతోనే ఓ ‘కంటైనర్‌ హోం’ తయారు చేశాడు.

100 ఇళ్లు లక్ష్యంగా..
ఇల్లులేని 500 మంది కోసం దాదాపు 100 కంటైనర్‌ ఇళ్లను నిర్మించాలనుకుంటున్నాడు. ప్రస్తుతం ఈ పనిలో భాగస్వాముల కోసం చూస్తున్నాడు. ఈ ‘కంటైనర్‌ హోం’ నిర్మాణానికి దాదాపు రీసైకిల్డ్‌ మెటీరియల్‌ను వాడేలా చూశాడు.

బాల్యం నుంచే..
ఆరవ్‌కు చిన్నప్పటి నుంచే ఆర్కిటెక్చర్‌, నిర్మాణ రంగమంటే చాలా ఇష్టం. మనదేశంలో చాలా మంది ఇల్లు లేని వారున్నట్లు తెలుసుకున్నాడు. వారిలో కొంతమందికైనా సొంతింటి కలను తీరుద్దామనుకున్నాడు.

ఆఫీసును చూసి...
సెప్టెంబర్‌ 2021న ఆరవ్‌ వాళ్ల నాన్న పనిచేసే ఫ్యాక్టరీకి వెళ్లాడు. అక్కడ ఓ పాత కంటైనర్‌ను ఆఫీసు కార్యాలయంగా మార్చి ఉండటాన్ని గమనించాడు. అప్పుడే ఆరవ్‌కు ఓ అద్భుతమైన ఆలోచన వచ్చింది. ఇలాంటి కంటైనర్లతో పేదవారి కోసం ఇళ్లెందుకు నిర్మించకూడదు అని.

విరాళాల సేకరణతో..
కొన్ని నెలల తర్జన భర్జనలు, శ్రమ అనంతరం మొదటి కంటైనర్‌ ఇల్లు తయారైంది. ఇందులో నలుగురు కుటుంబసభ్యులు హాయిగా నివసించవచ్చు. విరాళాల సేకరణ ద్వారా కేవలం మూడు నెలల్లోనే దాదాపు అయిదు లక్షల రూపాయలు పోగయ్యాయి. అలా వచ్చిన ధనంతోనే మొదటి కంటైనర్‌ హోంను ఆరవ్‌ సిద్ధం చేశాడు. ఈ ఇంటిమీద సోలార్‌ ప్యానళ్లను కూడా బిగించాడు.

దక్కిన గుర్తింపు..
ఆరవ్‌ ప్రాజెక్ట్‌కు మనదేశంతోపాటు, విదేశాల్లోనూ గుర్తింపు దక్కింది. ఐక్యరాజ్యసమితి గ్లోబల్‌ గోల్స్‌ వీక్‌లో ప్రసంగించేందుకు ఆహ్వానం అందింది. అలాగే గృహనిర్మాణ శాఖ అధికారుల నుంచి కూడా పిలుపు వచ్చింది. ఎంతైనా గ్రేట్‌ కదా! పేదల కోసం తపిస్తున్న మన ఆరవ్‌ మంచి ఆశయం నెరవేరాలని, ఎంతో మంది ప్రజలకు సొంతింటి కల నిజం కావాలని మనమూ మనసారా కోరుకుందామా మరి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని