సమయస్ఫూర్తి

ఒక అడవిలో మందతో పాటు తిరుగుతున్న నాలుగు మేకలు దారితప్పాయి. మందను వెతుక్కుంటూ నడిచి నడిచి అలసిపోయాయవి. ‘మిత్రులారా! శక్తి సన్నగిల్లింది. తిన్న ఆహారాన్ని నెమరు వేసుకుంటూ కొద్దిసేపు విశ్రాంతి తీసుకుందాం. మరలా శక్తి పుంజుకున్నాక ప్రయాణం సాగిద్దాం.

Published : 03 Sep 2022 00:18 IST

ఒక అడవిలో మందతో పాటు తిరుగుతున్న నాలుగు మేకలు దారితప్పాయి. మందను వెతుక్కుంటూ నడిచి నడిచి అలసిపోయాయవి. ‘మిత్రులారా! శక్తి సన్నగిల్లింది. తిన్న ఆహారాన్ని నెమరు వేసుకుంటూ కొద్దిసేపు విశ్రాంతి తీసుకుందాం. మరలా శక్తి పుంజుకున్నాక ప్రయాణం సాగిద్దాం. ఇది ప్రమాదకరమైన అడవి. ఇక్కడ ఐకమత్యంగా మెలగకపోతే క్షణ క్షణం ప్రాణగండమే. సమయస్ఫూర్తితో ఉంటూ అడవిని దాటాలి’ అంటూ గెడ్డం ఉన్న మేకపోతు మిత్రులకు హితబోధ చేసింది. అవన్నీ సరేనన్నాయి. అన్నీ కలిసి చెట్టు నీడన విశ్రాంతి తీసుకోడానికి కూర్చున్నాయి. అదే అడవిలో నివసించే నక్క, తోడేలు, ఎలుగుబంటి మంచి మిత్రులు. అవి కలిసి తిరుగుతూ సులభంగా ఆహారం సంపాదించే మార్గాలను వెతుకుతుంటాయి. అలాంటి వాటికి ఈ మేకలు కనిపించాయి. ‘నక్క మిత్రమా! ఒక మేకను ఇటు ఈడ్చుకొస్తే మన కడుపులు నిండుతాయా?’ అడిగింది తోడేలు. ‘నీ ఆలోచన భేష్‌. నాకంటే నువ్వే శక్తిమంతురాలివి’ అంటూ ఉత్సాహపరిచింది నక్క. ఒక్కొక్కరుగా అయితే కుదిరేలా లేదు కానీ కలిసికట్టుగా పని కానిచ్చేద్దామని నిర్ణయించుకున్నాయవి.

ఎలుగుబంటి నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ చెట్టు చాటు నుంచి మేకలను గమనించింది. అవి పెద్ద చెట్టు నీడన దవడలు ఆడిస్తూ కనిపించాయి. వాటిలో గెడ్డం పెరిగిన మేకపోతు నిలబడి మే.. మే.. అంటూ దవడలు ఆడిస్తూ తన వాడైన కొమ్ములను అటూఇటూ తిప్పసాగింది. మేకపోతును చూశాక ఎలుగుబంటికి భయం వేసింది. వెనక్కి వచ్చి మిత్రులకు చెప్పింది. గెడ్డం ఉందంటే.. ఆ మేకపోతు తపస్సు చేసి ఉంటుందేమోనని అనుమానాన్ని వ్యక్తం చేసింది నక్క.

‘నీ అనుమానం నిజమేననిపిస్తోంది. గెడ్డం మేకతోపాటు మిగిలినవి కూడా నోరు కదుపుతున్నాయి. అనవసర చర్చలు కట్టిపెట్టండి’ అంది తోడేలు. అయితే, వాటి సంగతి నువ్వే తేల్చుకొనిరా అంటూ తోడేలును పురమాయించాయి నక్క, ఎలుగుబంటి. తన ధైర్యాన్ని నిరూపించుకోవడానికి మేకల ముందుకు వెళ్లి నిల్చుంది తోడేలు. నక్క, ఎలుగుబంటి మాత్రం చెట్టు చాటు నుంచి నక్కినక్కి చూస్తున్నాయి.

‘మేకలారా! మీకు ఏమైనా మహిమలున్నాయా?’ అని నిలదీసింది తోడేలు. లోలోపల భయపడుతూనే.. ‘నా గెడ్డం చూశావా.. కొన్ని సంవత్సరాలపాటు తపస్సు చేశాకే ఇది వచ్చింది. వీళ్లు నా శిష్యులు. నాకు వచ్చిన విద్యలను వీళ్లతో నెమరు వేయిస్తున్నాను. ప్రాణరక్షణ కోసం ఈ విద్యలు ఉపయోగపడతాయి’ అని గంభీరంగా చెప్పింది గెడ్డం మేకపోతు. ‘అయితే... నీ మహిమ తెలుసుకోవాలని ఉంది’ అంటూ దురుసుగా అడిగింది తోడేలు. ‘ఆ చిన్న చిన్న చెట్ల ఆకులు తింటే నోటి నుంచి రక్తం వస్తుంది. పొదలపైనున్న ఆ ఆకులను తాకావో అంతే...’ అంటూ గంభీరంగా చెప్పింది గెడ్డం మేకపోతు. ‘నీ మహిమ ఏపాటిదో నేను పరీక్షిస్తాను’ అంటూ ఒక అడుగు ముందుకు వేసి.. చిన్న చిన్న చెట్ల చిగుళ్లను నోటితో అందుకొని నమలసాగింది. ‘ఇంకా రక్తం రాలేదేంటి?’ అంటూ మేకను ఆటపట్టిస్తూ గెంతులేసింది తోడేలు. అంతటితో ఆగక, పొదలపైనున్న ఆకులను వీపుతో తాకింది. ఇక అంతే... ఆ తోడేలు అరుపులతో అడవి మొత్తం దద్దరిల్లిపోయింది.

ఆ అరుపులకు నక్క, ఎలుగుబంటి అక్కడికి వచ్చాయి. దురద, మంట అంటూ గగ్గోలు పెడుతున్న తోడేలు నాలుక,  నోటిలోపల భాగం ఎరుపెక్కడాన్ని గమనించాయవి. ‘మిత్రమా.. ఏం జరిగింది? నీ నోరు ఎరుపెక్కిందేంటి?’ అని భయంభయంగా అడిగాయి. ఆ మాటలతో తోడేలు బాధ రెట్టింపైంది. ఏం చేయాలో తెలియక వెంటనే అవి ఆ మేకల దగ్గరకు వెళ్లాయి. ‘పొరపాటు జరిగింది. మీ అద్భుత శక్తులతో మా మిత్రుడి బాధను మటుమాయం చేయరూ’ అంటూ ప్రాధేయపడ్డాయి. అయితే, ఆ చిట్టి ఆకులను నీ తోడేలు మిత్రుడిని తాకి చూడమని చెప్పు’ అంది గెడ్డం మేకపోతు. అది చెప్పినట్లే.. చిట్టి ఆకులను తాకింది తోడేలు. వెంటనే అవి ముడుచుకుపోయాయి. ‘ఆ ఆకులు మళ్లీ విచ్చుకునే వరకు తోడేలు అక్కడే ఉండాలి. అప్పుడే మీ మిత్రుడి బాధ తొలగిపోతుంది. అడుగు కదిలినా ఇక అంతే..’ అంటూ హెచ్చరించింది గెడ్డం మేకపోతు.

మిత్రుడికి తోడుగా నక్క, ఎలుగుబంటి కూడా అక్కడే ఉండి, ఆ ఆకులు ఎప్పుడు విచ్చుకుంటాయా అని చూడసాగాయి. ధ్యానం పేరు చెప్పి.. ఆ మూడు మేకలు నెమ్మదిగా అక్కడి నుంచి తప్పించుకున్నాయి. బతుకుజీవుడా అనుకుంటూ.. మందను కలిసేందుకు నడక వేగాన్ని పెంచాయి. దారిలో మిగిలిన మేకలు ‘మిత్రమా.. నీ దగ్గర నిజంగా అద్భుత శక్తులు ఉన్నాయా?’ అని గెడ్డం మేకపోతును అడిగాయి. ‘మంత్రం కాదు.. తంత్రం లేదు. అది సమయస్ఫూర్తి. చిన్న చిన్నవి గోరింటాకు ఆకులు. అవి నమలడంతోనే తోడేలు నోరు ఎరుపెక్కింది. దురద పెట్టే ఆకులను ముట్టుకోవడంతో విపరీతంగా దురద పెట్టింది. మూడోది అత్తిపత్తి ఆకులు. వాటిని తాకితే ముడుచుకుపోతాయి. అవి తిరిగి తెరుచుకోడానికి సమయం పడుతుంది కాబట్టి వాటి దృష్టి అటు మరల్చి మనం ఇటు జారుకున్నాం’ అని వివరించింది గెడ్డం మేకపోతు.

- బి.వి.పట్నాయక్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని