దోమ... దోమ.. అమ్మో దోమ!

బంటి: తాతయ్యా... ఈ రోజు ఆదివారం కదా.. నాకో కథ చెప్పవా... తాతయ్య: కథా...! కథ కాదు కానీ.. నీకో ఆసక్తికరమైన విషయం చెబుతా. సరేనా!

Published : 04 Sep 2022 00:18 IST

బంటి: తాతయ్యా... ఈ రోజు ఆదివారం కదా.. నాకో కథ చెప్పవా...
తాతయ్య: కథా...! కథ కాదు కానీ.. నీకో ఆసక్తికరమైన విషయం చెబుతా. సరేనా!

బంటి: ఆసక్తికరమైన విషయమా...? ఏంటది తాతయ్యా...
తాతయ్య: దోమల్ని పట్టుకోవడం గురించి...

బంటి: దోమల్ని పట్టుకోవడమా?.. వాటిని పట్టుకొని చంపడానికి దోమల బ్యాట్‌ ఉందిగా...
తాతయ్య: చంపడానికి కాదు బంటీ... ప్రయోగాల కోసం...

బంటి: ప్రయోగాలకా.. నిజంగానే ఆసక్తిగా ఉంది తాతయ్యా..! త్వరగా చెప్పండి.

తాతయ్య: అది ముంబయిలోని ఓ మురికివాడ. అక్కడ ఓ వ్యక్తి చేతిలో టార్చిలైట్‌, నోటిలో చిన్న పైపుతో ఓ పాడుబడిన ఇంట్లో చీకటి గదిలో తిరుగుతున్నాడు. ఒక్కసారిగా అతని కళ్లు మెరిశాయి. వెంటనే పైపు మరో కొనను గోడ మీద పెట్టి... నోటిలో ఉన్న పైపు మరో కొనద్వారా లోపలికి గట్టిగా గాలి పీల్చాడు. అంతే.. గోడమీద వాలి ఉన్న దోమ ఆ పైపులోకి వెళ్లింది. ఆ వ్యక్తి వెంటనే పైపు కొనను తన వేలితో మూసివేశాడు. మళ్లీ కాసేపాగి మరో దోమనూ అలాగే లోపలికి పీల్చాడు.

బంటి: మరి ఆ దోమలు అతని నోట్లోకి వెళ్లవా తాతయ్యా?
తాతయ్య: వెళ్లవు బంటీ.. ఎందుకంటే.. ఆ పైపు ప్రత్యేకమైంది. దానికి లోపల ఓ ఫిల్టరు ఉంటుంది. అది దోమల్ని అతని నోట్లోకి వెళ్లకుండా అడ్డుకుంటుంది. ఇంతకీ అతను ఎవరంటే ముంబయి నగరపాలిక వాళ్లు నియమించుకున్న కీటకాల సేకర్త. ఇలా పైపు ద్వారా సేకరించిన దోమల్ని అతడు జాగ్రత్తగా పరీక్షనాళికలోకి పంపి, దాని మూతను మూసేస్తాడు.

బంటి: అవునా.. తాతయ్యా... అయినా ఇదంతా ఎందుకు?
తాతయ్య: నీకు ముందే చెప్పాగా బంటీ.. ప్రయోగాల కోసమని. వాటిని ముంబయి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రయోగశాలకు పంపిస్తారు. అక్కడ వాళ్లు ఆ దోమల మీద ప్రయోగాలు చేస్తారు. ముఖ్యంగా ఆడ క్యూలెక్స్‌ దోమల మీద. ఇవే ఫైలేరియా వ్యాపించడానికి ప్రధాన కారణం. దోమలు చూస్తే చిన్న ప్రాణులు కానీ.. వీటి వల్ల ఏటా కొన్ని లక్షల మంది చనిపోతుంటారు తెలుసా.

బంటి: అమ్మో.. అవునా తాతయ్యా!
తాతయ్య: ఆ.. ఆవును బంటీ.. ఈ కీటకాల సేకర్తలు ఇలా సాధారణంగా ఆరు నెలలకు ఓసారి దోమల్ని సేకరించి ల్యాబ్‌కు పంపుతారు. అక్కడ ల్యాబ్‌లో వీటిమీద ప్రయోగాలు చేస్తారు. ఈ దోమల్లో డెంగ్యూ, ఫైలేరియా లాంటి వ్యాధికారక క్రిములను గుర్తిస్తే... అప్రమత్తమవుతారు. వెంటనే దోమల నిర్మూలనకు చర్యలు తీసుకుంటారు. పెద్ద ఎత్తున ఫాగింగ్‌ చేస్తారు. ఇదీ చింటూ.. ముంబయిలో దోమల సేకరణ కథ.

బంటి: బాగుంది తాతయ్యా... నాకసలు ఇలా దోమల్ని సేకరించి ప్రయోగాలు చేస్తారని తెలియదు. నేను ఈ వివరాలన్నింటితో ఓ వ్యాసం తయారు చేసి, మా క్లాస్‌ టీచర్‌ సాయంతో స్కూల్‌ నోటీస్‌ బోర్డులో పెడతాను.
తాతయ్య: గుడ్‌.. చింటూ.. మంచి ఆలోచన.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని