అసలు దొంగ!

రంగాపురం గ్రామంలో రాజయ్య అనే ఒక కిరాణా వ్యాపారి ఉండేవాడు. అతను తన వ్యాపారంలో చాలా బాగా సంపాదించాడు. దాంతో ఆ వ్యాపారాన్ని ఇంకా బాగా విస్తరించాలనుకొని,  అయిదుగురు పనివాళ్లను కొత్తగా పనిలోకి తీసుకున్నాడు. వీళ్లు వచ్చినప్పటి నుంచి గల్లాపెట్టెలో కొంత సొమ్ము తగ్గుతున్నట్లు గమనించాడు. అన్ని కోణాల నుంచి పరిశీలించి ఈ పని కచ్చితంగా కొత్తగా చేరిన వారే చేస్తున్నట్లుగా నిర్ధారణకు వచ్చాడు...

Published : 06 Sep 2022 00:53 IST

రంగాపురం గ్రామంలో రాజయ్య అనే ఒక కిరాణా వ్యాపారి ఉండేవాడు. అతను తన వ్యాపారంలో చాలా బాగా సంపాదించాడు. దాంతో ఆ వ్యాపారాన్ని ఇంకా బాగా విస్తరించాలనుకొని,  అయిదుగురు పనివాళ్లను కొత్తగా పనిలోకి తీసుకున్నాడు. వీళ్లు వచ్చినప్పటి నుంచి గల్లాపెట్టెలో కొంత సొమ్ము తగ్గుతున్నట్లు గమనించాడు. అన్ని కోణాల నుంచి పరిశీలించి ఈ పని కచ్చితంగా కొత్తగా చేరిన వారే చేస్తున్నట్లుగా నిర్ధారణకు వచ్చాడు. కానీ ఎంత ప్రయత్నించినా... ఎవరు ఆ సొమ్మును కాజేస్తున్నదీ తెలుసుకోలేకపోయాడు. చివరకు ఆ గ్రామ న్యాయాధికారి సత్యమూర్తి దగ్గర ఫిర్యాదు చేశాడు. న్యాయాధికారి బాగా ఆలోచించి రాజయ్యతో దుకాణంలో పనిచేసే అందరిని తన వద్దకు తీసుకురమ్మని ఆదేశించాడు. కొత్తగా చేరిన అయిదుగురితోపాటు అంతకు ముందు నుంచి పనిచేస్తున్న సోమయ్యనూ న్యాయాధికారి ముందుంచాడు రాజయ్య.

న్యాయాధికారి సత్యమూర్తి వారందరినీ ఉద్దేశించి మాట్లాడుతూ... ‘మీ యజమాని రాజయ్య కిరాణా దుకాణంలో గల్లా పెట్టె నుంచి ఈ మధ్యకాలంలో సొమ్ము మాయమవుతుందని నాకు ఫిర్యాదు చేశాడు. మీరెవరైనా తీస్తుంటే మర్యాదగా చెప్పండి’ అన్నాడు. దానికి ప్రతి ఒక్కరూ మేము తీయలేదంటే మేము తీయలేదని సమాధానమిచ్చారు. కచ్చితంగా మీలో ఒకరే తీసుండాలి.. ఎందుకంటే అక్కడ మీరూ, మీ యజమాని తప్ప, మరొకరు ఎప్పుడూ లోపలికి ప్రవేశించింది లేదు. అందుకే మీ అందరికీ ఒక పరీక్ష పెడతాను. పక్క గదిలో మీ పేరుతో ఒక్కొక్క మహిమగల కాగితాన్ని ఉంచాను. మీ పేరున్న కాగితాన్ని చూసి దానిపై అరచేతిని పెట్టి ‘మేం సొమ్మును దొంగిలించలేదు’ అని ప్రమాణం చేయాలి. తర్వాత ఇక్కడకు వచ్చి ఒక్కొక్కరికి ఉంచిన ఒక్కో పాత్ర నీటిలో మీరు ప్రమాణం చేసిన అరచేతిని ఉంచండి. ఎవరైతే దొంగతనం చేశారో వారి అరచేతిని ఉంచిన పాత్రలో నీరు గులాబీ రంగులోకి మారిపోతుంది’ అని చెప్పాడు.

అలా ఒకరి తరువాత ఒకరు ఆ గదిలోకి వెళ్లి న్యాయాధికారి చెప్పినట్లే చేసి వచ్చామని చెప్పి, అక్కడ పెట్టిన పాత్రలో అరచేతిని ఉంచారు. ఒక్కరి పాత్రలో నీళ్లు తప్పించి, మిగతావారందరి పాత్రల్లో నీళ్లు గులాబీ రంగులోకి మారిపోయాయి. ముందునుంచి పనిచేస్తున్న సోమయ్య చేయి ఉంచిన పాత్రలో నీళ్లు రంగు మారలేదు. అందరూ తాము దొంగతనం చేయకపోయినప్పటికీ తమ పాత్రలో నీళ్లు గులాబీ రంగులోకి మారిపోయేసరికి భయంతో వణికిపోతుంటే సోమయ్య మాత్రం కాస్త ధీమాగా ఉన్నాడు.
‘సోమయ్యా! నువ్వే కదా, గల్లాపెట్టెలో సొమ్ము దొంగిలించేది, నిజం చెప్పు.. లేదా తీవ్రమైన శిక్ష విధించాల్సి ఉంటుంది’ అన్నాడు న్యాయాధికారి సత్యమూర్తి. దీంతో... ‘నిజమేనయ్యా! మొట్టమొదట సారిగా, సొమ్ముపై ఆశతో.. ఈ మధ్యనే అయిదుగురిని మా యజమాని పనిలోకి తీసుకోవడంతో వారిపైకి దొంగతనం పోతుందనే నమ్మకంతో చేశానయ్యా.. ఈ పాడు పని. మా యజమాని నన్ను అనుమానించక పోవడంతో, ఇక అప్పుడప్పుడు గల్లా పెట్టె నుంచి సొమ్ము దొంగతనం చేయడం మొదలు పెట్టానయ్యా! ఈ ఒక్కసారికి నన్ను క్షమించడయ్యా!’ అని వేడుకున్నాడు.

దొంగతనం నేరానికి గానూ సోమయ్యకు న్యాయాధికారి మూడునెలల కారాగార శిక్ష విధించబోయాడు. ఎప్పటినుంచో తన దగ్గర నమ్మకంగా పనిచేసిన సోమయ్యపై దయతలచి విడిచిపెట్టమని యజమాని రాజయ్య కోరాడు. ‘అయినా.. దొంగతనం చేసిన వారి చేతిని ఉంచిన పాత్రలోని నీరు గులాబీ రంగులోకి మారిపోతుందని కదా చెప్పారు. ఆ విధంగా చూస్తే సోమయ్య అరచేయి ఉంచిన పాత్రలో నీరు గులాబీ రంగులోకి మారలేదు కదా.. మరి అతను ఏ విధంగా దొంగతనం చేశాడని తేల్చారో చెప్పండయ్యా’ అని న్యాయాధికారిని అడిగాడు రాజయ్య.

సోమయ్యే అసలు దొంగ కాబట్టి తన అరచేతితో ఆ కాగితాన్ని తాకకుండానే వచ్చి పాత్రలో చేతిని ఉంచాడు. దీంతో ఆ నీళ్లు గులాబీ రంగులోకి మారలేదు. నిజానికి అవి మహిమగల కాగితాలు కాదు. రహస్య రసాయనం పూసిన కాగితాలు’ అని న్యాయాధికారి చెప్పేసరికి సోమయ్య సిగ్గుతో తలదించుకున్నాడు.

- కొమ్ముల వెంకట సూర్యనారాయణ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని