నువ్వా.. నేనా?

వసంత రుతువు రావడంతో ఓ ఇంటి పెరట్లో ఉన్న మామిడి చెట్టు కొమ్మల్లో చేరి, కుహూ.. కుహూ అంటూ ఆనంద గానం చేయడం మొదలు పెట్టింది కోకిలమ్మ. ఆ ఇంట్లో వాళ్లు ఆ మధురగానానికి పరవశించసాగారు. అక్కడికి కొంతదూరం నుంచి అదంతా చూస్తున్న

Published : 08 Sep 2022 00:29 IST

వసంత రుతువు రావడంతో ఓ ఇంటి పెరట్లో ఉన్న మామిడి చెట్టు కొమ్మల్లో చేరి, కుహూ.. కుహూ అంటూ ఆనంద గానం చేయడం మొదలు పెట్టింది కోకిలమ్మ. ఆ ఇంట్లో వాళ్లు ఆ మధురగానానికి పరవశించసాగారు. అక్కడికి కొంతదూరం నుంచి అదంతా చూస్తున్న చిలుకమ్మకి కోపం వచ్చింది. ‘అందమైన ఎర్ర ముక్కున్న పచ్చటి చిలుకను నేను. మనుషులు నేర్పే మాటలైనా.. పాటలైనా చక్కగా నేర్చుకుంటాను. ఈ కోయిల ఎప్పుడు చూసినా కుహూ.. కుహూ తప్ప ఏం పాడుతోందని, వీళ్లంతా అంత ఇష్టపడుతున్నారు?’ అని మనసులోనే అనుకుంది.

కొద్ది సేపటికి కోకిలమ్మ తన గానం ఆపి, ఎగిరి దూరంగా ఉన్న మరో చెట్టు పైకి చేరింది. అది చూసిన చిలుకమ్మ కూడా అదే చెట్టుపైకి చేరింది. ఎలాగైనా కోయిల మీద పైచేయి సాధించాలని అనుకుందది. వెంటనే ‘ఏం కోయిలా! మావి చిగురు తిని మైమరిచిపోయి పాడుతున్నావా? నీ అంత గొప్ప పాటగాళ్లు ఈ ప్రపంచంలో లేరనుకుంటున్నావా?’ అని అడిగింది చిలుకమ్మ. అందుకు కోయిల.. ‘చిలుకమ్మా! అదేం లేదు.. నా ఆనందం కొద్దీ నేను పాడుకుంటున్నాను. అంతే..’ అంది. ‘అదేం కాదులే, అంతా కోకిల గానమని మెచ్చుకుంటారని నీకు తగని గర్వం. నీకు తెలుసో లేదో నేను మాటలే కాదు ఈమధ్య పాటలూ నేర్చుకున్నా. రేపు మన అడవి రాజు సింహం దగ్గరకు ఇద్దరం వెళ్దాం. నీ పాట నువ్వు వినిపించు. నా పాట నేను వినిపిస్తాను. సింహం ఎవరి పాట మెచ్చుకుంటుందో చూద్దాం’ అని చెప్పింది చిలుకమ్మ.

‘మనలో మనకు పోటీలెందుకు చెప్పు. నువ్వు మనుషుల మధ్య ఎక్కువ తిరుగుతుంటావు.. చక్కగా వారిని అనుకరిస్తావు. నువ్వే గొప్పదానివి’ అంది కోయిల. ‘అలా కాదు. పది మందిలో నిర్ణయం జరిగితేనే నిజమైన గుర్తింపు. రేపు మృగరాజు దగ్గరికి రావాల్సిందే..’ అంటూ పట్టుబట్టింది చిలుక. ‘సరే.. అలాగే కానివ్వు’ అంటూ అయిష్టంగానే బదులిచ్చింది కోయిల.

మరుసటి రోజు ఉదయాన్నే సింహం కొలువుదీరి ఉండగా.. చిలుక, కోయిల అక్కడకు వెళ్లాయి. సింహంతో తన కోరిక చెప్పింది చిలుక. ‘అయితే మాటే కాదు, పాటా నేర్చానంటావు. సరే మరి. ఇక కానివ్వండి. ముందు ఎవరు పాడతారు?’ అడిగింది సింహం. ‘కోయిల పాట ఇదివరకు వినే ఉంటారు. అందుకే ముందు నా పాట వినండి’ అంది చిలుక. ‘నీకు అంగీకారమేనా?’ అని కోయిలను అడిగింది సింహం. ‘నాకేం అభ్యంతరం లేదు మృగరాజా..’ జవాబిచ్చింది కోయిల. చిలుక వెంటనే గొంతు సవరించుకొని.. ‘నా పాట వింటే చాలు.. నా వెంట పడతారు..’ అంటూ పాటందుకుంది.

సింహం విని.. చిరునవ్వుతో ఊరుకుంది. చిలుక పాట ముగించి గర్వంగా చూసింది. ‘బాగుంది’ అని మిగతా జంతువుల వైపు చూసింది సింహం. అక్కడే ఉన్న అడవి ప్రాణులు మొహమాటంగా బాగుందన్నట్లుగా తలలూపాయి. ‘కోయిలా! ఇప్పుడు నువ్వు పాడు’ అని సింహం అడగడంతో ‘అలాగే రాజా..’ అంటూ ఎంతో వినయంగా ముందుకొచ్చింది కోయిల. చుట్టూ ఉన్న ప్రకృతిని ఓసారి చూసి.. దైవాన్ని తలచుకొని, పరవశంతో కుహూ.. కుహూ.. అంటూ మధురంగా పాడింది. సింహం తన్మయత్వంతో శెభాష్‌ అంది. వెంటనే జీవులన్నీ అడవంతా ప్రతిధ్వనించేలా చప్పట్లు కొట్టాయి. అది చిలుకకు అవమానంగా అనిపించింది. ‘రాజా! ఇది అన్యాయం. కోయిల ఊరకే కుహూ.. కుహూ.. అంటే శెభాష్‌ అన్నారు. నేను అంత స్పష్టంగా పాట పాడితే.. బాగుంది అని సరిపెట్టారు’ అని చిన్నబుచ్చుకుంది.

‘‘చిలుకా.. నీది అనుకరణ. కోయిలది సహజ గానం. పైగా నువ్వు గర్వ భావనతో పాడావు. కానీ కోయిల ఎంతో అణకువతో, ప్రకృతిని చూసి పరవశిస్తూ మనసుతో గానం చేసింది. అందుకే కోయిల పాటకు అంత మాధుర్యం. గానంలో కోయిల సాటి లేనిది. అందుకే అద్భుతంగా పాడేవారికి ‘గానకోకిల’ అని బిరుదు ఇస్తుంటారు. అలా అని నువ్వు తక్కువని కాదు. చిలుక మాట.. కోయిల పాట రెండూ గొప్పవే. ఈ సృష్టిలో ఎవరి ప్రత్యేకత వారికి ఉంటుంది. అది అర్థం చేసుకోకుండా అసూయతో పోటీ పడాలనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. అసూయ లేకుండా అంతా స్నేహంగా కలిసిమెలసి ఉండాలి. అర్థమైందా?’’ అని అంది సింహం. ‘నిజమే! కోయిల వద్దంటున్నా గానంలో తనతో పోటీ పడడం నా పొరపాటే. ఇప్పటి నుంచి కోయిల నా నేస్తం’ అంటూ దాని పక్కన చేరింది చిలుక. ‘మీరిద్దరూ మా నేస్తాలు’ అన్నాయి అడవి ప్రాణులు. కోయిల వెంటనే ఆనందంతో కుహూ.. కుహూ.. అని పాడసాగింది. సింహం నవ్వుతూ ‘ఇక మీ మీ నివాసాలను వెళ్లండి’ అంటూ గుహవైపుగా నడిచింది. చిలుక, కోయిల రివ్వున పైకెగరగా.. మిగిలినవి కూడా బయలుదేరాయి.

- జె.శ్యామల


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని