ప్రతిభే కాపాడింది!

శాలినీ దేశానికి రాజు.. కీర్తిసేనుడు. అప్పుడప్పుడు మారువేషంలో ఒంటరిగా తిరుగుతూ రాజ్య సమాచారాన్ని తానే స్వయంగా తెలుసుకుంటూ ఉండేవాడు. అతని సభలో ఇద్దరు పండితులు ఉండేవారు. వారు

Updated : 10 Sep 2022 06:26 IST

శాలినీ దేశానికి రాజు.. కీర్తిసేనుడు. అప్పుడప్పుడు మారువేషంలో ఒంటరిగా తిరుగుతూ రాజ్య సమాచారాన్ని తానే స్వయంగా తెలుసుకుంటూ ఉండేవాడు. అతని సభలో ఇద్దరు పండితులు ఉండేవారు. వారు తమ సన్నిహితులు, అనుకూలురకు మాత్రమే రాజాస్థానంలో ప్రవేశం కల్పించేవారు. ఇతర పండితులకు ఎంత పాండిత్యం ఉన్నా సరే.. వారి అనుమతి లేనిదే ఆ సభలోకి ప్రవేశించలేకపోయేవారు. ఇలా ఉండగా.. ఒకరోజు రుద్రభట్టు అనే పేద పండితుడు శాలినీ రాజ్యానికి వచ్చాడు. అతడిలో అద్భుత ప్రతిభ ఉన్నా.. పేదరికం ఎప్పుడూ వెక్కిరిస్తుండేది. కీర్తిసేనుడి దయాగుణం, సాహిత్య పోషణ గురించి తెలుసుకున్న రుద్రభట్టు.. ఆయనను కలిసేందుకు వచ్చాడు. కానీ ఇక్కడకు వచ్చిన తర్వాత.. ఆస్థానంలోని ఇద్దరు పండితుల సంగతి తెలిసింది. అయినా.. ప్రయత్నిద్దామని ఆ ఇద్దరు పండితుల ఇంటికి వెళ్లి, తనకు రాజాస్థానంలో ప్రవేశం కల్పించమని కోరాడు. కానీ వారు అనుమతించలేదు. చివరకు అతడు ఆ రాజ్యం పరిధిలోని ఒక గ్రామంలో ఉన్న దేవాలయంలోనే ఉంటూ.. ప్రజలకు మంచీ చెడులనూ చెప్పసాగాడు. అతడిలోని ప్రతిభ, వాక్చాతుర్యం ఊరు ఊరంతా పాకింది.

ఒకరోజు కీర్తిసేనుడు మారువేషంలో ఆ గ్రామానికి వచ్చాడు. ప్రజలెవరూ లేకపోవడం చూసి ఆశ్చర్యపోయాడు. ఓ ముసలి వ్యక్తి మంచంలో పడుకొని ఉండటాన్ని గమనించి, అతడి దగ్గరికి వెళ్లాడు రాజు. ‘ఊరి ప్రజలందరూ ఎక్కడికి వెళ్లారు?’ అని అడిగాడు. పండితుని ప్రవచనాలు వినేందుకు దేవాలయానికి వెళ్లారని చెప్పాడతను. ఆ గొప్ప పండితుడు ఎవరో తెలుసుకోవాలని రాజుగారికి కూడా ఉత్సాహం కలిగి, దేవాలయానికి వెళ్లాడు. అక్కడ ఇసుక వేస్తే రాలనంత మంది జనం ఉన్నారు. అక్కడ ఆ పండితుడు చెప్పే అంశాలను విని కీర్తిసేనుడు ముగ్ధుడయ్యాడు. అందరూ వెళ్లిపోయిన తర్వాత.. రాజు, ఆ పండితునితో.. ‘మీకు ఇంత పాండిత్యం ఉంది. రాజాస్థానంలో మీ ప్రతిభను ప్రదర్శించలేకపోయారా.. మీ రాజు మీలోని ప్రతిభను గుర్తించలేనంత మూర్ఖుడా?’ అని ప్రశ్నించాడు.

అప్పుడు రుద్రభట్టు.. ‘దయచేసి రాజు గారిని నిందించకండి. నా సంగతి ఆయనకు తెలియదు’ అంటూ తాను ఆ ఇద్దరు పండితులను కలిసిన సంగతి వివరించాడు. ఇతర పండితులకు రాజాస్థాన ప్రవేశం కల్పించకుండా అడ్డుకుంటున్నారని మారువేషంలో ఉన్న రాజుకు అర్థమైంది. అతణ్ని మరోసారి రాజాస్థానానికి రమ్మని, అందుకు తాను సహకరిస్తానన్నాడు. తాను కూడా అక్కడే పనిచేస్తానని అబద్ధమాడాడు. మరునాడు రాజాస్థానానికి వెళ్లిన రుద్రభట్టుకు ఈసారీ నిరాశే ఎదురైంది. ఆ ఇద్దరు పండితుల అనుమతి లేకపోవడంతో భటులు లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. అది ముందే గ్రహించిన రాజు.. అక్కడకు ఒక భటుడిని పంపి అతడిని లోపలికి తీసుకొని రమ్మన్నాడు. రుద్రభట్టు సభలోకి వచ్చిన తర్వాత రాజు, ఆ ఇద్దరు పండితులతో.. ‘పండితులారా! మీకు ఈయన తెలుసా?’ అని ప్రశ్నించాడు. వారు తమకు అతను తెలియనే తెలియదని, ఇంతవరకు ఒక్కసారి కూడా చూడనేలేదని అబద్ధం చెప్పారు. అంతేకాదు.. ‘మహారాజా! పాండిత్యం లేని ఇటువంటి వారిని సభలోకి ఎవరు అనుమతించారో కూడా మాకు తెలియదు. ఇటువంటి వారి వల్ల మన రాజ్యానికి అపఖ్యాతి కలుగుతుంది’ అని అన్నారు.

ఆ ఇద్దరు పండితుల మాటలు విన్న రాజుకు కాస్త కోపం వచ్చింది. ఆ పేద పండితుణ్ని ఘనంగా సత్కరించమని వెంటనే మంత్రిని ఆదేశించాడు. అది విన్న రుద్రభట్టు పరమానంద భరితుడై... ‘మహారాజా! మీకు నా గురించి తెలుసా?’ అని ప్రశ్నించాడు. ‘తెలుసు.. నిన్న దేవాలయంలో మీ హితవచనాలు విన్నాను. మారువేషంలో ఉండి, మీకు సాయం చేస్తానన్నది కూడా నేనే’ అని బదులిచ్చాడు రాజు. ఆ మాటలకు రుద్రభట్టు ఎంతో సంతోషించాడు. ‘మీ ఇద్దరినీ తక్షణమే పదవుల నుంచి తొలగిస్తున్నాను. ఇకమీదట రాజ్యంలోనూ కనిపించకూడదు’ అని ఆ ఇద్దరు పండితులకు శిక్ష విధించాడు రాజు. అప్పుడు రుద్రభట్టు... ‘మహారాజా! వారు ఎంతో ప్రతిభావంతులు. అటువంటి వారిని అలా పంపడం భావ్యం కాదు. బంధుప్రీతో, అభద్రతా భావమో వారితో అలా చేయించి ఉంటుంది. పెద్దమనసుతో వారిని మన్నించండి’ అని కోరాడు. అప్పుడు రాజు.. ‘చూశారా.. ఆ పండితుడి మంచితనం. మీరు తనకు అన్యాయం చేసినా, అతను మాత్రం మీ మంచే కోరుతున్నాడు. ఇకనైనా బుద్ధిగా ఉండండి. రుద్రభట్టును ఆస్థాన పండితుడిగా నియమిస్తున్నాను. ఇకనుంచి మీరు ఆయనకు సహాయకులుగా ఉండండి’ అని ఆదేశించాడు. వారు సరేనని తల దించుకున్నారు.

- సంగనభట్ల చిన్న రామకిష్టయ్య


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని