Published : 13 Sep 2022 00:44 IST

మారని చిట్టి!

చిత్రాంగి అడవికి సువర్ణుడు అనే సింహం రాజుగా ఉండేది. అందమైన మీసాలు, బంగారంలా మెరిసే జూలు, బలమైన కండరాలతో ఎంతో అందంగా కనిపించేది. పైగా మంచి మనసున్నది. జంతువులన్నింటికీ మహారాజు అంటే ఎంతో అభిమానం. రాజు గుహకు దగ్గరగా ఓ ఎలుక జంట నివసిస్తుండేది. కొంతకాలానికి ఆ ఎలుకల జంటకు సంతానం కలిగింది. మహారాజు ఆ పిల్లకు చిట్టి అని నామకరణం చేశాడు. ఎలుకలు చిట్టిని ఎంతో ముద్దుగా పెంచుతున్నాయి. మహారాజు కూడా దాన్ని గారాబంగా చూసేవాడు. దాంతో అది తుంటరిగా పెరగసాగింది. చుట్టూ ఉన్న జంతువులు, పక్షులు ‘మరీ అంతగా గారాబం చేయకండి. తర్వాత బాధపడి ప్రయోజనం లేదు’ అన్నాయి. కానీ ఎలుకలు వినలేదు.

ఒకరోజు పక్క చెట్టుకొమ్మన అందంగా కట్టుకున్న పిచ్చుక గూడును కొరికేసింది చిట్టి. దాంతో గూడులో ఉన్న గుడ్లు కింద పడి పగిలి పోయాయి. పిచ్చుక ఏడుస్తూ ఎలుకలకు చెప్పింది. ‘ఏదో చిన్న పిల్ల తెలీక చేసింది. ఈ మాత్రం దానికే ఇంత హడావిడి చేయాలా!’ అన్నాయవి. మరోసారి చిట్టి.. కుందేలు దాచుకున్న దుంపలు, కాయలు కొరికేసి చెల్లాచెదురు చేసింది. దాంతో కుందేలు లబోదిబోమంది. ఇలా చాలా జంతువులు, పక్షులు.. చిట్టి బారిన పడ్డాయి. దాంతో అవన్నీ మృగరాజు దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేశాయి. ‘నేను దాన్ని మందలిస్తాను. మీరు వెళ్లండి’ అంది మృగరాజు. చేసేదేం లేక ఇంటి దారి పట్టాయి జంతువులు. ఎలుకల జంటకు కబురు పెట్టి చిట్టిని తీసుకురమ్మంది సింహం. దాంతో ఎలుకలు రెండూ భయపడిపోయాయి. ‘చూశావా.. నువ్వు చేసిన పనికి జంతువులు, పక్షులు మృగరాజుకు నీమీద ఫిర్యాదు చేశాయి. ఇప్పుడు మృగరాజు ఏ శిక్ష విధిస్తుందో.. ఏమో..!’ అంటూ చిట్టిని తీసుకుని సింహం దగ్గరకు వెళ్లాయి. చిట్టిని చూడగానే మృగరాజు గట్టిగా గర్జించింది.

‘చిన్నపిల్లవు కదా అని వదిలేస్తున్నాను. మరోసారి అల్లరి చేస్తే మాత్రం దెబ్బలు తప్పవు’ అని హెచ్చరించింది. ‘మహారాజా.. మీరే అన్నారు కదా.. నేను చిన్న పిల్లను అని! పిల్లలు దేవుడితో సమానం అంటారు. అటువంటి నన్ను కొడతాను అనడం న్యాయమా?’ అని అడిగింది చిట్టి. దాని ముద్దుముద్దు మాటలకు సింహం మనసులో మురిసిపోయింది. కానీ, పైకి మాత్రం ‘చిన్న పిల్లవైతే అల్లరి చేయాలని ఉందా! మరోసారి నాకు నీ మీద ఫిర్యాదు రాకూడదు. తెలిసిందా..’ అని మందలించి పంపింది సింహం. చిట్టిని మృగరాజు పిలిపించి.. హెచ్చరించిన సంగతి తెలిసిన జంతువులు, పక్షులు ఎంతో ఆనందించాయి. ఇకనుంచి దానివల్ల ఇబ్బంది ఉండదనుకున్నాయి. కానీ, సింహం దాన్ని సుతిమెత్తగా మందలించి పంపిందని తర్వాత తెలిసి ముక్కున వేలేసుకున్నాయి. ఇక దాని అల్లరి ఎలా తగ్గుతుందో ఏమిటోనని అనుకున్నాయి. 

ఓరోజు ఉదయాన్నే బయట ప్రశాంతంగా కూర్చొని ఉంది చిట్టి. అప్పుడే బయటకు వచ్చిన తల్లి ఎలుక.. ‘ఏంటి చిట్టీ! ఇంత ప్రశాంతంగా కూర్చుని ఉన్నావు. అల్లరి పనులేమీ చేయలేదు కదా!’ అంది. ‘భలే దానివమ్మా.. ఆ రోజు మృగరాజు మందలించిన దగ్గర నుంచి నేను అల్లరి మానేశాను’ అంది చిట్టి. ‘నిన్ను నమ్మలేం.. ఎప్పుడు ఏం గొడవలు తెస్తావో అని భయంగా ఉంది’ అంది అప్పుడే బయటకు వచ్చిన తండ్రి ఎలుక. ఇంతలో మృగరాజు గుహ నుంచి బయటకు వచ్చింది. దాన్ని చూడగానే ఎలుకలు రెండింటికీ పై ప్రాణాలు పైనే పోయాయి. చిట్టిని తీసుకుని దూరంగా పారిపోయాయి. ‘నిన్న మందలించినా.. వీటికి భయం ఇంకా పోలేదు’ అనుకుంది మృగరాజు. దూరంగా గడ్డి మేస్తున్న జింకలు, దుప్పులు మృగరాజును చూడగానే భయంతో పరుగులు తీశాయి. కుందేళ్లు, నక్క, తోడేలు సంగతి సరే సరి! అవి కూడా అంతే భయంతో పారిపోయాయి. ‘ఏమిటి.. జంతువులన్నీ నన్ను చూసి పరుగు తీస్తున్నాయి’ అని అనుకుంది మృగరాజు.

అప్పుడు జామ చెట్టు మీదున్న చిన్ని చిలుక.. ‘మహారాజా! ఒక్కసారి మిమ్మల్ని మీరు నీటిలో చూసుకోండి. అవి ఎందుకు పారిపోతున్నాయో తెలుస్తుంది’ అంది. సింహానికి మొదటిసారిగా కాస్త భయం వేసింది. దగ్గరగా ఉన్న కోనేరు దగ్గరకు వెళ్లి తన ప్రతిబింబం చూసుకుని ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎంతో అందమైన జూలు లేదు. మెలితిరిగిన మీసమూ లేదు. అప్పుడు లీలగా గుర్తుకు వచ్చింది.. తెల్లవారుజామున ఏదో చిన్న జంతువు తన మీద పాకిందని! వెంటనే జరిగింది అర్థమైంది.

‘చిట్టీ... నిన్ను మందలించి వదిలేస్తే, నన్ను ఇలా తయారు చేస్తావా!’ అనుకుంది. తిరిగి గుహకు వెళ్లి చూస్తే అక్కడంతా చెల్లా చెదురుగా పడి ఉన్న తన జూలు కనిపించింది. ‘అప్పుడే దానికి కఠినమైన శిక్ష వేస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా.. మృగరాజుగా నాకు జాలి ఉండవచ్చు. కానీ, తప్పు చేసిన వారి విషయంలో అది మంచిది కాదు’ అని తెలుసుకొని చింతించింది. ‘మృగరాజు విషయంలో మా చిట్టి చేసిన పనికి ఇక మేము ఇక్కడ ఉండలేము. ఈ అడవి వదలి వెళ్లిపోతున్నాం’ అంటూ మిగిలిన జంతువుల దగ్గర వీడ్కోలు తీసుకుంది ఎలుకల జంట. ‘చిట్టిని మొదట్లోనే మందలించి ఉంటే, ఈ రోజు ఇలా ఉండేది కాదు’ అనుకున్నాయి మిగిలిన జంతువులు, పక్షులు.

- కూచిమంచి నాగేంద్ర


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని