Published : 15 Sep 2022 00:43 IST

సిరి చూపిన దారి!

రాము మాస్టారు అయిదో తరగతి తెలుగు పాఠం ‘కలసి ఉంటే కలదు సుఖం’ చెబుతున్నారు. తరగతిలో ఎప్పుడూ ఫస్ట్‌ ర్యాంక్‌ తెచ్చుకునే సిరి ఏ మాత్రం ఉత్సాహం లేకుండా కూర్చుంది. ‘సిరీ! ఏమైందమ్మా! ఎందుకు దిగాలుగా ఉన్నావు?’ అని ఆయన సిరిని అడిగారు. ఆ చిన్నారి కన్నీళ్లు తుడుచుకుంటూ.. ‘అమ్మ గుర్తుకొస్తోంది సార్‌!’ అని చెప్పింది. ‘సాయంత్రం బడి నుంచి ఇంటికి వెళ్లగానే అమ్మ కనబడుతుందిగా! బెంగ దేనికమ్మా?’ సిరికేసి విచిత్రంగా చూస్తూ అన్నారు మాస్టారు.

‘లేదు సార్‌! కొన్ని రోజుల క్రితం అమ్మానాన్నా దెబ్బలాడుకున్నారు. అమ్మ మా అమ్మమ్మ ఇంటికి వెళ్లిపోయింది!’ అని ఏడుస్తూ చెప్పింది. ‘అమ్మమ్మ ఇల్లు చాలా దూరమా?’ అని సార్‌ అడిగారు. ‘లేదు సార్‌! మా పక్క వీధిలోనే! కానీ నాన్న నన్ను వెళ్లనివ్వరు’ అని బాధగా అంది.

సిరి వాళ్ల నాన్న సూర్యానికి సార్‌ ఫోన్‌ చేయాలనుకున్నారు. అంతలో అప్పుడే సూర్యం అక్కడికి వచ్చాడు. ‘సార్‌! సిరి వాళ్ల అమ్మ కానీ, ఆ తరఫు వాళ్లు కానీ వస్తే వారితో తనను పంపొద్దు’ అంటూ తన ఫోన్‌ నంబర్‌ ఉన్న చీటీ ఇచ్చాడు. సార్‌ చెప్పే సమాధానం వినకుండానే సూర్యం అక్కడి నుంచి కదిలాడు.

బడి విడిచి పెట్టే సమయం అయింది. చివరి గంట కొట్టగానే పిల్లలంతా ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లిపోయారు. ‘సిరీ! ఇంటికి వెళ్లవా?’ అని సార్‌ అడిగారు. ‘అమ్మానాన్నా ఇద్దరూ ఉంటేనే అది ఇళ్లవుతుంది సార్‌. అక్కడ అమ్మ, ఇక్కడ నాన్న ఉంటే ఎలా సార్‌?’ అని అమాయకంగా, దీనంగా మొహం పెట్టి అడిగింది. సార్‌ నుంచి సమాధానం రాలేదు.

అప్పుడే సిరి కోసం వాళ్ల అమ్మ రమ వచ్చింది. ఆమెను చూడగానే... ‘అమ్మా!’ అని ఆనందంగా వెళ్లబోతూ.. అప్పుడే అక్కడకు వచ్చిన తన నాన్న సూర్యాన్ని చూసి ఆగింది. ఇద్దరి దగ్గరకూ వెళ్లకుండా సార్‌ వెనుకకు వచ్చి చేరింది. అది చూసి ఆశ్చర్యపోయిన సూర్యం, రమ ఒక్కసారిగా సిరిని చూసి... ‘సిరీ..! రామ్మా! నా దగ్గరకు రా!’ అంటూ ఇద్దరూ వారి వారి చేతులు ముందుకు చాచారు. కానీ సిరి ముందుకు అడుగు వేయలేదు.

సార్‌ వెనుక దాగి... ‘ఇద్దరూ కలిసుంటేనే వస్తా’ అని ధైర్యంగా తన అభిప్రాయాన్ని చెప్పింది. సిరి మాటలు విన్న ఆ ఇద్దరూ ఒక్కసారిగా మౌనం వహించారు. సిరికి ఏం చెప్పాలా అని ఆలోచించసాగారు. కానీ వారి నుంచి సమాధానం రావడం లేదు.

అది గమనించిన సిరి, ‘అమ్మా! నా కోసం ఇన్ని అడుగులు వేశావు. మరో అడుగు నాన్న కోసం వేయలేవా?.. నాన్నా! నా కోసం ఏదైనా చేస్తానన్నావు. ఏదడిగితే అది ఇస్తానన్నావు. బొమ్మ వద్దు. అమ్మ కావాలి నాన్నా. తెచ్చిస్తావా నాన్నా?’ అంది సిరి.

ఈ మాటలు విని వాళ్లిద్దరూ ఆశ్చర్యపోతూ సిరికేసి చూస్తున్నారు. ‘కళ్లు రెండైనా, చూసే చూపు ఒక్కటే. కాళ్లు రెండైనా వేసే అడుగు ఒక్కటే. మీరిద్దరూ నాకొక్కటే. ఇద్దరూ కలిసుంటేనే, మీతో నేను వస్తాను. లేకుంటే రాను.. రాలేను’ అంటూ ఏడ్చేసింది.

సూర్యం, రమ ఇద్దరూ పసిపాప సిరి మాటలు విని సమాధానం చెప్పలేక మౌనం వహించారు. ఏం చెప్పాలనుకుంటూ... ఒకరి వంక మరొకరు చూసుకున్నారు. అది గమనించిన రామూ మాస్టారు, వారిద్దరితో... ‘సిరి మీకు దక్కాలంటే, మీతో కలిసి రావాలంటే మీరిద్దరూ కలిసే ఉండాలి. పసి మనసును అర్థం చేసుకోండి. బాధ పెట్టకండి. పంతాలు వీడండి. సిరి అంటే మీకిష్టం. కానీ సిరికి మీరిద్దరూ కలిసుంటేనే ఇష్టం. ఆపై మీ ఇష్టం’ అని అన్నారు.

ఆయన మాటలు విన్న ఇద్దరూ ఒక్కసారిగా ముందుకు కదిలారు. సిరికి చెరో వైపూ వచ్చి పాప చేతులతో తమ చేతులను కలిపారు.

కథ సుఖాంతం కావడంతో అప్పటి వరకూ పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా ప్రదర్శించిన ‘ఆలోచించండి.. ఓ అమ్మానాన్నా!’ నాటకాన్ని చూసిన వారందరూ బావుందంటూ చప్పట్లు కొట్టారు. ఆ చప్పట్లు చరిచిన వాళ్లలో సిరి తల్లిదండ్రులు కూడా ఉన్నారు. పంతాలు, పట్టింపులకు పోయి పిల్లల్ని బాధ పెడుతున్న తల్లిదండ్రుల కోసమే ఈ నాటకాన్ని రామూ మాస్టారు పిల్లలతో కలసి వేశారు. నాటకం చూసిన సిరి తల్లిదండ్రుల్లో మార్పు వచ్చింది. వారిద్దరూ కలిసి సిరి కోసం వచ్చారు.

- కె.వి.లక్ష్మణరావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని