Updated : 18 Sep 2022 00:54 IST

కోతి సాయం

డవిలోని జంతువులకు, పక్షులకు ఎలుగుబంటి చక్కని వైద్యం అందించేది. దానికి ఇద్దరు పిల్లలు.. చంటి, బంటి. వైద్యానికి వచ్చే జీవులు పండ్లు, తేనె తీసుకొచ్చి ఎలుగుబంటికి ఇచ్చేవి. వాటిని చంటి, బంటి చక్కగా ఆరగిస్తూ, ఏ పనీ చేయకుండా సోమరిగా మారాయి. ఈ విషయం గమనించిన ఎలుగుబంటి.. పిల్లలిద్దర్నీ పిలిచి ‘ఏ పనీ చేయకపోతే ఎలా.. మీరు కూడా నాతో వస్తే వైద్యానికి అవసరమయ్యే మూలికల గురించి తెలుస్తుంది’ అని చెప్పింది. ‘మాకు ఇలాగే బాగుంది. మూలికల పేరిట అడవిలో మేం తిరగలేం’ అని చెప్పాయవి. వైద్యురాలిగా అడవిలోని జంతువులు, పక్షుల గౌరవం పొందుతున్నా, తన పిల్లలు మాత్రం సోమరిపోతులుగా మిగిలిపోవడం ఎలుగుబంటికి బాధ కలిగించేది.

ఒకరోజు వైద్యం కోసం వచ్చిన కోతి, ఎలుగుబంటి బాధగా ఉండటాన్ని గమనించి.. ‘ఎందుకో నీ ముఖంలో ఆనందం కనిపించటం లేదు. నీ మనసులోని బాధ చెప్తే, చేతనైన సహాయం చేస్తా’ అంది. తన పిల్లల సోమరితనం గురించి చెప్పింది ఎలుగు. ‘నువ్వు భయపడాల్సిన పనిలేదు. నీ పిల్లల్లో మార్పు తీసుకొచ్చే బాధ్యత నాది’ అని అది హామీనిచ్చింది. దాని చెవిలో ఒక ఉపాయం కూడా చెప్పింది. అందుకు ఎలుగుబంటి సరేనని.. తన పిల్లలు చంటి, బంటిని పిలిచింది. బయటకు వచ్చిన వారితో ‘ఈ కోతి నా స్నేహితురాలు. అడవిలోని వింతలు, విశేషాలు మీకు చూపిస్తుంది. రోజంతా మీరు తిరిగి రండి. మీకు కావలసిన ఆహారాన్నీ కోతే సమకూరుస్తుంది’ అని చెప్పడంతో ఎలుగుబంటి పిల్లలు ఆనందంతో గంతులు వేశాయి. కోతి.. ఎలుగుబంటి పిల్లలను అడవి మొత్తం తిప్పుతూ, ఆకలైనప్పుడు వాటికి ఆహార పదార్థాలు అందించసాగింది. కనిపించిన మొక్కలను చూపిస్తూ.. ‘వాటి పేర్లు మీకు తెలుసా?’ అని వాటిని అడగసాగింది కోతి. ‘ఆ పేర్లేవీ తెలియదు. ఆ అవసరం కూడా మాకు లేదు’ అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాయవి. అప్పుడు కోతి.. ‘మీ అమ్మ అందరికీ వైద్యం చేస్తుంది. ఆ మొక్కల మీద మీకు అవగాహన లేకపోతే ఎలా?’ అని ప్రశ్నించింది. అయినా అవి కోతి మాటలు పట్టించుకోలేదు. బంటి, చంటిలను ఒక పొద దగ్గరకు తీసుకువెళ్లింది కోతి. అక్కడున్న ఓ చెట్టు ఆకులను చంటి ఆత్రంగా తిన్నది. తిన్న వెంటనే దానికి మైకం కలిగి.. ‘రక్షించండి.. రక్షించండి’ అంటూ కింద పడిపోయింది. అదంతా తమ తల్లి, కోతి పథకం అని తెలియని బంటి ఏడవసాగింది.

కోతి గమనించి ‘అయ్యో.. ఎంత పనైంది. ఈ ఆకులు తింటే మైకం కమ్మి మూర్ఛపోతారు. దీనికి విరుగుడు మీ అమ్మ నీకు చెప్పే ఉంటుంది. ఒకసారి గుర్తు తెచ్చుకో’ అని బంటితో అంది. ‘నాకేమీ తెలియదు. ఎలాగైనా మా చంటిని రక్షించు’ అని కోతిని ప్రాధేయపడింది. అప్పుడు కోతి.. ‘నాకు వైద్యం తెలియదు, మీ అమ్మకే విరుగుడు మందు తెలుసు. నువ్వు ఇక్కడే ఉండి.. చంటిని చూస్తూ ఉండు. నేను వెళ్లి మీ అమ్మను తీసుకొస్తా’ అని ఎలుగుబంటిని పిలుచుకొచ్చేందుకు వెళ్లింది కోతి. చలనం లేకుండా పడిపోయిన చంటి పక్కనే కూర్చొని.. తల్లి రాక కోసం ఎదురుచూడసాగింది బంటి. ఎంతసేపయినా ఎవరూ రాకపోయేసరికి.. గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. ఆ ఏడుపు విని.. కొన్ని జంతువులు అక్కడికి చేరాయి.

విషయం తెలుసుకున్న అవి.. ‘మీ అమ్మ వచ్చేస్తుంది. తన వైద్యంతో చిటికెలో చంటి లేచి కూర్చుంటుంది’ అని ఊరడింపు మాటలు చెప్పాయి. ‘వైద్యానికి సంబంధించిన మూలికల గురించి అమ్మ చెప్తానంటే, మేమే పెడచెవిన పెట్టాం. ఇప్పుడు ఆపదలో చిక్కుకున్నాం. దీనికి కారణం మా సోమరితనమే..’ అని బాధపడుతూ, చంటిని కదిలిస్తూ తల్లి కోసం దారి వైపే చూడసాగింది బంటి. ఇంతలో ఎలుగుబంటి, కోతి పరుగెత్తుకుంటూ వచ్చాయి. ఒక్క క్షణం చుట్టుపక్కల అంతా వెతికి.. ఓ చెట్టు ఆకులను తీసుకొచ్చింది ఎలుగు. వాటి పసరును చంటికి రాయడంతో, అది కొద్దిసేపట్లోనే చక్కగా లేచి కూర్చుంది. ఎదురుగా అమ్మ కనబడడంతో పట్టుకుని ఏడ్చింది. తల్లి దాన్ని ఊరడించింది. చంటి తిరిగి లేవడంతో బంటికి చాలా ఆనందం కలిగింది. ‘ఇకపై సోమరితనాన్ని వీడి, నీతోపాటే మూలికల సేకరణకు వస్తాం’ అని తల్లిని క్షమాపణలు కోరాయి చంటి, బంటి. 

- మొర్రి గోపి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని