మాస్టారూ... మన్నించండి!

సుబ్బారావు మాస్టారు చదువుతోపాటు జీవిత పాఠాలూ చెప్పేవారు. తన దగ్గర చదువుకునే పిల్లలు విజ్ఞానంతోపాటు గుణవంతులై ఉండాలని ఆశించేవారు. ఏ పాఠం చెప్పినా.. అందులోంచి ఏదో ఒక సందర్భం సృష్టించి, విలువల గురించి విద్యార్థులకు వివరించేవారు.

Published : 19 Sep 2022 00:33 IST

సుబ్బారావు మాస్టారు చదువుతోపాటు జీవిత పాఠాలూ చెప్పేవారు. తన దగ్గర చదువుకునే పిల్లలు విజ్ఞానంతోపాటు గుణవంతులై ఉండాలని ఆశించేవారు. ఏ పాఠం చెప్పినా.. అందులోంచి ఏదో ఒక సందర్భం సృష్టించి, విలువల గురించి విద్యార్థులకు వివరించేవారు. ఆయన వద్ద చదువుకునే విద్యార్థులు కూడా మాస్టారు చెప్పిన మాటలకు ప్రభావితులై వారి నడవడికను తీర్చిదిద్దుకొనేవారు.

అలాంటి మాస్టారి తరగతిలో మూడు రోజులు నుంచి వరసగా దొంగతనాలు జరిగాయి. పుస్తకాల సంచిలో ఉంచిన పెన్ను పోయిందని ఓ విద్యార్థి రెండు రోజుల కిందట ఫిర్యాదు చేశాడు. నిన్నటికి నిన్న.. రంగు పెన్సిళ్లు పోయాయని ఇంకో విద్యార్థి ఏడ్చినంత పని చేశాడు. తాజాగా కొత్త నోట్‌ బుక్స్‌ కనిపించడం లేదని మరో విద్యార్థి ఫిర్యాదు చేశాడు. తరగతిలో ఎందుకిలా జరుగుతోందని సుబ్బారావు మాస్టారు చాలా బాధ పడిపోయారు. పిల్లల్లో చెడు అలవాట్లను మొగ్గలోనే తుంచాలనేది ఆయన ఆలోచన. అప్పుడే పిల్లలు చెడు వ్యసనాలకు ఆకర్షితులు కారని నమ్మేవారు.

మొదటి రోజు పిల్లల పుస్తకాల సంచులన్నీ వెతుకుతున్నప్పుడు.. కొత్తగా తరగతిలో చేరిన నగేష్‌ ‘అమ్మతోడు. నేను తీయలేదు’ అని అనేసరికి మాస్టారు అతడి సంచిలో చూడలేదు. రెండో రోజు రంగు పెన్సిళ్లు పోయినప్పుడు కూడా నగేష్‌ అదే మాట అన్నాడు. మూడో రోజు కూడా అలాగే అన్నాడు. ఇక మళ్లీ మాస్టారు నగేష్‌ సంచి గురించి పట్టించుకోలేదు. పోయిన వస్తువులు దొరకలేదు. తరగతిలో పిల్లలు మాత్రం నగేష్‌ సంచి కూడా వెతికితే బాగుండేదని గుసగుసలాడుకోసాగారు. వాళ్ల గుసగుసలు మాస్టారి చెవిన పడటంతో.. ఆయన నగేష్‌ వైపు చూశారు. ఆ విద్యార్థి కంగారుగా నిలబడి ‘అమ్మతోడు, నేను తీయలేదు సార్‌’ అన్నాడు.

‘ఎందుకలా కంగారు పడుతున్నావు? అమ్మతోడు అన్నావు కదా. ఇక నిన్ను ఎలా అనుమానిస్తాం? కూర్చో!’ అన్నారు. పిల్లలతో ఆయన మాట్లాడుతూ.. ‘మన జీవితంలో అమ్మ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. పిల్లల కోసం ఏ త్యాగానికైనా సిద్ధపడే మొదటి మనిషి తానే. బిడ్డలు ఎలాంటివాళ్లైనా, వారిని కంటికి రెప్పలా కాపాడుతుంది. ఉదయం నిద్ర  లేచినప్పటి నుంచి రాత్రి పడుకొనే వరకు అమ్మ మీకోసం ఎంత కష్టపడుతుందో ఒకసారి ఆలోచించండి. అటువంటి అమ్మ పేరును ఒక పెన్ను కోసమో, రంగు పెన్సిళ్ల కోసమో, నోట్‌ బుక్స్‌ కోసమో వాడుకుంటారా? అందుకే నేను నగేష్‌ బ్యాగ్‌ను వెతికించలేదు. ఇప్పుడు మీ సందేహం తీరిందా?’ అని మాస్టారు ఆ విషయాన్ని అంతటితో ముగించారు.

మధ్యాహ్న భోజనం ముగిసిన తర్వాత సుబ్బారావు మాస్టారే మళ్లీ వచ్చారు. వచ్చీరాగానే పాఠం చెప్పడం ప్రారంభించారు. మాస్టారు చెబుతున్న పాఠం నగేష్‌ చెవికెక్కడం లేదు. కళ్ల ముందు తననెంతో ప్రేమగా చూసుకునే అమ్మే కదులుతోంది. ఒక పెన్ను కోసం, కొన్ని రంగు పెన్సిళ్ల కోసం, ఒక నోట్‌ బుక్‌ కోసం.. అటువంటి అమ్మ మీద ఒట్టు వేశానా?’ అని తెగ బాధపడసాగాడు. గతంలోని స్నేహితుల సహవాసం వల్ల ‘అమ్మతోడు’ అని అనడం అలవాటైపోయింది. ‘ఆ మాట అంటే.. అవతలి వ్యక్తులు మనం చెప్పినదాన్ని నమ్ముతారని వాళ్లు చెప్పింది బాగా నాటుకుపోయింది. ఊతపదంగా అలవాటు చేసుకున్న ఆ మాటలో ఎంత అర్థముంది.. ఛీ ఛీ ఇన్నాళ్లు ఎంత ఘోరమైన మాట పలికాను?’ అనుకొని తనకు తానే అసహ్యించుకున్నాడు. ‘మాస్టారూ.. దొంగతనాలు నేనే చేశాను. క్షమించండి’ అని అన్నాడు.

వెంటనే చెబుతున్న పాఠాన్ని ఆపి మరీ.. వెనక్కి తిరిగారు మాస్టారు. విద్యార్థులంతా నగేష్‌ వైపే కళ్లప్పగించి చూడసాగారు. ఒక్కసారిగా తరగతి గది మొత్తం నిశ్శబ్దంగా మారింది. అప్పుడు మాస్టారు ‘తప్పు తెలుసుకొని సరిదిద్దుకున్నవాడు గొప్పవాడు. నగేష్‌ తన తప్పు తెలుసుకున్నాడు. అందరూ అభినందనలు తెలపండి’ అంటూ విద్యార్థులకు సూచించారు మాస్టారు. వెంటనే, తరగతి గది మొత్తం చప్పట్లతో మారుమోగింది. ఆ రోజు నుంచి నగేష్‌ తన నడవడికను మార్చుకున్నాడు.

- బెలగాం భీమేశ్వరరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని