Published : 20 Sep 2022 00:14 IST

కుహూ.. కుహూ.. కోయిల

అడవిలోకి ఒక కోకిల కొత్తగా వచ్చింది. ఆ అడవి అందాల్ని చూసి అది మురిసిపోయింది. అందమైన చెట్లు, గలగల పారే సెలయేర్లతో అడవి అందం చూడముచ్చటగా ఉండి, కోకిలకు ఎంతగానో నచ్చింది. ఆ అడవిలోనే ఉండిపోవాలని నిర్ణయం తీసుకుంది. ఆనందంతో కోకిల.. ‘కుహూ.. కుహూ..’ అంటూ తన్మయత్వంతో పాటలు పాడింది. కోకిల గానం విన్న అడవిలోని జంతువులు ఆశ్చర్యపోయాయి. ఆ మధుర గానానికి పరవశం చెందాయి.  

ఇంకేముంది... కోకిల పాటను అనుసరిస్తూ అడవిలోని జంతువులు కోకిల దగ్గరకు చేరాయి. జంతువులన్నీ కోకిల గానాన్ని ప్రశంసించాయి. మృగరాజు సింహం కూడా కోకిలను ప్రశంసించి.. ‘ఓ కోకిలా.. నీ గానం అద్భుతం. ఈ అడవి ఇక నీ పాటకు దాసోహం. ఇలాగే నీ పాటతో మమ్మల్ని పరవశులను చేయాలి’ అంది.

అందుకు కోకిల.. ‘సరే’ అని సింహానికి కృతజ్ఞతలు తెలిపింది. ఆ రోజు నుంచి కోకిల, తన గానంతో ప్రతిరోజూ జంతువులకు ఆనందాన్ని పంచింది. ఇక ఏనుగు, జింకలు, నెమళ్లు, కోతులు అయితే.. ప్రతీ సాయంత్రం కోకిల దగ్గరకు చేరి పాట పాడమని బతిమిలాడేవి. వాటి ఆనందాన్ని చూసి కోకిల తన మధుర గానంతో వాటిని మైమరిచిపోయేలా చేసేది. అవి ఆనందంగా నృత్యం చేస్తూ పరవశించిపోయేవి. అయితే ఆ అడవిలోని కాకులకు కోకిలపై అసూయ కలిగింది. అడవికి రాజైన సింహంతో సహా అందరూ కోకిల గానాన్ని మెచ్చుకోవడం వాటికి నచ్చలేదు.

ఓరోజు కాకుల గుంపు కోకిల దగ్గరకు వెళ్లి... ‘ఓ కోకిలా.. చూడటానికి నువ్వు మాలాగే ఉన్నావు. నువ్వు ఈ అడవిలో జీవించాలంటే మాతో కలిసిపోక తప్పదు. ఈ రోజు నుంచి పాటలు పాడటం ఆపేయి. లేదంటే నిన్ను ఈ అడవి నుంచి తరిమికొడతాం’ అని బెదిరించాయి. వెంటనే.. కోకిలకు చాలా భయం వేసింది. కాకుల సమూహంలో చేరడానికి అంగీకరించింది.

కాకుల చెంతకు చేరిన తర్వాత ఒప్పందం ప్రకారం తన గానాన్ని ఆపివేసింది. అడవిలోని జంతువులకు కోకిల గానం వినపడటం లేదు. అవన్నీ కోకిల కోసం వెతికాయి. అది ఎక్కడా కనబడలేదు.

జంతువులు నిరుత్సాహపడ్డాయి. మృగరాజు సింహం దగ్గరకు వెళ్లి కోకిల కనిపించడం లేదన్న విషయం తెలియజేశాయి. అందుకు సింహం, ‘అవును.. ఈ మధ్య కోకిల గానం నాకూ వినబడటం లేదు. బహుశా తన ప్రాంతానికి తిరిగి వెళ్లిపోయిందేమో?’ అంది. అక్కడకు వచ్చిన ఓ కోతి, ‘మహారాజా..! కోకిల మన అడవిలోనే ఉన్నదేమోనని నా అనుమానం. ఒకసారి కాకులను పిలిచి అడగండి’ అని సలహా ఇచ్చింది.

సింహానికి ఆ సలహా నచ్చి కాకులకు కబురు పంపింది. కోకిలతో కూడిన కాకుల సమూహం సింహం దగ్గరకు చేరుకుంది. కోకిల కనబడటం లేదన్న విషయం గురించి కాకుల్ని ప్రశ్నించింది సింహం. అందుకు కాకులు.. ‘దాని గురించి మాకే విషయమూ తెలియదు.. మహారాజా!’ అంటూ ఆమాయకత్వాన్ని నటించాయి. కోతికి మాత్రం కాకుల దగ్గరే కోకిల ఉందనే అనుమానం మొదటి నుంచీ ఉంది. కోతికి ఓ ఉపాయం తట్టింది.

కాకుల్ని ఒకేసారి అరవమని చెప్పింది. కాకులు మౌనంగా ఉండగా సింహం, కోతి చెప్పినట్టు చేయండని గద్దించింది. భయపడిన కాకులన్నీ ఒకేసారి.. ‘కావ్‌ఁ....కావ్‌ఁ...’ అని అరవడం మొదలు పెట్టాయి. ఆ కాకుల అరుపుల నుంచి.. ‘కుహూ..కుహూ’ అంటూ కోకిల గొంతు జంతువులకు వినిపించింది.

కోకిల కాకుల సమూహంలోనే ఉందని సింహం గ్రహించింది. కోకిలను దగ్గరగా రమ్మని మృగరాజు పిలిచింది. కాకుల సమూహం నుంచి కోకిల బయటకు వచ్చి సింహం ముందు నిల్చుంది. జరిగిన విషయం అంతా సింహానికి చెప్పింది కోకిల. కాకులను ఉద్దేశించి సింహం... ‘మిత్రులారా.. మీరు చేసిన పని నాకు నచ్చలేదు. కోకిల గొంతు మధురమే. అంత మాత్రాన మిమ్మల్ని ఎవరూ తక్కువ చేయడం లేదు. అడవిని శుభ్రంగా ఉంచడంలో మీరు చేస్తున్న పని వెలకట్టలేనిది. ఎవరి గొప్ప వారిదే. ఈర్ష్యాద్వేషాలు తగ్గించుకోండి’ అంటూ మందలించింది. సమాధానం చెప్పలేని కాకులు తలలు వంచుకున్నాయి. తమను మన్నించమని, ఇంకోసారి ఇలా చేయమని సింహాన్ని వేడుకున్నాయి. పాట పాడే క్షణం కోసం ఎదురు చూస్తున్న కోయిల, చాలా రోజులుగా మూగబోయిన తన గొంతును సవరించింది. ‘కుహూ.. కుహూ...’ అంటూ అద్భుత గానంతో అడవిని పులకింపచేసింది. జంతువులన్నీ సంతోషించాయి. అక్కడి వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. తనకు మంచి స్నేహితులు దొరికినందుకు కోకిల ఆనందపడింది.

- వడ్డేపల్లి వెంకటేష్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని