రెండు సామెతలు!

శ్రీరాములు తాతయ్యంటే ఊళ్లో అందరికీ గౌరవమే. వైద్యం చేస్తారు. వెనుకబడిన పిల్లలకు ఉచితంగా చదువు చెబుతారు. అవసరంలో ఉండేవాళ్లు, రోగులు సహాయం కోసం ఆ ఇంటికి వస్తుంటారు. ఒక రోజు మనవళ్లతో కలసి వరండాలో కూర్చుని మాట్లాడుతుండగా పెద్ద మనవడు.

Published : 21 Sep 2022 00:07 IST

శ్రీరాములు తాతయ్యంటే ఊళ్లో అందరికీ గౌరవమే. వైద్యం చేస్తారు. వెనుకబడిన పిల్లలకు ఉచితంగా చదువు చెబుతారు. అవసరంలో ఉండేవాళ్లు, రోగులు సహాయం కోసం ఆ ఇంటికి వస్తుంటారు. ఒక రోజు మనవళ్లతో కలసి వరండాలో కూర్చుని మాట్లాడుతుండగా పెద్ద మనవడు.. ‘నాకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. ప్రైవేట్‌ కంపెనీలో కూడా అవకాశం వచ్చింది. ఇక్కడైతే పదివేలు ఎక్కువ జీతం’ అని చెప్పాడు. ‘ఆలోచించడానికేముంది? ప్రభుత్వ ఉద్యోగంలో చేరిపో. అక్కడ స్థిరత్వం ఉంటుంది. జీతం సమయానికి అందుతుంది’ అన్నారు తాతయ్య. పక్కనే ఉన్న బామ్మ ‘రేపే చేరిపో. పదివేలు ఎక్కువొస్తుందని చూడకు. ఆలస్యం అమృతం విషం అన్నారు పెద్దలు’ అంది. సరేనన్నాడు మనవడు.

పొరుగింట్లో ఉండే మహిళ అప్పుడే వచ్చి తాతయ్యతో... ‘మా అమ్మాయికి పెళ్లి సంబంధాలు వచ్చాయి. తారాపురం వాళ్లు తాంబూలాలు మార్చుకోవడానికి వస్తామన్నారు. వాళ్లది మంచి సంబంధం అనిపిస్తోంది. ఏం చెయ్యమంటారు?’ అనడిగింది.

‘ఆ ఊళ్లో తెలిసిన వాళ్లున్నారు. కనుక్కుని చెప్పడానికి సమయం కావాలి’ అన్నారు తాతయ్య. మహిళ.. ‘వాళ్లు రేపే వస్తున్నారు. మా వారు ఆహ్వానించారట’ అంది నసుగుతూ. ‘పెళ్లంటే నూరేళ్ల పంట. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. తొందరపడకుండా వారం ఆగి రమ్మనండి. నిదానమే ప్రధానం అని వినలేదా?’ అంది బామ్మ. సరేనంటూ ఆమె వెళ్లిపోయింది. అక్కడే కూర్చుని బొమ్మలు గీసుకుంటున్న చిన్న మనవడు బామ్మ మాటలు విన్నాడు. ‘‘అన్న విషయంలో ‘ఆలస్యం అమృతం విషం’ అన్నావు. ఇప్పుడేమో ‘నిదానమే ప్రధానం’ అన్నావు. రెండు రకాలుగా చెప్పావేం’’ అనడిగాడు.

తాతయ్య వాణ్ని దగ్గరకు పిలిచి.. ‘ఏదైనా విషయంలో మంచి జరుగుతుందని కచ్చితంగా తెలిసినప్పుడు వెంటనే చేయమని చెబుతారు. అలాంటప్పుడు ఆలస్యం చేయవద్దని చెప్పడానికి.. ‘ఆలస్యం అమృతం విషమనే’ సామెత చెబుతారు. వెంటనే పని పూర్తి చెయ్యమని భావం. అన్నయ్యకు వచ్చింది ప్రభుత్వ ఉద్యోగం. తొందరగా చేరమని చెప్పాం. ఆ ఉద్యోగం కోసం ప్రయత్నించిన మరొకరెవరైనా వాళ్లకు రాకపోవడం వల్ల న్యాయస్థానానికి వెళ్లి ఆపమని కోరవచ్చు. అవన్నీ తేలడానికి సంవత్సరాలు పట్టొచ్చు. అందుకే తొందరగా చేరమని చెప్పాం’ అన్నారు.

‘అయితే మంచి సంబంధమని చెప్పినా వినకుండా నిదానమే ప్రధానమని బామ్మ ఎందుకంది?’ అడిగాడు మనవడు. ‘పెళ్లి విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. అబ్బాయి కుటుంబం, నడవడిక, చదువు, ఉద్యోగం, జీతంలాంటివన్నీ తెలుసుకోవడానికి సమయం పడుతుంది. అందుకే నిదానమే ప్రధానమని చెప్పాం’ వివరణ ఇచ్చారు తాతయ్య.

‘తొందరగా నిర్ణయం తీసుకుంటే నష్టమా’ అని అడిగాడు మనవడు. ‘మంచి ప్రశ్నే అడిగావు. ఉద్యోగమైతే నచ్చకపోతే మారొచ్చు. అలా మారడం వల్ల జీతం పెరగవచ్చు. గొప్ప ఉద్యోగం కూడా ఒక్కోసారి రావచ్చు. పెళ్లి విషయంలో అలా కాదు. పెళ్లి జరిగితే జీవితమంతా భార్యాభర్తలు కలిసి ఉండాలి. సంబంధాలు చూసే ముందే మంచి చెడులు తెలుసుకుని ముందుకు వెళ్లాలి. అందుకే ఆగమన్నాం’ అన్నారు తాతయ్య. ‘తాతయ్య చెప్పింది అర్థమైందా?’ అనడిగింది బామ్మ. అయినా ఇంకా అర్థమయ్యేలా చెప్పాలనిపించింది బామ్మకు. ‘‘అందుకే కచ్చితంగా మంచి జరుగుతుందని తెలిస్తే ఆగవద్దని చెప్పడానికి ఆలస్యం అమృతం విషం అని నొక్కి చెబుతాం. ఉదాహరణకు ఒక వస్త్ర దుకాణం వాళ్లు పండుగ ప్రత్యేక సందర్భంలో వెయ్యి రూపాయలకు మూడు చీరలని ప్రకటించారనుకో. వెంటనే వెళ్లి కొనుక్కోవాలి. ఆలస్యం చేస్తే దుకాణంలో చీరలు అయిపోతాయి. అక్కడ ఖర్చు పెట్టేది పెద్ద మొత్తం కాదు కాబట్టి అవకాశం వదులుకోవద్దని చెబుతాం’ అంది. మనవడి వైపు చూసి మళ్లీ ఇలా చెప్పింది.. ‘కొత్తగా ఎవరైనా ఓ కంపెనీ తెరిచి వాళ్ల దగ్గర పెట్టుబడి పెడితే మూడు నెలలకు రెట్టింపు డబ్బు ఇస్తామని ప్రకటించారనుకో. డబ్బుకు ఆశ పడి పరిగెత్తకూడదు. వాళ్ల దగ్గర లక్షల్లో డబ్బు జమ చెయ్యకూడదు. ఎక్కువ వడ్డీకి ఆశ పడితే మోసపోయే ప్రమాదముంది. అలాంటప్పుడు బాగా ఆలోచించాలి. అందుకే నిదానమే ప్రధానం అని చెబుతారు. కొన్ని నిర్ణయాలను తొందరగా తీసుకోవచ్చని, కొన్నింటి విషయంలో ఆలోచించమని చెప్పడానికి రెండు రకాలుగా చెబుతాం’ అంది బామ్మ. 

‘బాగా అర్థమైంది బామ్మా. పరీక్షల్లో జవాబులు రాసేటప్పుడు తొందర పడి తప్పులు రాయకూడదు. బాగా ఆలోచించి జవాబులు రాయాలి. పరుగు పోటీల్లో పాల్గొన్నప్పుడు త్వరగా వెళ్లాలి. ఆలస్యం చేస్తే బహుమతి పోతుంది’ అన్నాడు మనవడు. మనవడి రెండు బుగ్గలను ఒక వైపు తాతయ్య, మరోవైపు బామ్మా ముద్దు పెట్టుకుని అభినందించారు. 

- నారంశెట్టి ఉమామహేశ్వరరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని