Published : 22 Sep 2022 00:21 IST

చిలక ముక్కు రహస్యం

అడవిలో ఓ పెద్ద మర్రిచెట్టు ఒకటి ఉండేది. రకరకాల పక్షులకు అది ఆవాసం. దానికి కొద్దిదూరంలో ఉండే మరో భారీ వృక్షంపైన నివాసం ఏర్పరుచుకున్న కొన్ని పక్షులు.. కాలక్షేపానికి మర్రిచెట్టు పైన వాలి ముచ్చట్లాడుతుండేవి. ఒకరోజు మధ్యాహ్నం.. అడవిలో మరో మూలన ఉండే పక్షులు కొన్ని.. మేతను వెతుక్కుంటూ మర్రిచెట్టు వద్దకు వచ్చాయి. ఆ చెట్టుపైన పక్షులనూ మేతకు రమ్మని పిలిచాయి. దాని మీద ఉన్న గబ్బిలం, గుడ్లగూబ ‘మేం ఇప్పుడు రాలేం’ అని బదులిచ్చాయి. ‘ఆరోగ్యం బాగోలేదా?’ అడిగింది కాకి. ‘బాగానే ఉన్నాం కానీ బద్ధకంగా ఉంది. కాసేపయ్యాక వెళ్దాం’ అని కచ్చితంగా చెప్పాయవి.

‘ఎప్పుడు పిలిచినా మాతో రారేంటి!’ అని నిష్టూరమాడింది డేగ. ‘మీరే కొద్దిసేపు ఆగొచ్చు కదా..’ అని తెలివిగా బదులిచ్చింది గుడ్లగూబ. ‘అలా అంటావా?’ అంటూ చెట్టు మీద కూర్చుండిపోయింది డేగ. మిగతా పక్షులు.. ‘గుడ్లగూబ, గబ్బిలం సూర్యకాంతిని చూడలేవు. అందుకే అవి పగలంతా గూటిలోనే ఉండి, రాత్రిళ్లు తిరుగుతాయి. బద్ధకమనేది వాటి బడాయి మాత్రమే..’ అని గుసగుసలాడుకున్నాయి. మిత్రులను విడిచిపెట్టి వెళ్లలేక.. పక్షులన్నీ అక్కడే ఉండిపోయాయి. ‘చిలకమ్మ మాటలు వినిపించడం లేదు. మీతో పాటు రాలేదా?’ అడిగింది గబ్బిలం. ‘రాలేదు.. ఎక్కువ తినేద్దామని ముందుగానే వెళ్లింది’ చెప్పింది కొంగ. ‘చిలక చాలా స్వార్థపరురాలు’ అంటూ అక్కసును వెల్లగక్కింది గుడ్లగూబ.

‘చిలకమ్మకి అందగత్తెనన్న గర్వం’ అంది కాకి. ‘ఆకుల్లో కలిసిపోయే చిలకమ్మకు ఎర్రముక్కు మరీ అందాన్ని తెచ్చిపెట్టింది’ మెచ్చుకోలుగా అంది పిచ్చుక. ‘చాలు చాలులే.. చిలకమ్మను నువ్వే మెచ్చుకోవాలి’ ఈసడింపుగా అంది గుడ్లగూబ. ‘ఉన్న మాటంటే.. అంత కోపం ఎందుకు?’ ప్రశ్నించింది పిచ్చుక. ‘ఎర్రముక్కు గురించి అంతలా పొగడాలా? అది ఎన్ని టొమాటోలను ముక్కుతో పొడుచుకుతిందో? ఆ రంగే ముక్కుకు అంటినట్లుంది’ తెలిసినట్టు చెప్పింది గబ్బిలం. తలకిందులుగా వేలాడినప్పుడు నీ మెదడు ఎక్కడో జారిపోయినట్టుంది. టొమాటోకు అంత గుణం ఉంటే కుందేలు మామ రోజూ తింటుంది కదా.. మరి దాని మూతి ఎందుకు ఎరుపెక్కలేదు?’ ఎదురు ప్రశ్న వేసింది కొంగ.

గబ్బిలానికి ఒళ్లు మండింది.. ‘నా మెదడు జారిపోతే మీ తెలివి ఏమైంది?’ అని దెప్పిపొడిచిందది. ‘మనలో మనకు వాదనలెందుకు? చిలకమ్మ గొప్పతనం ఒప్పుకొని తీరాల్సిందే! చిలక కొరికిన జామపండు కోసం ఎంతమంది వెంపర్లాడతారో మీకు తెలియంది కాదు’ అంటూ సర్దిచెప్పింది కోకిలమ్మ. ‘పొదగడం చేతకాని నువ్వు కూడా చిలకమ్మ భజన చేస్తున్నావు. కాకమ్మ దయ తలచకపోతే అసలు నువ్వు పుట్టేదానివే కాదు’ అంటూ విరుచుకు పడింది గుడ్లగూబ. తన గొప్పతనం గురించి చెప్పిన గుడ్లగూబ వైపు కృతజ్ఞతాపూర్వకంగా చూసింది కాకి. ‘మనుషుల్లాంటి కళ్లతోపాటు తెలివితేటలూ గుడ్లగూబ సొంతం. చిలక ముక్కు రహస్యం దానికి తెలిసినంతగా మనకు తెలియదు’ అని కితాబిచ్చినట్లు మాట్లాడిందది. ‘చిలక.. దాని ముక్కుని ఎర్రని నిప్పు కణికల్లో పెట్టి కాల్చుకుంది. అందుకే చిన్న వంకరతో ఎరుపెక్కింది’ అని వివరణ ఇచ్చింది కాకి. ‘అలా అయితే ముఖం  నలుపెక్కిపోవాలి కదా!’ అనుమానంతో అడిగింది డేగ.

బలానికి చిరునామా అయిన డేగను ఎదిరించే శక్తిలేక మిన్నకుండి పోయింది గుడ్లగూబ. ‘ఎర్రని మిరపపండ్లు చప్పరించి ఉంటుంది!’ అని తన మనసులో మాటను చెప్పింది పావురం. ‘మిరప రుచి నీకు తెలుసా? అది చప్పరిస్తే గూబ గుయ్యిమంటుంది’ తన అనుభవాన్ని చెప్పింది కాకి. అప్పుడే మేత మేసి ఎగురుకుంటూ వచ్చి ఆ చెట్టుపై వాలింది చిలకమ్మ. ‘నీకు నూరేళ్లు. ఇప్పటి వరకు నీ గురించే మాట్లాడుకున్నాం. నువ్వు కొరికే జామపండుకి అంత ప్రత్యేకత ఉండడానికి నీ ముక్కే కారణం కదా.. ఆ రహస్యమేంటి?’ అని ఆరా తీసినట్టు అడిగింది కాకి. చిలకమ్మ పగలబడి నవ్వి.. ‘మీరంతా నా గురించి మాట్లాడుతూ సమయాన్ని మర్చిపోయినట్లున్నారు. ఇంతకీ మీరు మేతకు వెళ్లారా?’ అని అడిగింది.

‘అరరే.. చీకటి పడిపోయిందే’ అంటూ ఒకదాని ముఖం మరొకటి చూసుకున్నాయి పక్షులన్నీ. ఇంతలో గుడ్లగూబ, గబ్బిలం మాత్రం తుర్రుమంటూ... ఆహారం కోసం ఎగిరి వెళ్లిపోయాయి. ‘మమ్మల్ని కాసేపు ఆగమని చెప్పి.. ఉబుసుపోని కబుర్లలోకి దించి.. ఇప్పుడు ఎంచక్కా ఆ రెండూ బయటపడ్డాయి. మేము మాత్రం తిండి విషయమే మరచిపోయాం’ అని బాధపడ్డాయవి. ‘మాటలు ఎన్నడూ ఆకలి తీర్చవు. మనతో లేనివాళ్ల గురించి చర్చిస్తూ.. కాలాన్ని దుర్వినియోగం చేసుకుంటే ఇటువంటి శాస్తే జరుగుతుంది’ అంటూ దెప్పిపొడిచింది చిలకమ్మ. ‘ఇక నేను కొరికే జామపండు తియ్యగా ఉండడానికి కారణం.. నా ముక్కు కాదు. పండు రంగు, తాజాదనం చూసి వాలతాను. నా సహజ గుణమే నా ముక్కు రహస్యం’ అని నవ్వుకుంటూ ఎగిరిపోయింది చిలకమ్మ.

- బి.వి.పట్నాయక్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని