Published : 24 Sep 2022 00:25 IST

కప్ప మేలు!

నందనవనానికి సమీపంలో పాకాల చెరువు ఉంది. దాన్ని ఆనుకొనే పంటపొలాలు పచ్చగా కళకళలాడసాగాయి. ఆ చెరువులో చేపలతో పాటు ఓ కప్ప కూడా హాయిగా నివసించేది. ఇలా ప్రశాంతంగా గడుస్తున్న సమయంలో.. ‘ఏయ్‌... ఎందుకలా అరుస్తున్నావు? నీ బెకబెక చప్పుళ్లతో ఈ చెరువులో మాకు ప్రశాంతతే కరవైంది. కాసేపు హాయిగా నిద్రపోదామంటే ఒకటే గోల. పైగా నిన్ను చూస్తేనే మాకు అసహ్యం వేస్తోంది. చర్మం మీద అన్నీ దద్దుర్లే. నీ శబ్దాలతో మాకు కునుకు లేకుండా చేస్తున్నావు. వెళ్లి ఎక్కడో ఒకచోట బతకొచ్చు కదా’ అని తరచుగా చేపలు అనే మాటలు..

ఆ కప్పను బాధించాయి. అందుకే చెరువును ఆనుకొని ఉన్న పచ్చని పొలాల్లోకి వెళ్లిపోయింది కప్ప. దాంతో చెరువులో ఉన్న చేపలన్నీ చాలా సంతోషించాయి.

‘హమ్మయ్యా.. కప్ప పీడ విరగడైంది. మనం ఇక నుంచి హాయిగా నిద్రపోవచ్చు’ అనుకున్నాయా చేపలు. కాలం గడుస్తోంది. రోజురోజుకి చెరువులోని చేపల సంఖ్య తగ్గుతోంది. నీరంతా క్రిమికీటకాలతో నిండిపోయి కంపు కొడుతోంది. చేపలకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అన్నీ భయంభయంగా రోజులు గడపసాగాయి. కొంతకాలం క్రితం బంధువుల ఇంటికి వెళ్లిన కొర్రరాజు తిరిగి వచ్చింది. చెరువులో ఉన్న చేపలన్నింటికి పెద్ద కొర్రరాజు. అది తిరిగి చెరువులోకి చేరగానే చేపలన్నీ దాని దగ్గరికి వచ్చి.. తమ గోడును వెళ్లబోసుకున్నాయి.

ప్రశాంతంగా ఉండే చెరువులో ఏం జరుగుతుందో చేపల పెద్దకు కూడా అర్థం కాలేదు. చేపల సంఖ్య తగ్గడం మాత్రం ఆగలేదు. బంధువులు, మిత్రులను కోల్పోతుండటంతో కొర్రరాజుకు బాధ కలిగింది. తన మిత్రుడు కప్పని కలిస్తే ఏమైనా సలహా ఇస్తుందని అనుకొంది. కానీ చెరువు మొత్తం వెతికినా.. దాని జాడ కనిపించలేదు. ‘ఈ కప్ప ఎక్కడికి వెళ్లి ఉంటుంది’ అని ఆలోచనలో పడింది కొర్రరాజు. చేపల వద్దకు వెళ్లి ఆరా తీసింది. అవి భయపడుతూనే... ‘కప్ప వల్ల మన చెరువంత కంపు కొడుతోంది. దాని బెకబెక శబ్దాలతో మాకు రోజూ నిద్రాభంగమవుతోందని మేమే ఇక్కడ నుంచి వెళ్లగొట్టాం’ అని చెప్పాయవి.

దాంతో చేపలపైన కోప్పడింది కొర్రరాజు. చెరువు ఎందుకు ఇలా అయిందో.. చేపల సంఖ్య ఎందుకు తగ్గుతుందో అప్పుడు దానికి అర్థమైంది. ‘వెంటనే మీతో ఒక విషయం మాట్లాడాలి. అందరినీ సమావేశపరచండి’ అని వృద్ధ చేపలకు చెప్పిందది. మరుసటి రోజు సమావేశంలో ‘కప్ప, నేను కలిసినప్పుడు తరచుగా మా సంభాషణల్లో నేను గ్రహించిన విషయం ఏంటంటే.. ఈ భూమి మీద ప్రతిప్రాణి ముఖ్యమైనదే. కప్ప ఈ చెరువులో ఉన్న చిన్న చిన్న పురుగులను ఆహారంగా తీసుకోవడం వల్ల నీరంతా శుభ్రంగా ఉండేది. మన మిత్రుల సంఖ్య తగ్గడానికి కారణం కూడా కప్ప లేకపోవడమే!’ అంది. చేపలన్నీ ఆశ్చర్యపోయి అలాగే చూడసాగాయి.

‘ఎలా అంటే.. చేపలకు గాలం వేయడానికి ఎవరైనా వచ్చినపుడు ఒడ్డునే ఉండే కప్ప, తన శబ్దాలతో మనకు ఎప్పటికప్పుడు సమాచారం అందించేది. అది గమనించి, నేను మిమ్మల్ని అప్రమత్తం చేసేదాన్ని. ప్రతి ప్రాణి సృష్టి వెనక ఏదో ఒక గొప్ప కార్యం దాగి ఉంటుంది. ఒకరి జీవనం మరొకరిపై ఆధారపడి ఉంటుంది. కప్ప ఎలాంటి హాని తలపెట్టకుండా మనల్ని కాపాడుతూ వచ్చింది. మీరు దాని మంచి మనసును అర్థం చేసుకోకుండా, రూపాన్ని చూసి ఎగతాళి చేశారు. స్వార్థం, పొగరుతో దాన్ని వెళ్లగొట్టడం వల్ల చెరువులో పురుగుల సంఖ్య పెరిగింది. ఇప్పుడు మనకే ఇక్కడ ఉండే పరిస్థితి లేకుండా పోయింది. అలాగే.. జాలర్ల రాకను గమనించలేక వలకు చిక్కి ప్రాణాలు కోల్పోతున్నాం’ అని కొర్రరాజు వివరించింది.

తమ తప్పును తెలుసుకున్న చేపలు సిగ్గుతో తలదించుకొని.. ‘కొర్రరాజా! ఎలాగైనా వెళ్లి కప్పని తీసుకురండి’ అని కోరాయవి. ‘మిత్రులారా! చెరువు పక్కనే ఉన్న పొలాల్లో కప్ప తలదాచుకుందని ఇందాకే తెలిసింది. పదండి.. అందరం వెళ్లి తీసుకొద్దాం!’ అంది. చేపలన్నీ కప్ప దగ్గరకు వెళ్లి, ‘మిత్రమా! నీ విలువను గుర్తించకుండా మా మాటలు, చేష్టలతో చాలా ఇబ్బందికి గురిచేశాం. నిన్ను చెరువులో నుంచి వెళ్లగొట్టిన కొద్దిరోజులకే మేం చాలామందిని కోల్పోయాం. ఇప్పుడు మేము కూడా అక్కడ ఉండే పరిస్థితి లేదు. మంచి మనసుతో మమ్మల్ని క్షమించి.. మళ్లీ మాతో పాటు రా.. అందరం కలిసి చెరువులోనే హాయిగా ఉందాం. కొర్రరాజు మా కళ్లు తెరిపించింది’ అని వేడుకున్నాయి. ఆ మాటలకు కప్ప చాలా ఆనందించింది. మళ్లీ చెరువులోకి వెళ్లి, చేప మిత్రులతో కలసి సంతోషంగా జీవించసాగింది.

- ముక్కాముల జానకిరామ్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని