జిగేల్‌ జిగేల్‌.. బెర్రీ!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. ‘తెలిసింది గోరంత.. తెలియనిది కొండంత’ అనేది ఓ సినిమాలోని డైలాగ్‌. అదే మాదిరి.. జంతువులు, మొక్కల్లోని రకాల గురించి మనకు ఎంత తెలిసినా, తెలియనివి ఇంకా

Updated : 24 Sep 2022 06:24 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌.. ‘తెలిసింది గోరంత.. తెలియనిది కొండంత’ అనేది ఓ సినిమాలోని డైలాగ్‌. అదే మాదిరి.. జంతువులు, మొక్కల్లోని రకాల గురించి మనకు ఎంత తెలిసినా, తెలియనివి ఇంకా ఉంటూనే ఉంటాయి. అలాంటిదే.. ఇప్పుడు మనం చెప్పుకోబోయే పండ్లు కూడా. ఇంతకీ అసలా పండ్లేంటో, వాటి ప్రత్యేకతలేంటో చదివేయండి మరి..

‘మార్బుల్‌ బెర్రీ’.. మధ్య ఆఫ్రికా దేశాలైన ఇథియోపియా, మొజాంబిక్‌, టాంజానియాల్లోని అడవుల్లో మాత్రమే కనిపించే ఈ మొక్కల పండ్లు జిగేల్‌ జిగేల్‌మంటూ మెరుస్తాయట. ప్రకృతిలో అత్యంత సహజసిద్ధ మెరుపు ఉన్న పండ్లుగా వీటికి పేరుంది. సాధారణంగా ఈ మొక్కలు ఒక మీటరు వరకూ ఎత్తు పెరుగుతాయి. ఇవి గుత్తులుగా కాస్తుంటాయి. ఒక్కో గుత్తిలో దాదాపు 40 వరకూ గుండ్రటి పండ్లు ఉంటాయి.

ఆ మెరుపు ప్రత్యేకం..
ఈ మార్బుల్‌ బెర్రీ పండ్లు చూసేందుకు ఇనుప గోళీల్లా ఉంటాయి. సులభంగా చెప్పాలంటే.. క్రిస్మస్‌ సందర్భంగా అలంకరణకు ఉపయోగించే బంతుల్లా అన్నమాట. మొక్కలకు ఇలా పండ్లు కాయడం చాలా అరుదు. భూమ్మీద బోలెడు రకాల మొక్కలూ, పండ్లూ ఉన్నా.. ఈ మెరుపు మాత్రం దేనికీ లేదట. ఈ మాట నేను చెబుతున్నది కాదు ఫ్రెండ్స్‌.. ఈ పండ్ల మీద రకరకాల పరిశోధలు చేపట్టిన శాస్త్రవేత్తలే తేల్చారు.

ఎలా వచ్చిందంటే..
నిగనిగలాడే మెరుపు ఉన్న పండ్లను కాసే ‘మార్బుల్‌ బెర్రీ’లు మధ్య ఆఫ్రికా దేశాల్లో చాలా ప్రసిద్ధి. ఈ పండ్లకు అసలా మెరుపు ఎలా వచ్చిందనే అంశంపై చాలా మంది శాస్త్రవేత్తలు రకరకాల ప్రయోగాలు చేశారట. ఇంతకీ తేలింది ఏంటంటే.. ఈ పండ్ల పైభాగంలో నాలుగు పొరలతో కూడిన చిన్న చిన్న కణజాలాలు ఉంటాయట. మిగతా పండ్ల కంటే ఈ నిర్మాణం ప్రత్యేకంగా ఉండటంతో, ఆ కణజాలాల మీద పడిన కాంతిలో కొంత భాగం అక్కడికక్కడే పరావర్తనం చెందుతుంది. మిగతాది ఆ పొరల్లోనే వేరే చోట్ల నుంచి బయటకు వెళ్తుందట. ఆ విధంగా వాటికి ఆ దట్టమైన మెరుపు వచ్చిందని తేల్చారు. ఇలాంటి ఏర్పాటే.. నెమళ్లలోనూ ఉంటుందట. నెమళ్ల ఈకలు ముదురు గోధుమ రంగులో ఉన్నా.. వాటి నుంచి పరావర్తనం చెందే రంగు మాత్రం మనకు నీలం, ఆకుపచ్చగా కనిపిస్తుంది. కొన్ని రకాల సీతాకోకచిలుకల్లోనూ ఈ ప్రత్యేకత ఉంటుందట.

దశాబ్దాల తరబడి..
ఈ మార్బుల్‌ బెర్రీలకు ఉన్న మరో విశేషం ఏంటంటే.. చాలా సంవత్సరాలపాటు ఆ పండ్ల రంగు మారడం కానీ, కుళ్లిపోవడం కానీ జరగదట. అంతేకాదు.. ఇన్ని ప్రత్యేకతలున్నా, ఈ బెర్రీల లోపల మొత్తం గింజలే ఉండటంతో.. తినడానికి ఏమాత్రం పనికిరావట. అందుకే, కొందరు వ్యాపారులు ఈ బెర్రీలతో వెండి ఆభరణాలు కూడా తయారు చేశారు. ఈ పండ్లను వజ్రాల మాదిరి కత్తిరించడం, బంగారంలా కరిగించడం కుదరదు కాబట్టి.. ఎక్కువ కాలం నిలిచిపోతాయని వారి ఆలోచనట. మొత్తానికి ఇవండీ మార్బుల్‌ బెర్రీ విశేషాలు!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని