చిట్టి.. బుజ్జి.. పనిముట్లు!

షార్ప్‌నర్‌ కన్నా చిన్నవి.. ఎరేజర్‌ కన్నా బుజ్జివి.. అవన్నీ చిట్టి పనిముట్లు.. ఇంతకీ అవేంటి? ఎవరు తయారు చేశారు?ఎలా పనిచేస్తాయో... తెలుసుకోవాలని ఉందా..? అయితే ఇంకేం.. ఈ కథనం

Published : 25 Sep 2022 00:16 IST

షార్ప్‌నర్‌ కన్నా చిన్నవి.. ఎరేజర్‌ కన్నా బుజ్జివి.. అవన్నీ చిట్టి పనిముట్లు.. ఇంతకీ అవేంటి? ఎవరు తయారు చేశారు?ఎలా పనిచేస్తాయో... తెలుసుకోవాలని ఉందా..? అయితే ఇంకేం.. ఈ కథనం చదివేయండి మరి.

ప్రపంచంలోకెల్లా అతిచిన్న డ్రిల్లింగ్‌ యంత్రం కేవలం 17 మిల్లీమీటర్ల ఎత్తు, 13 మిల్లీమీటర్ల పొడవు, 7.5 మిల్లీమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. దీన్ని న్యూజిలాండ్‌కు చెందిన లాన్స్‌ అనే వ్యక్తి తయారు చేశాడు. ఇది చెవులు వినిపించని వారు ఉపయోగించే యంత్రంలో వాడే బ్యాటరీ సాయంతో పనిచేస్తుంది. ఇదొక్కటే కాదు.. ఈ అంకుల్‌ ప్రపంచంలోనే అతి చిన్న మర రంపాన్ని కూడా తయారు చేశాడు. ఈ రెండింటినీ త్రీడీ ప్రింటింగ్‌ టెక్నాలజీతో రూపొందించాడట.

మూడు గంటల్లో..
ఈ ప్రపంచంలోకెల్లా అతిచిన్న డ్రిల్‌ యంత్రాన్ని తయారు చేయడానికి లాన్స్‌కు మూడు గంటలు పట్టింది. నిజానికి ఈ పరికరాన్ని ప్రింట్‌ తీయడం కేవలం 25 నిమిషాల్లో అయిపోయింది. కానీ అమర్చడానికే ఎక్కువ సమయం తీసుకుంది. ఇది చిన్న చిన్న వస్తువులకు రంధ్రాలు చేయగలదు. నిజానికి దీన్ని రికార్డు కోసమే తయారు చేశారంట.

నాలుగు ముక్కల్లో...
ఈ బుజ్జి మర రంపానికి ఓ రూపం ఇవ్వడానికి నాలుగు ముక్కలను త్రీడీ ప్రింటింగ్‌ చేయాల్సి వచ్చింది. తర్వాత వీటిని క్రమపద్ధతిలో కలిపి ఈ బుల్లి యంత్రాన్ని తయారు చేశాడు. ఇది కూడా బ్యాటరీ సాయంతో నడుస్తుంది. ఈ మర రంపం బొటనవేలుకన్నా కూడా చిన్నగానే ఉంటుంది. కానీ దీనికున్న రంపం మాత్రం చిన్న చిన్న వస్తువులను అంటే అగ్గిపుల్లల్లాంటి వాటిని కత్తిరించగలదు. నిజానికి ఈ రెండు యంత్రాలు పెద్దవిగా ఉంటే.. చాలా శక్తిమంతమైనవి. శబ్దం కూడా చాలా ఎక్కువ చేస్తాయి. కానీ వాటి బుజ్జి రూపాలు మాత్రం చాలా బుద్ధిగా ఉంటాయి!.. అంటే సామర్థ్యం తక్కువే. వాటి నుంచి వచ్చే శబ్దమూ తక్కువే. మొత్తానికి ఈ బుజ్జి యంత్రాలు భలే ఉన్నాయి కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని