Updated : 27 Sep 2022 04:09 IST

ఎత్తుకు పైఎత్తు!

సోమయ్య జుట్టును కత్తిరించడంలో దిట్ట. ఎటువంటి జుట్టునైనా తన నైపుణ్యంతో చాలా అందంగా తీర్చిదిద్దేవాడు. అతని నిరంతర సాధనే.. సోమయ్య పేరును రాజ్యమంతా మారుమోగిపోయేట్లు చేసింది. తన నైపుణ్యం గురించి అందరికీ తెలియడంతో చాలా సంతోషపడసాగాడు. ఈ విషయం మంత్రి గారికి తెలిసింది. తన జుట్టును అందంగా తీర్చుదిద్దుకోవడం కోసం, సోమయ్యకు సేవకుడితో కబురు పంపాడాయన. గౌరవం కొద్దీ వెంటనే వెళ్లి మంత్రిని కలిశాడు సోమయ్య. మంత్రి కోరిక మేరకు తన ప్రతిభను మొత్తం ఉపయోగించి, ఆయన జుట్టును అందంగా తీర్చిదిద్దాడు.

సోమయ్య పనితీరుకు సంబరపడిపోయిన మంత్రి.. ‘ఇకనుంచి నువ్వు నాకు మాత్రమే సేవకుడిగా ఉండు. తగిన జీతం ఇస్తాను’ అని ఆశ పెట్టాడు. ‘సాధన లేకపోతే ఏ పనిలోనైనా నైపుణ్యం ఉండదు. మీ ఒక్కరి సేవకుడిగా ఉండిపోతే.. కొన్నాళ్లకు నా ప్రతిభ మరుగున పడిపోతుంది. అప్పుడు నా పనిని మీరే ఏవగించుకుంటారు. మీలాంటి పెద్దల దగ్గర ఉద్యోగం కత్తి మీద సాము లాంటిదని చెబుతుంటారు. నా సాధనకు అంతరాయం లేకుండా మీతో పాటు సామాన్య ప్రజలకూ సేవలు చేసుకునేలా అవకాశం కల్పించండి’ అని విన్నవించుకున్నాడు సోమయ్య. ఆ మాటలు మంత్రికి కోపం తెప్పించాయి. దాంతో ఎలాగైనా సోమయ్యను ఇబ్బంది పెట్టాలనుకున్నాడు.

ఇంటికి వెళ్లిపోయిన కొద్దిసేపటికి.. వెంటనే రమ్మని మహారాజు రఘువర్మ దగ్గర నుంచి సోమయ్యకు కబురు వచ్చింది. ఇది మంత్రి పనేనని ఊహించాడతను. తక్షణం సోమయ్యను తమ వెంట సభకు తీసుకెళ్లారు భటులు. కోట లోపలికి వెళ్లగానే.. సోమయ్యకు మంత్రితో పాటు రాజ దర్శనమైంది. ‘సోమయ్యా.. నీ నైపుణ్యం గురించి మంత్రి నాకు అంతా చెప్పారు. నీ అద్భుత ప్రతిభకి పట్టం కట్టాలనే ఉద్దేశంతో ఆస్థానంలో కొలువు ఇస్తున్నాను. ఇకనుంచి నా జుట్టు బాగోగులన్నీ నువ్వే చూడాలి’ అన్నాడు రఘువర్మ. ముసిముసి నవ్వులతో సోమయ్య వైపు చూశాడు మంత్రి. అదంతా మంత్రి కుట్రేనని అతడికి అర్థమైంది.

రాజు ఆస్థాన కొలువు చేస్తున్నవారు, ఇతరులకు సేవ చేయడానికి పనికిరారు. సాధన లోపంతో తన నైపుణ్యానికి గండికొట్టే ప్రయత్నంలో మంత్రి ఉన్నాడన్న సత్యం సోమయ్యకు అర్థమైంది. తప్పనిసరి పరిస్థితుల్లో రాజుగారి కొలువును అంగీకరించాడు. అదేరోజు సాయంత్రం జుట్టు సరిచేయించుకునేందుకు రఘువర్మ కిరీటం తీసి సోమయ్య ముందు కుర్చీలో కూర్చున్నాడు. రాజు జుట్టు చూసి ఆశ్చర్యపోయాడు సోమయ్య. మంత్రి కావాలనే తనపై కుట్ర పన్నాడని అప్పుడర్థమైంది. రాజు రఘువర్మ బట్టతలతో కొద్దిపాటి వెంట్రుకలు మాత్రమే కలిగి ఉండడం సోమయ్యకు కత్తి మీద సామైంది.

రోజులు గడుస్తుండగా.. రఘువర్మకి ఉన్న కొద్దిపాటి వెంట్రుకలూ ఊడిపోయాయి. ఇదే అదుననుకున్న మంత్రి ‘ప్రభూ.. సోమయ్య అవసరం ఇక మీకు లేదు. అతడిని ఆ ఉద్యోగం నుంచి తొలగించండి. మీకు సేవ చేసిన చేతులు ఇతరుల సేవకు వినియోగించకుండా ఆ చేతులను ఖండించండి’ అంటూ సోమయ్య మీద తన అక్కసును వెళ్లగక్కాడు. మంత్రి మాటలకు అక్కడే ఉన్న సోమయ్య బిత్తరపోయాడు. తన భవిష్యత్తును తలచుకొని కన్నీటి పర్యంతమయ్యాడు. కాసేపయ్యాక ధైర్యం తెచ్చుకొని మంత్రి పన్నాగానికి అడ్డుకట్ట వేయాలనుకున్నాడు. రఘువర్మ నోటి నుంచి మరో మాట రాకముందే ‘ప్రభూ.. బట్టతల అనేది పరిపూర్ణ జ్ఞానానికి సంకేతం. మేధావులకు బట్టతల రావడం సహజం. మన ఆస్థానంలో పని చేస్తున్న చాలామందికి బట్టతల దాఖలాలే లేవు. మీలాంటి మేధావుల దగ్గర మేధావులు పనిచేయడమే సబబు. నాకు బట్టతల రాలేదు కాబట్టి నేను మీ సేవకు అనర్హుడిని. నాలాంటి అనర్హులు మీ చుట్టూ ఎంతమంది ఉన్నారో గుర్తించి, అందుకనుగుణంగా చర్యలు తీసుకోవాలని నా అభ్యర్థన’ అంటూ మంత్రి పన్నాగాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేశాడు సోమయ్య.

సోమయ్య మాటలకు మంత్రి కంగుతిన్నాడు. రఘువర్మ తీక్షణంగా సభలోని అందరి తలలవైపు చూశాడు. సోమయ్య మాటలు తన పదవికే ఎసరు తీసుకొచ్చే ప్రమాదముందని గ్రహించాడు మంత్రి. సోమయ్యను, రాజు రఘువర్మను సంతృప్తి పరిస్తే కానీ ఇప్పుడీ చిక్కు నుంచి బయటపడలేనని తెలుసుకున్నాడు. ‘ప్రభూ.. మీ మేధాసంపత్తి వలన మీకు బట్టతల వచ్చింది. మీకే లేని వెంట్రుకలు ఈ పరివారానికి ఎందుకు? మీరు అనుమతిస్తే ఇకనుంచి ఆస్థాన పదవిలో ఉన్నవారంతా.. సోమయ్యతో గుండు కొట్టుంచుకొని.. రోజూ విధులకు హాజరవుతాం’ అని సంజాయిషీ ఇచ్చుకున్నాడు. దానికి రఘువర్మ సంతృప్తి చెందాడు. మంత్రికి తిక్క కుదిరింది. ఉద్యోగ హోదా ఎప్పటిలాగే కొనసాగడంతో సోమయ్య కూడా ఊపిరి పీల్చుకున్నాడు.

- బి.వి.పట్నాయక్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని