Updated : 28 Sep 2022 06:17 IST

భలే భలే... బ్రెడ్డు.!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. మనలో చాలామంది ఉదయం బడికెళ్లేముందు హడావిడిగా బ్రెడ్‌ తినేసి వెళ్లిపోతుంటారు. కొందరు జామ్‌తో, మరికొందరు శాండ్‌విచ్‌లా చేసుకుంటారు. కానీ, ఆ బ్రెడ్‌ చుట్టూ ముదురు రంగులో ఉండే.. వేగిన భాగాన్ని ఎక్కువ మంది ఇష్టపడరు. దాంతో చుట్టూ ఉన్నది పడేసి, మధ్యలోది మాత్రమే తింటుంటాం. ఈ వృథాను అరికట్టేందుకు ఓ హోటల్‌ వాళ్లు కొత్తరకం బ్రెడ్‌ను తయారు చేశారు. అదేంటో గబగబా తెలుసుకోండి మరి..

ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యల్లో ఆహార వృథా ఒకటి. చాలా దేశాల్లో ఆహారం దొరక్క ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. కొన్ని ప్రాంతాల్లో మాత్రం విపరీతంగా ఆహార వృథా జరుగుతోంది. ఈ వృథాను అరికట్టేందుకు జపాన్‌లోని ఓ హోటల్‌ సరికొత్త ఆలోచనతో ముందుకువచ్చింది. అదే.. ‘షోకుపన్‌ మిల్క్‌ బ్రెడ్‌’.

రుచికి రుచి.. గిరాకీ కూడా..
జపాన్‌లోని ఇంపీరియల్‌ హోటల్స్‌ యాజమాన్యం.. కాఫీ రంగులో చుట్టూ ఉండే కాలిన భాగం లేకుండా కేవలం తెల్లటి పదార్థంతోనే సరికొత్త బ్రెడ్డును తయారు చేసింది. ఈ వినూత్న బ్రెడ్‌కు రూపం తీసుకొచ్చేందుకు ఆ హోటల్‌ చెఫ్‌లకు దాదాపు ఆరు నెలలు పట్టిందట. దీని తయారీ విధానాన్ని పూర్తిగా బహిర్గతం చేయకపోయినా.. సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలను ఉపయోగించారట. ఇది మామూలు బ్రెడ్‌ కంటే చాలా మెత్తగా ఉండటంతోపాటు రుచిగానూ ఉందట.

వచ్చే నెల నుంచి..
ఈ తెల్లటి బ్రెడ్‌ అమ్మకాలను వచ్చే అక్టోబర్‌ ఒకటి నుంచి అధికారంగా ప్రారంభించనున్నట్లు సదరు హోటల్‌ పేర్కొంది. కానీ, ప్రస్తుతానికి ఆ హోటల్‌కు వచ్చే వారితోపాటు అనుబంధ దుకాణాల్లో మాత్రమే విక్రయిస్తారట. ఫైబర్‌ అనీ, మల్టీగ్రెయిన్‌ అనీ, మిల్లెట్‌ అనీ.. ఇలా రకరకాల బ్రెడ్‌ల గురించి తెలిసిన మనకు.. వాటన్నింటికీ భిన్నంగా ఉన్న ఈ మృదువైన తెల్లటి బ్రెడ్‌ను చూస్తుంటేనే నోరూరిపోతుంది కదూ! ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఈ బ్రెడ్‌ తెగ ట్రెండింగ్‌ అవుతోంది. ఇంతకీ దీని తయారీ వెనకున్న సూత్రాన్ని మాత్రం మీరు మరవకండి నేస్తాలూ.. అంటే, ఆహార వృథా చేయొద్దు అన్నమాట.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని