అరుదైన జాతి.. ధరలో మేటి!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. మనకు పప్పీలంటే చాలా ఇష్టం కదూ! ఉదయాన్నే వాకింగ్‌కు తీసుకెళ్లడంతోపాటు స్కూల్‌ నుంచి ఇంటికి రాగానే వాటితో కాసేపు ఆడుకుంటాం. ఆ పప్పీల్లోనూ చాలా రకాలుంటాయని మీకు తెలుసు.

Published : 05 Oct 2022 00:14 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌.. మనకు పప్పీలంటే చాలా ఇష్టం కదూ! ఉదయాన్నే వాకింగ్‌కు తీసుకెళ్లడంతోపాటు స్కూల్‌ నుంచి ఇంటికి రాగానే వాటితో కాసేపు ఆడుకుంటాం. ఆ పప్పీల్లోనూ చాలా రకాలుంటాయని మీకు తెలుసు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే పప్పీ మాత్రం వాటన్నింటికీ భిన్నం. ఎందుకంటే.. దాని ఖరీదు కోట్లలో ఉంటుంది కాబట్టి. మరి ఆ వివరాలేంటో చదివేయండి..

కుక్కలు విశ్వాసానికి ప్రతీక. అందుకే చాలామంది ఇళ్లలో పెంచుకుంటుంటారు. వాటినీ కుటుంబ సభ్యుల్లో ఒకరిగానే చూస్తుంటారు. కొన్ని పప్పీలు వేలల్లో, మరికొన్ని లక్షల్లో ధర పలుకుతుంటాయి. కానీ, టిబెటియన్‌ మస్టిఫ్‌ జాతి కుక్కలు మాత్రం కోట్లలో పలుకుతుంటాయి. నిజమే నేస్తాలూ.. ధర ఎంత ఉందో.. ప్రతిరోజూ వాటి నిర్వహణకు అయ్యే ఖర్చూ అదేస్థాయిలో ఉంటుందట.

అసలా పేరు ఎలా వచ్చిందంటే..
టిబెటియన్‌ మస్టిఫ్‌.. శరీరమంతా గుబురు జుట్టుతో, పొట్టిగా ఉండే ఈ కుక్కల పేరు కూడా వింతగా ఉంది కదూ! అదెలా వచ్చిందంటే.. ఈ జాతి కుక్కలు కేవలం టిబెట్‌ ప్రాంతంలోనే కనిపిస్తాయట. చైనాలో కూడా చాలా తక్కువ సంఖ్యలో ఉంటాయి. ఇవి 2 అడుగుల ఎత్తు వరకూ ఎదుగుతాయి. 50 నుంచి 100 కేజీల బరువు పెరుగుతాయి. అంటే దాదాపు మనిషి అంత అన్నమాట. అధిక శాతం నలుపు వర్ణంతో ఉండే ఈ జాతి కుక్కల జీవితకాలం 14 ఏళ్లు మాత్రమే. వీటి జుట్టు కళ్ల కిందకు వస్తున్నా సరే.. అలాగే ఉండగలుగుతాయట. చాలా మంది ఈ కుక్కలను పెంచుకునేందుకు ఇష్టపడరట. ఎందుకంటే.. ఇవి ఉన్నట్టుండి చాలా కోపంగా ప్రవర్తిస్తాయి.

పగటిపూట నిద్ర
టిబెట్‌లాంటి ప్రాంతాల్లో మస్టిఫ్‌ కుక్కలను గొర్రెలు, మేకల కాపలాకు ఎక్కువగా వినియోగిస్తుంటారు. వీటికి జ్ఞాపకశక్తి చాలా ఎక్కువ. పులులను కూడా చంపగలిగే శక్తి వీటి సొంతమట. పూర్వం ఈ జాతి కుక్కలను ఆర్మీ కోసం వాడేవారు. కాలక్రమంలో ఈ కుక్కలు స్టేటస్‌ సింబల్‌గా మారాయి. ఈ జాతి అంతరించిపోయే దశలో ఉండటంతో, కొందరు కోట్లు పోసి మరీ కొనుగోలు చేస్తున్నారు. రాత్రిళ్లు కాపలా కాసేందుకు వీలుగా.. పగటి పూట నిద్రపోతాయివి.

ఏసీ గదిలో వసతి
అసలిప్పుడు ఈ కుక్కల గురించి ఎందుకూ అంటే.. దసరా సందర్భంగా కర్ణాటకలోని శివమొగ్గలో ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి పెంపుడు జంతువుల ప్రదర్శనలో ఈ జాతి కుక్కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బెంగళూరుకు చెందిన ఓ వ్యాపారి తాను పెంచుకున్న కుక్కను ఇక్కడకు తీసుకురావడంతో అందరి కళ్లూ దానిమీదే ఉండిపోయాయి. రూ.10 కోట్లు ఖర్చు చేసి మరీ ఈ జాతి కుక్కను చైనా నుంచి ప్రత్యేక విమానంలో తెప్పించాడట. దానికి ‘భీమ’ అని పేరూ పెట్టాడు. రోజూ ఏసీ గదిలోనే ఉండే దీని నిర్వహణకు నెలకు రూ.25 వేలు ఖర్చవుతుందట. కిలోమీటరు కంటే ఎక్కువ దూరం నడవలేదు. ‘భీమ’ బరువు దాదాపు 100 కేజీలట. ఈ సెలబ్రిటీ కుక్కతో సెల్పీలు దిగేందుకు ప్రదర్శనకు వచ్చినవారు భలే ఆసక్తిచూపారు. ఇవండీ టిబెటియన్‌ మస్టిఫ్‌ విశేషాలు..!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని