Published : 07 Oct 2022 00:53 IST

పది రూపాయలు!

ఊరి పేరు సిరిపురం. పేరులో సిరి ఉన్నా ఊళ్లో మాత్రం సంపద లేదు. కొద్దిమంది రైతులు తప్పించి, అక్కడ అందరూ ఏ రోజుకు ఆ రోజు పనుల కోసం వెతికే వారే. పనులున్నప్పుడు ఊళ్లో, లేనప్పుడు పట్నంలో కూలీనాలీ చేసుకుని కాలం గడుపుతుండేవారు. రోజూ కూలీ దొరికే వారు ఎలాగో బతుకులు నెట్టుకొచ్చేవారు. పని దొరకని వారు మాత్రం.. ఏ ఆపద వచ్చినా డబ్బు కోసం విలవిల్లాడి పోతుండేవారు. చిన్నాపెద్దా అవసరాలకు, ఎవరిని అప్పు అడిగినా.. ‘పదో పాతికో సర్దగలం గానీ, వందలు వేలు మేమెలా సర్దగలం’ అనేవారు.

ఇలా ఉండగా.. కొత్తగా ఆ ఊరి పాఠశాలకు బదిలీ మీద రవీంద్ర మాస్టారు వచ్చారు. మర్నాడు జరగబోయే స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జెండా దిమ్మెను అలంకరించడానికి పూలు తీసుకురమ్మని పిల్లలను కోరారు. పిల్లలు.. ‘అన్ని పూలు మాకెక్కడ దొరుకుతాయి సార్‌’ అని చేతులెత్తేశారు.

అప్పుడు మాస్టారు నవ్వుతూ... ‘మనసుంటే మార్గముండదా?’ అని పిల్లలను ఉత్తేజ పరిచారు. అంతటితో ఆగక... ‘ఇంటికో పువ్వు.. ఈశ్వరుడికో దండ’ అన్న సామెత గురించి చెప్పారు. అంతే, పిల్లల్లో ఒక ఊపు వచ్చింది. మర్నాడు జెండా వందనానికి రకరకాల పూలు చేరిపోయాయి. పెదవి విరిచిన పిల్లలు ఆ పూలు చూసి నోరెళ్లబెట్టారు. పూల సేకరణ సంగతి అయిదో తరగతి విద్యార్థి రాము మనసులో బాగా నాటుకుపోయింది. మాస్టారు పిల్లలను ఉత్సాహ పరచడానికి చెప్పిన మాటలు పదే పదే గుర్తుకు రాసాగాయి.

ఆ సాయంత్రం ఊరి పెద్ద ధర్మయ్య దగ్గరకు వెళ్లి పాఠశాలలో పూల సేకరణ కోసం మాస్టారిచ్చిన ప్రోత్సాహం గురించి చెప్పాడు. అదే పద్ధతిలో మనం నిరుపేదల కోసం చెయ్యలేమా.. అని ధర్మయ్యను అడిగాడు. రాముకు వచ్చిన ఆలోచనను ధర్మయ్య మెచ్చుకున్నాడు. ఇద్దరు కలిసి రవీంద్ర మాస్టారు దగ్గరకు వెళ్లారు.

మాస్టారితో ధర్మయ్య, తన దగ్గరకు రాము రావడం, పాఠశాలలో పూల సేకరణ ఎలా జరిగిందో చెప్పడం, ఊళ్లో పేద జనం కోసం అలాంటి తీరులోనే ఏదో ఒకటి చెయ్యాలని కోరిన విషయం పూస గుచ్చినట్లు చెప్పాడు. పూల సేకరణ కోసం తాను చెప్పిన మాటలు రాములో కొత్త ఆలోచనకు స్ఫూర్తి కలిగించడం విని రవీంద్ర మాస్టారు కూడా చాలా ఆనందపడ్డారు. రామూను ఎంతో ప్రశంసించారు.

ముగ్గురూ కలిసి ఊరికి ఎలా సాయం చెయ్యాలో చర్చించుకున్నారు. తెల్లారింది. ఊరి రచ్చబండ దగ్గర నల్లబల్ల వెలిసింది. ఆ బల్ల మీద ‘మన ఊరికి మన సాయం’ అనే అందమైన అక్షరాలు రాసి ఉన్నాయి. వాటి కింద ధర్మయ్య, తన మనవడి పుట్టినరోజు సందర్భంగా.. ‘మన ఊరికి మన సాయం’గా పది రూపాయలు ఇచ్చినట్లు రాసి ఉంది. ఊరి ప్రజలు నల్లబల్ల గురించి ధర్మయ్య వద్దకు వెళ్లి అడిగారు.

‘ఆపద వచ్చిన వారికి మనం పెద్ద మొత్తంలో సాయం చేయలేం. కానీ ఎవరి వీలును బట్టి వాళ్లు కేవలం పది రూపాయలు విరాళం ప్రకటిస్తే చాలు. అంతకు మించి ఇవ్వక్కరలేదు. చిన్న చిన్న నీటిబిందువులు కలిస్తేనే మహాసముద్రం అవుతుంది. ఒక్కొక్క ఇటుక పేర్చితేనే భవనం పూర్తవుతుంది. సాయం కూడా భారం కాకూడదనే ఆలోచనతోనే ఈ విధానం ప్రారంభించాం. నేను, రవీంద్ర మాస్టారు, మన బడి విద్యార్థి రాము ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాం. మీరంతా సహకరిస్తే చిరు విరాళంతో నిరుపేదలకు పెద్ద సాయం చేసేవారమవుతాం’ అని చెప్పారు.

ఆ ఊరి జనానికి ధర్మయ్య మాటలు నచ్చాయి. ప్రతి రోజూ నల్లబల్లపై దాతల పేర్లు కనిపించసాగాయి. ఊర్లో నిరుపేదల అవసరాలు తీరసాగాయి. ‘అందరూ బాగుండాలి. అందులో మనముండాలి’ అనే సూక్తి ఆ ఊళ్లో నిజమైంది.

- బెలగాం భీమేశ్వరరావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని