మిణుగురుల సాయం

ఆ రోజు అమావాస్య. రాత్రివేళ చీకటి అలుముకుంది. ప్రకృతిని ఆస్వాదించడానికి గుంపుగా బయలుదేరాయి మిణుగురు పురుగులు. హుషారుగా ఎగురుతూ మైమరచిపోతున్నాయి. అందులో ఓ పిల్ల, తల్లి మిణుగురులు జంటగా వెళ్తున్నాయి.

Published : 08 Oct 2022 00:11 IST

ఆ రోజు అమావాస్య. రాత్రివేళ చీకటి అలుముకుంది. ప్రకృతిని ఆస్వాదించడానికి గుంపుగా బయలుదేరాయి మిణుగురు పురుగులు. హుషారుగా ఎగురుతూ మైమరచిపోతున్నాయి. అందులో ఓ పిల్ల, తల్లి మిణుగురులు జంటగా వెళ్తున్నాయి. ‘అమ్మా! ఆకాశంలో మన చుట్టాలింటికి వెళ్దామా?’ అని ఆశగా అడిగింది పిల్ల మిణుగురు. తల్లికి అర్థం కాలేదు. ‘ఆకాశంలో మనకు చుట్టాలెవరూ లేరు’ సమాధానమిచ్చింది తల్లి. ‘అంత ఎత్తులో మిణుకు మిణుకుమంటూ కనిపిస్తున్నవి మన చుట్టాలు కాదా?’ మళ్లీ అడిగింది పిల్ల మిణుగురు. ‘ఓహో అవా? అవి నక్షత్రాలు.. భూమికి దూరంగా ఉండడంతో అలా చిన్నగా కనిపిస్తున్నాయి. వాటికి దగ్గరగా వెళ్తే సూర్యుడిలా మండిపోతుంటాయి’ అని పిల్ల సందేహాన్ని నివృత్తి చేసింది తల్లి.

‘అమ్మా.. మండిపోతున్న నక్షత్రాలను ఎవరూ కాపాడలేరా?’ అడిగింది పిల్ల. ‘అవి అంతలా మండబట్టే స్వయం ప్రకాశకాలయ్యాయి. అవి అలా ఉండబట్టే.. జీవరాశులకు మనుగడ. ప్రకృతి ఇంత అందంగా ఉండడానికి అవీ ఓ కారణం’ వివరించింది తల్లి మిణుగురు. అలా మాటల్లో పడిన ఆ రెండూ గుంపునకు దూరమయ్యాయి. ఎగురుకుంటూ ఒక చెట్టుకు ఉన్న సాలీడు గూడులో చిక్కుకుపోయాయి. ‘అమ్మా.. ఎగరలేకపోతున్నాను’ అంటూ ఏడుపు అందుకుంది పిల్ల మిణుగురు. ‘నా పరిస్థితీ అలాగే ఉంది. మాటల్లో పడి సహచరులకు దూరమయ్యాం. కొద్దిసేపట్లో సాలీడుకు ఆహారం కాబోతున్నాం’ అని బాధపడింది తల్లి. ‘మనల్ని కాపాడేవారే లేరా?’ దీనంగా అడిగింది పిల్ల మిణుగురు.

అదే చెట్టుపైనున్న కోతి, చీకట్లో మెరుపు చూసి.. నిప్పు కణాలు చెట్టు మీదకొచ్చాయేమోనని భయపడింది. నిప్పు రాజుకుంటే చెట్టు కాలిపోతుంది. అది తన ప్రాణాలకే ముప్పు తెస్తుందనుకుంది. ఆ నిప్పులను ఆర్పే ఉద్దేశంతో మిణుగురుల దగ్గరకు వెళ్లింది. నోటితో గట్టిగా ఊదింది. మంటలు రాకపోవడంతో ఊపిరి పీల్చుకుంది. చెదిరిన సాలీడు గూడు నుంచి తల్లి, పిల్ల మిణుగురులు బయటపడ్డాయి. ‘కోతి బావా.. నీ సాయం మరువలేం’ అంటూ కృతజ్ఞతలు చెప్పింది తల్లి. ‘ఓసి మిణుగురులా.. నేను నిప్పు కణాలని భయపడి ఊదాను’ అంటూ అసలు విషయం చెప్పింది కోతి. ‘ఏది ఏమైనా నువ్వు చేసింది సాయమే.. నీ భయం మాకు ప్రాణభిక్ష పెట్టిందంటే అది మా అదృష్టమే’ అంది తల్లి. ‘ఇందాక నక్షత్రాల గురించి చెప్పావు. కోతి బాబాయ్‌ చేసిన మేలు ప్రత్యక్షంగా చూశాను. ఇతరుల మేలు కోరి నడుచుకున్నప్పుడు అందరి మన్ననలు పొందవచ్చని తెలుసుకున్నాను’ అని ముద్దుముద్దుగా అంది పిల్ల మిణుగురు.

‘మీరు మంచివారిలా ఉన్నారు. నా భయం సంగతి చెప్పినా, నేను చేసింది మేలేనని కృతజ్ఞతలు చెబుతున్నారు. ఇక మీరు వెళ్లండి.. ఎక్కువసేపు ఇక్కడే ఉంటే నా ప్రాణాలకు ముప్పు’ అంటూ ఆ మిణుగురులను పంపే ప్రయత్నం చేసింది కోతి. ‘మావల్ల నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి?’ అంటూ గడుసుగా అడిగింది పిల్ల మిణుగురు. ‘ఎలుగుబంటి ఒకటి నా వెంట పడుతోంది. మిమ్మల్ని చూసి మీ గుంపు ఇటు వచ్చిందంటే, ఆ వెలుగులో నన్ను ఎలుగు గుర్తుపట్టే ప్రమాదం ఉంది’ అంటూ అసలు సంగతి చెప్పింది కోతి. ‘ఎలుగుబంటితో నీకు విరోధమేంటి?’ అని ఆశ్చర్యంగా అడిగింది తల్లి. ‘దొంగతనంగా చెరకు తోటలోకి వెళ్లిన ఎలుగును రైతు చావగొట్టాడు. అక్కడే తచ్చాడుతున్న నన్ను చూసి, నేనే తన విషయం రైతుకు చేరవేశానన్న అనుమానంతో అక్కసు పెంచుకొని నన్ను తరుముతోంది. అందుకే ఇక్కడ దాక్కున్నా’ అని చెప్పింది కోతి.

‘ఎలుగుబంటి తిక్క కుదర్చాలంటే ఏం చేయాలి?’ ఆసక్తిగా అడిగింది పిల్ల మిణుగురు. ‘మనం అల్ప ప్రాణులం. అంత పెద్ద మాటలెందుకు?’ వారించింది తల్లి. ‘మేలు చేసినవారిని రక్షించకపోతే ఎలా?’ అందది. ‘మనసుంటే మార్గం ఉంటుంది. సాయానికి చిన్నా, పెద్దా తేడా ఉండదు. మీ మిణుగురుల దండు సాయముంటే చాలు’ అని తెలివిగా ఆలోచించి చెప్పింది కోతి. అంతే... గుంపును వెతుక్కుంటూ వెళ్లాయా తల్లీపిల్ల. కొద్దిసేపటికి అడవిని జల్లెడ పడుతున్న ఎలుగుబంటికి చెట్టుపై నుంచి వేలాడుతున్న కోతి తోక కనిపించింది. మొదట పాము అనుకొని, చెట్టును కదిపి చూసింది. కోతి అప్రమత్తమై పైన కొమ్మ మీదకు వెళ్లింది. పాము కాదు.. కోతే అని గుర్తించిన ఎలుగు బంటి ‘కిందకు దిగుతావా? నన్నే చెట్టుపైకి రమ్మంటావా?’ అని దాన్ని బెదిరించింది.
‘కొద్దిసేపట్లో నిప్పుల గాలి రాబోతుంది. దాని నుంచి రక్షించుకోవడానికి ఇక్కడ దాక్కున్నాను. నీకు ప్రాణాల మీద ఆశ ఉంటే పారిపో’ ధైర్యం చేసి అంది కోతి. ‘నాతోనే పరాచికాలా..?’ అంటూ చెట్టు ఎక్కబోయింది ఎలుగు. అంతే.. మిణుగురుల గుంపు ప్రవాహంలా అటువైపు దూసుకువచ్చింది. ఎలుగు కూడా అవి నిప్పు కణికలని పొరపడింది. ప్రాణభయంతో పరుగులు పెట్టింది. దాంతో మిణుగురుల గుంపు వైపు కృతజ్ఞతాభావంతో చూసింది కోతి.

- బి.వి.పట్నాయక్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు