తప్పు తెలుసుకున్న పిచ్చుక!

చెన్నాపురం ఊరి పొలిమేరలో పెద్ద మర్రి చెట్టు ఒకటి ఉండేది. ఆ చెట్టు కొమ్మల పైన అనేక పక్షులు గూళ్లు కట్టుకుని హాయిగా జీవిస్తుండేవి. అక్కడే నివాసం ఉండే పిచ్చుకల జంట.. ఇటీవలే మూడు పిల్లలకు జన్మనిచ్చింది. ఒకరోజు ఆహారం కోసం వెళ్లిన మగ పిచ్చుక సూర్యాస్తమయం అవుతున్నా.. రాకపోయేసరికి.. ఆడ పిచ్చుక వెతుక్కుంటూ వెళ్లింది.

Published : 09 Oct 2022 00:06 IST

చెన్నాపురం ఊరి పొలిమేరలో పెద్ద మర్రి చెట్టు ఒకటి ఉండేది. ఆ చెట్టు కొమ్మల పైన అనేక పక్షులు గూళ్లు కట్టుకుని హాయిగా జీవిస్తుండేవి. అక్కడే నివాసం ఉండే పిచ్చుకల జంట.. ఇటీవలే మూడు పిల్లలకు జన్మనిచ్చింది. ఒకరోజు ఆహారం కోసం వెళ్లిన మగ పిచ్చుక సూర్యాస్తమయం అవుతున్నా.. రాకపోయేసరికి.. ఆడ పిచ్చుక వెతుక్కుంటూ వెళ్లింది. గూడు సరిగ్గా లేకపోవడంతో, కళ్లు కూడా సరిగ్గా తెరవని ఆ పిచ్చుక పిల్లల్లో ఒకటి జారి పడిపోయింది. అది సరిగ్గా కింది కొమ్మపైన ఉన్న కాకి గూడులో పడింది.

ఆ గూడులోనే ఉన్న ఆడ కాకి అది గమనించింది. వెంటనే తన కాళ్లతో దాన్ని పట్టుకొని పిచ్చుక గూడులో వదిలిపెట్టింది. పెద్ద పిచ్చుకలు వచ్చేవరకూ అక్కడే ఉండి ఎదురు చూడసాగింది. అప్పుడే వచ్చిన ఆడ పిచ్చుక.. దూరం నుంచే తన గూడు దగ్గర కాకి ఉండడం చూసి, అటునుంచి అటే పక్షులకు రాజైన గద్ద వద్దకు వెళ్లింది. ‘రాజా! నేను లేని సమయం చూసి నా బిడ్డను ఎత్తుకెళ్లడానికి కాకి వచ్చింది’ అని ఫిర్యాదు చేసింది. గద్ద వెంటనే పిచ్చుక గూడు వద్దకు వచ్చి చూడగా.. కాకి ఇంకా అక్కడే కనిపించింది. ‘రాజా.. గూడు సరిగ్గా లేక పిచ్చుక పిల్ల, కిందనున్న నా గూటిలో పడితే తీసుకొచ్చాను. మళ్లీ అది పడిపోకుండా పెద్ద పిచ్చుకలు వచ్చే వరకు కాపలాగా ఉన్నాను. మంచితనానికి పోతే.. ఇంకేదో అయిందన్నట్లు నా మీదే నింద మోపడం సరికాదు’ అని వివరణ ఇచ్చింది కాకి.

‘నేను ప్రత్యక్షంగా చూశాను కాబట్టి కాకి కట్టుకథ అల్లుతోంది’ అని రెట్టించింది పిచ్చుక. ‘నువ్వు పిచ్చుక పిల్లను కాపాడటం వేరే ఏ పక్షి అయినా చూసిందా? సాక్ష్యం ఉందా?’ అని ప్రశ్నించింది గద్ద. ‘ఆపదలో ఉన్నప్పుడు సాయం చేస్తాం కానీ సాక్ష్యం కోసం చూస్తామా?’ అంది కాకి. ‘తప్పించుకోవాలని చూడకు. సాక్ష్యం కావాల్సిందే.. లేకపోతే నీకు శిక్ష తప్పదు’ అని హెచ్చరించింది గద్ద. ‘రాజా.. కాకి చెప్పింది నిజమే. అందుకు నేనే సాక్ష్యం’ అంది ఓ గండు చీమ. ‘మరి ఇంత ఆలస్యంగా చెబుతున్నావేంటి?’ అడిగింది గద్ద.

‘నా పిల్లలకు ఆహారం పెట్టి వస్తున్నాను..అందుకే కాస్త ఆలస్యమైంది’ అని జవాబిచ్చింది గండు చీమ. ‘నువ్వు చిన్న ప్రాణివి కాబట్టి నీ సాక్ష్యం చెల్లదు’ అంది గద్ద. కాకి వైపు చూస్తూ.. ‘అయ్యిందేదో అయిపోయింది. నీకు శిక్ష ఏమిటంటే పిచ్చుకకు చక్కటి గూడు కట్టి ఇవ్వాలి. అంతేకాదు.. పిచ్చుక పిల్లలు కళ్లు తెరిచే వరకు వాటికి నువ్వే ఆహారం అందించాలి’ అంది గద్ద. అప్పుడే అక్కడికి వచ్చాయి మగ కాకి, మగ పిచ్చుక. ‘మహాభాగ్యం.. నా పిల్లలకు ఆహారం తెచ్చి పెట్టినట్టే.. వాటికీ తీసుకొస్తాను’ అంది ఆడ కాకి. ‘నేనూ సాయం చేస్తాను’ అంది మగ కాకి. సరేనంటూ వెళ్లిపోయింది గద్ద.

గద్ద విధించిన శిక్ష ప్రకారం.. పిచ్చుక గూడును బలంగా నిర్మించింది కాకి జంట. పిచ్చుకల జంట తెచ్చిన ఆహారాన్ని రెండు పిల్లలే తినసాగాయి. మూడోది తినేది కాదు. కాకి తెచ్చిన ఆహారాన్ని మాత్రమే అది తినేది. కళ్లు కూడా తెరవని తనను కాపాడే క్రమంలో ఆడ కాకి స్పర్శను గుర్తుపెట్టుకుందా పిచ్చుక పిల్ల. అప్పుడు ఆడ పిచ్చుక ఆలోచనలో పడింది. కాకి చెప్పింది నిజమేననీ, తానే అనవసరంగా అపార్థం చేసుకున్నానని జ్ఞానోదయమైంది. వెంటనే విషయాన్ని గద్దకు చెప్పి.. క్షమాపణ కోరింది. గూటికి తిరిగి వచ్చాక.. కాకి దంపతుల వద్దకు వెళ్లి.. ‘నా బిడ్డను కాపాడటమే కాకుండా చూడచక్కని గూడు కట్టిచ్చారు. ముందూ వెనకా ఆలోచించకుండా అపార్థం చేసుకున్నాను. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాం’ అంది పిచ్చుక. ‘జరిగిందేదో జరిగిపోయింది. ఇకనుంచి మనమంతా ఒకటే. కలిసిమెలిసి ఐకమత్యంతో ఉందాం’ అని కాకులతోపాటు అన్నాయి మిగతా పక్షులు. దూరం నుంచి అదంతా గమనిస్తూ.. సంతోషించింది గద్ద.

- యు.విజయశేఖర రెడ్డి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని