ఈశ్వరయ్య తెలివి!

పార్వతీపురం శివారు ప్రాంతంలో విద్యాధరుడు అనే గురువు, ఎంతో మంది పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పుతుండేవాడు. ఆయన గురుకులానికి ఆనుకొనే ఓ మామిడితోట ఉంది. దాని యజమాని ఈశ్వరయ్యే.. ఆ తోటకు కాపలా ఉంటుండేవాడు. ప్రతిరోజూ గురుకులంలో గురువు చెప్పే పాఠాలతోపాటు వాటిని విద్యార్థులు వల్లెవేయడం అతడికి వినిపిస్తుండేది.

Published : 11 Oct 2022 00:14 IST

పార్వతీపురం శివారు ప్రాంతంలో విద్యాధరుడు అనే గురువు, ఎంతో మంది పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పుతుండేవాడు. ఆయన గురుకులానికి ఆనుకొనే ఓ మామిడితోట ఉంది. దాని యజమాని ఈశ్వరయ్యే.. ఆ తోటకు కాపలా ఉంటుండేవాడు. ప్రతిరోజూ గురుకులంలో గురువు చెప్పే పాఠాలతోపాటు వాటిని విద్యార్థులు వల్లెవేయడం అతడికి వినిపిస్తుండేది. పద్యాలు, గణిత ప్రక్రియలో చిక్కులెక్కలు విని ముగ్ధుడయ్యేవాడు. ఇష్టంగా వినడంతో ఈశ్వరయ్యకు కూడా అవన్నీ కంఠతా అయ్యాయి.

ఆ సంవత్సరం మామిడి విరగ్గాసింది. తనలో జ్ఞానాభివృద్ధికి బాటలు వేసిన పిల్లల పట్ల కృతజ్ఞత తెలపాలనుకున్నాడు ఈశ్వరయ్య. వాళ్ల ప్రతిభ ఆధారంగా పండ్లు పంచి ఉత్సాహ పరచాలనుకున్నాడు. తోట పక్కగా వెళ్లి.. గురుకులం ముంగిట తచ్చాడుతున్న ముగ్గురు పిల్లలను పిలిచాడు. ‘మీ గురుకులంలో మొత్తం ఎంతమంది విద్యార్థులు ఉన్నారు?’ అని అడిగాడు ఈశ్వరయ్య. వరసకు ముగ్గురు నిలబడితే ఎవరూ మిగలరన్నాడు మొదటి వాడు. వరసకు తొమ్మిది మంది నిలబడినా అంతేనన్నాడు రెండో విద్యార్థి. వరసకు పదిహేను మంది నిలబడినా కూడా ఎవరూ మిగలరని చెప్పాడు మూడోవాడు. ‘ఓహో.. అలాగా.!’ అని నవ్వుకుంటూ తోటలోకి వెళ్లిపోయాడు ఈశ్వరయ్య.

వెంటనే మంచి మంచి మామిడి పండ్లను కోశాడు. వాటిని లెక్కించి ఒక బుట్టలో సర్దాడు. తరవాత ఆ బుట్ట నెత్తిన పెట్టుకొని గురుకులంలోకి ప్రవేశించాడు. అప్పటికే విద్యాధరుడు శిష్యులను ఓ చెట్టు నీడన కూర్చోబెట్టి, పాఠ్యాంశాన్ని బోధిస్తున్నాడు. ‘వందనాలు గురువు గారూ..’ అంటూ పండ్ల బుట్టను విద్యాధరుడి చెంత ఉంచాడు ఈశ్వరయ్య. ‘ఈ తియ్యని మామిడి పండ్లను విద్యార్థుల ప్రతిభ ఆధారంగా పంచాలనుకుంటున్నాను. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు పొందిన వారి పేర్లు తెలియజేయగలరు’ అని వినయంగా అడిగాడు.  

సోము, గోపి, రాము అంటూ వరసక్రమంలో చెప్పాడు విద్యాధరుడు. ఆ ముగ్గురూ లేచి నిలబడ్డారు. వారిని చూసి ఆశ్చర్యపోతూ.. ‘కొద్దిసేపటి క్రితం ఈ ముగ్గురిని కలిశాను. నిజంగానే వీరు ప్రతిభావంతులు. విద్యార్థుల సంఖ్య అడిగితే ప్రశ్నల రూపంలో సమాధానమిచ్చారు. నేను కూడా అదే మాదిరి ప్రశ్నలతోనే పంపకం చేస్తా. అర్థం చేసుకోడానికి ప్రయత్నించండి’ అన్నాడు ఈశ్వరయ్య. ముగ్గురూ అలాగేనని తలూపారు. మిగిలిన విద్యార్థులు మాత్రం.. ఈశ్వరయ్య వేయబోయే ప్రశ్నల కోసం ఆసక్తిగా ఎదురుచూడసాగారు. విద్యాధరుడు చిరునవ్వుతో ఆస్వాదిస్తున్నాడు.  

‘సోమూ! మిరప దినుసులో ఉండే రుచి ఏమిటి?’ అడిగాడు ఈశ్వరయ్య. ‘కారం’ అని సమాధానమిచ్చాడు సోము. ‘గోపీ! ఏడుపునకు వ్యతిరేక పదం చెప్పగలవా?’ అడిగాడు ఈశ్వరయ్య. ‘నవ్వు’ అని టక్కున చెప్పాడు గోపి. ‘రామూ! డుమువులు ఏ విభక్తి?’ అని ప్రశ్నించాడు ఈశ్వరయ్య. ‘ప్రథమా విభక్తి’ అని సమాధానమిచ్చాడు గోపి. ‘ముగ్గురూ బాగానే సమాధానాలిచ్చారు. మీరు నా ప్రశ్నలో దాగి ఉన్న సంఖ్యలకు తగ్గట్లుగా పండ్లు తీసుకోండి. మిగిలిన వారికి ఒక్కొక్కరికి రెండు పంచి పెట్టండి. అప్పుడు బుట్ట ఖాళీ అయిపోతుంది. బుట్టలో మొత్తం ఎన్ని పండ్లు తెచ్చానో ఇందాక మీ గురువు గారిని పలకరిస్తూ చెప్పాను’ అంటూ వివరించాడు ఈశ్వరయ్య.

ఇప్పుడు పిల్లలంతా ఆలోచనలో పడ్డారు. విద్యాధరుడు ముఖాన చిరునవ్వు మెరిసింది. ముగ్గురూ ప్రశ్నలను గుర్తుకు తెచ్చుకొని, మొదటివాడు పది పండ్లు తీసుకున్నాడు. రెండోవాడు ఏడు, మూడో విద్యార్థి మూడు పండ్లు తీసుకున్నారు. మిగిలిన వారికి రెండేసి పంచారు. బుట్ట సరిగ్గా ఖాళీ అవడంతో.. విద్యార్థులను ప్రశంసించాడు ఈశ్వరయ్య. ‘ఎలా తెలుసుకున్నారు?’ అని కుతూహలంకొద్దీ శిష్యులను అడిగాడు విద్యాధరుడు. ‘మిరప దినుసు’లో అనగానే మిరపలో ‘ప’, దినుసులో ‘ది’ కలిపి.. పదిగా గుర్తించానన్నాడు సోము. ‘ఏడుపు’లో ఏడు ఉందన్నాడు గోపి. ‘రామూ! డుమువులు’లో మూడు గుర్తించానన్నాడు రాము. ‘ఇంతకీ మా గురుకులంలో పిల్లలెంతమందో చెప్పగలిగితే.. బుట్టలో ఎన్ని పండ్లు తీసుకొచ్చానో చెప్పమని నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం నేను చెబుతాను’ అన్నాడు విద్యాధరుడు.

గురుకులంలో విద్యార్థులు నలభై అయిదు మంది అని సమాధానమిచ్చాడు ఈశ్వరయ్య. ‘భేష్‌’ అంటూ ప్రశంసించాడు విద్యాధరుడు. విద్యార్థులంతా చప్పట్లతో అభినందించారు. ‘వందనాలు గురువు గారు’లో వంద, నాలుగు ఉంది. అంటే.. నువ్వు బుట్టలో తీసుకొచ్చిన పండ్లు నూట నాలుగు అని అర్థమైందంటూ నవ్వుతూ చెప్పాడు విద్యాధరుడు. నిజమేనన్నాడు ఈశ్వరయ్య. ‘నీ చమక్కులు బాగున్నాయి’ అని కితాబిచ్చాడు గురువు. ‘గురుబ్రహ్మ అయిన మీ దగ్గర విద్యాబుద్ధులు నేర్చుకుంటున్న ఈ పిల్లలూ.. మీకు తగిన చురుకైన వారసులే..’ అంటూ తోట బాట పట్టాడు ఈశ్వరయ్య.  

- బి.వి.పట్నాయక్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని