పోస్టుకార్డులతో ప్రపంచ యాత్ర!

హలో ఫ్రెండ్స్‌.. ఇప్పుడంటే మనకు సెల్‌ఫోన్లు, కంప్యూటర్లు రావడంతో వాటి ద్వారానే దూరంగా ఉన్న వారితో మాట్లాడుతున్నాం. ‘మరి అవి లేని రోజుల్లో?’ - సమాచార మార్పిడి మొత్తం ఉత్తరాల ద్వారానే సాగేదని మీరు పుస్తకాల్లో చదువుకొనే ఉంటారు.

Published : 12 Oct 2022 00:07 IST

హలో ఫ్రెండ్స్‌.. ఇప్పుడంటే మనకు సెల్‌ఫోన్లు, కంప్యూటర్లు రావడంతో వాటి ద్వారానే దూరంగా ఉన్న వారితో మాట్లాడుతున్నాం. ‘మరి అవి లేని రోజుల్లో?’ - సమాచార మార్పిడి మొత్తం ఉత్తరాల ద్వారానే సాగేదని మీరు పుస్తకాల్లో చదువుకొనే ఉంటారు. మన తరానికి అంతగా పరిచయం లేని ఉత్తరాలతోనే ఓ నేస్తం ప్రపంచాన్ని చుట్టేస్తోంది. ఆ వివరాలే ఇవీ..

గోవా రాష్ట్ర రాజధాని పనాజీకి చెందిన హీనా షాకు పోస్టు కార్డులు సేకరించడం హాబీ. తన వయసు పిల్లలంతా ఆన్‌లైన్‌ గేమ్స్‌ అంటుంటే.. హీనా మాత్రం విభిన్నంగా ముందుకెళ్తోంది. చిన్నతనం నుంచే ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న వివిధ రకాల పోస్టు కార్డులను సేకరిస్తూ.. వాటన్నింటితో ఓ లైబ్రరీ కూడా ఏర్పాటు చేస్తానంటోంది.

త్రీడీవి కూడా..
ప్రస్తుతం హీనా దగ్గర 100 దేశాలకు చెందిన రకరకాల పోస్టు కార్డులు ఉన్నాయట. వాటిలో చెక్కతో చేసినవీ, పజిల్‌ థీమ్‌వీ, చేతితో పెయింట్‌ చేసినవీ ఉన్నాయట. ఈ నేస్తం 2011లో తన తొలి ఉత్తరం రాసింది. ఆ ఉత్తరం పసుపు రంగులో ఉండటంతోపాటు దాని మీద సుడోకు పజిల్‌ ఉందట. కొద్దిరోజులకు ఆ ఉత్తరానికి సమాధానంగా.. అవతలి వ్యక్తి మరో ఉత్తరం పంపించారట. అందులో కస్టమైజ్డ్‌ పజిల్‌ ఉండటంతో హీనా ఎంతో సంబరపడిపోయింది. ఇక అప్పటి నుంచి తరచుగా ఉత్తరాలు రాయడం, తీసుకోవడం చేస్తుండేది. అది కాస్తా.. క్రమంగా హాబీలా మారింది.

ఆన్‌లైన్‌ వేదికగా..
పోస్టుక్రాసింగ్‌ - అనే ఆప్‌ ఒకటి ఉంది. అందులో పోస్టు కార్డుల సేకరణపైన ఆసక్తి ఉన్న వివిధ దేశాలకు చెందిన వారు సభ్యులుగా ఉంటారు. మన హీనా కూడా ఆ ఆప్‌లో మెంబర్‌. ఆ ఆప్‌ వేదికగా వివిధ దేశాలకు చెందిన అరుదైన పోస్టు కార్డులను సేకరిస్తోంది. తన దగ్గరున్నవి కూడా అడిగిన వాళ్లకు పంపిస్తుంటుంది. అలా కొన్ని పురాతనమైన వాటితోపాటు హోలోగ్రాఫిక్‌, అరుదైన స్టాంపులు అతికించి ఉన్నవీ సేకరించింది.

పిల్లల కోసం లైబ్రరీ..
ఈ పోస్టు కార్డుల సేకరణ వెనక సరదాతోపాటు ఓ మంచి కారణమూ ఉంది ఫ్రెండ్స్‌. అదేంటంటే.. ఇలా సేకరించిన పోస్టు కార్డులతో చిన్న పిల్లల కోసం ఓ లైబ్రరీని ఏర్పాటు చేస్తుందట. ఆయా కార్డుల పైనున్న సమాచారంతోపాటు వాటి గురించిన విశేషాలను చిన్నారులకు తెలియజేయడమే కాకుండా వారిలో స్ఫూర్తి నింపేందుకే ఈ ప్రయత్నమట. తనను చూసి మరికొంతమందీ వినూత్న హాబీలను అలవాటు చేసుకుంటే ఎంతో సంతోషిస్తానని చెబుతుందీ హీనా షా. ఆయా దేశాలకు వెళ్లకుండానే, పోస్టు కార్డుల ద్వారా అక్కడి విశేషాలను తెలుసుకోవడం ఎంతైనా ఓ సరికొత్త అనుభవమే కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని