‘చింటూ’ని కొట్టిందెవరు?

చిత్రవనం అడవిలో చింటూ అనే నక్క నివసిస్తుండేది. అది ఒట్టి సోమరిపోతు. ఆకలి వేసినప్పుడు తన జిత్తులతో వేరే జంతువు సంపాదించిన ఆహారాన్ని తినేసేది. కడుపు నిండాక.. జంతువుల పిల్లలను ఏడిపిస్తూ ఆనంద పడుతుండేది. ‘అలా ఏడిపించడం తప్పు కదా?’ అని ఎవరైనా ప్రశ్నిస్తే.. ‘తప్పు కాదు.. అది నాకు ఆటవిడుపు’ అనేది.

Published : 13 Oct 2022 00:24 IST

చిత్రవనం అడవిలో చింటూ అనే నక్క నివసిస్తుండేది. అది ఒట్టి సోమరిపోతు. ఆకలి వేసినప్పుడు తన జిత్తులతో వేరే జంతువు సంపాదించిన ఆహారాన్ని తినేసేది. కడుపు నిండాక.. జంతువుల పిల్లలను ఏడిపిస్తూ ఆనంద పడుతుండేది. ‘అలా ఏడిపించడం తప్పు కదా?’ అని ఎవరైనా ప్రశ్నిస్తే.. ‘తప్పు కాదు.. అది నాకు ఆటవిడుపు’ అనేది. అలవాటులో భాగంగా ఒకరోజు ఆహారం కోసం వెళుతుండగా.. తన ముందరి కాళ్లకి ఒక వెదురు కర్ర బలంగా తగిలింది. ‘కుయ్యో.. మొర్రో.. ఎవర్రా నన్ను కొట్టింది?’ అనుకుంటూ బాధతో అక్కడే కూలబడింది. చుట్టూ వెతికినా, ఎవరూ కనబడలేదు. బాధతోపాటు ఏడుపూ రెట్టిపైంది.

అటుగా వెళ్తున్న కుందేలు, చింటూ ఏడుపు విని.. దగ్గరకు వచ్చింది. ‘దెబ్బ ఎలా తగిలింది? నడుస్తూ నడుస్తూ పడ్డావా?’ అని అడిగింది. ‘లేదు.. నన్నెవరో కావాలనే కొట్టారు. నువ్వు ఈ అడవికి మంత్రివి కదా. నన్ను కొట్టిందెవరో కనిపెట్టి శిక్షించు’ అంది చింటూ. చింటూ మాటలకు నవ్వింది కుందేలు. ‘ఒక పక్క నేను బాధ పడుతుంటే, నువ్వు నవ్వడం ఏమీ బాగాలేదు’ దీనంగా అంది చింటూ. ‘అది కాదు చింటూ.. ఇప్పుడు నిన్ను కొట్టిందెవరో కనిపెట్టుకుంటూ కూర్చుంటే, నీ గాయం మానదు కదా. వైద్యం చేయిస్తే తగ్గుతుంది. ఆ తరవాత కొట్టిందెవరో విచారణ చేద్దాం. నేను వెళ్లి పింకీని తీసుకొస్తా’ అంటూ కుందేలు బయలుదేరింది.

‘అదసలే కోతి.. వైద్యం బాగా చేస్తుందా?’ అని అనుమానంగా అడిగింది చింటూ. ‘అనవసరంగా గాబరా పడకు’ అంటూ వెళ్లిన కుందేలు.. కాసేపటికి పింకీతో వచ్చింది. అది రాగానే ‘నిన్ను కొట్టిందెవరు?’ అని అడిగింది. ‘అది తెలియకే ఈ బాధ’ అంది చింటూ. సరేనంటూ దాని కాళ్లకు పసరు మందు రాసి కట్టుకట్టింది. ఇదంతా అక్కడే చెట్టు పైనున్న కాకి చూసింది. చింటూకు గాయం అయిందని అడవి మొత్తం ప్రచారం చేసింది. విషయం తెలిసిన అడవి జంతువులు, పక్షులు చింటూను పరామర్శించేందుకు వచ్చాయి. ‘చింటూ.. నిన్నెవరు కొట్టారు?’ అని అడిగాయవన్నీ. ‘సరదాగా అందరి పిల్లలను ఏడిపించే నేను.. ఇప్పుడిలా వీళ్ల ముందు గాయంతో కూర్చోలేకపోతున్నాను. వీళ్ల మాటలే నన్ను మరింత బాధ పెడుతున్నాయి. ఇదే మంచి సమయం. నన్ను కొట్టిందెవరో కనుక్కో!’ అంటూ కుందేలు చెవిలో చెప్పింది చింటూ.

‘కంగారు పడకు.. ఇప్పుడే అడిగేస్తే నిన్ను కొట్టినవారు అప్రమత్తమై జాగ్రత్తగా తప్పించుకుంటారు’ అని నచ్చజెప్పింది కుందేలు. కానీ, ఆ మాటలు దానికి నచ్చలేదు. ‘పింకీ మందు వేయడంతో బాధ కొంత నయమైంది కానీ, నన్నెవరు కొట్టారో తెలిస్తే పూర్తిగా తగ్గుతుంది. మీలో నన్ను కొట్టిన వారెవరో మర్యాదగా చెబుతారా లేదా?’ అంటూ గట్టిగా అడిగింది చింటూ. ‘చింత చచ్చినా, పులుపు చావలేదంటే ఇదే.. పరామర్శగా వచ్చిన మాతో నువ్విలా మాట్లాడటం బాగోలేదు’ అంటూ ఆ జీవులన్నీ అక్కడి నుంచి కదిలాయి. ‘నేను నీకు ముందే చెప్పాను. సమయం చూసి విచారణ చేస్తానని.. ఇప్పుడేమైంది.. వారంతా చక్కగా తప్పించుకున్నారు. పెళ్లికి వెళ్లిన మృగరాజు రాగానే.. ఒకమాట చెప్పి నేనే కనుక్కుంటా’ అంది కుందేలు. అలాగేనంది చింటూ.

‘చింటూ.. ఎక్కువ మాట్లాడకుండా తగినంత విశ్రాంతి తీసుకుంటేనే నీ గాయం తగ్గుతుంది. జాగ్రత్తగా ఉండు. మళ్లీ కట్టు కట్టడానికి రేపు వస్తాను’ అంటూ పింకీ అక్కడి నుంచి కదిలింది. కుందేలు కూడా వెళ్లబోతుండగా ‘నన్ను కొట్టిందెవరో తెలిసిపోయింది’ అని చింటూ అరుపుతో కుందేలు ఒక్కసారిగా ఆగింది. వెనక్కు తిరిగి ‘ఎవరు?’ అని అడిగింది. ‘ఇంకెవరు.. నన్ను కొట్టింది పింకీనే..’ చెప్పింది చింటూ. ‘పింకీనేనని నువ్వు ఎలా కనిపెట్టావు?’ అని ఆరా తీసింది కుందేలు. ‘నా కాలికి తగిలిన కర్రకు ఈ నల్ల తాడు చిక్కుకొని ఉంది. ఇదెప్పుడూ పింకీ మెడలోనే ఉంటుంది. కానీ, నాకు కట్టు కట్టేటప్పుడు అది దాని మెడలో లేదు. నేనడిగితే ఉదయం ఎక్కడో పడిపోయిందని సమాధానం చెప్పింది. అంటే.. గాయపరిచిన పింకీనే నాకు వైద్యం చేసింది. నువ్వు వెంటనే దాన్ని శిక్షించు. నా బాధ పూర్తిగా తగ్గించు’ అని కుందేలును వేడుకుంది చింటూ.

ఆ మాటలకు కుందేలు బిగ్గరగా నవ్వింది. ‘నా బాధ నీకు నవ్వులాటగా ఉందా?’ అని కోపంగా అడిగిందది. ‘మరీ అంత కోపం వద్దు చింటూ.. ఇలాగే జంతువులన్నీ తమ పిల్లలను ఆటపట్టించొద్దని ఎన్నిసార్లు వేడుకున్నాయి నిన్ను? కానీ, నువ్వు వినిపించుకున్నావా? వాటి బాధను పట్టించుకోకుండా.. అదే నువ్వు సరదాలా భావించావు. నీ తుంటరి వేషాలు మృగరాజుకు తెలిసి మందలించినా, నువ్వు మారలేదు. సింహం అడవిలో లేకపోవడంతో నీ అల్లరిని హద్దులు దాటించావు. ఒకరిని బాధపెడితే.. ఆ నొప్పి ఎలా ఉంటుందో నీకు తెలియాలని, నేనే పింకీతో కొట్టమని చెప్పాను. ఇప్పటికైనా బుద్ధిగా ఉంటే నీకే మంచిది. లేకపోతే ఈసారి శిక్ష మరింత పెరుగుతుంది’ అని హెచ్చరించింది కుందేలు. ఆ మాటలకు చింటూలో భయం కలిగింది. ‘ఏదో తెలిసీతెలియక ఇన్నాళ్లూ సరదాగా జంతువుల పిల్లలను ఏడిపించాను. ఇకనుంచి పద్ధతిగా ఉంటాను’ అంది చింటూ. ఇప్పటికైనా దారిలోకి వచ్చావంటూ అక్కడి నుంచి బయలుదేరింది కుందేలు.

- కె.వి.లక్ష్మణరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని