అడవిలో దీపావళి

దండకారణ్యంలో ఉండే ఓ కోతుల గుంపునకు జనారణ్యం ఎలా ఉంటుందో చూడాలని కోరిక కలిగింది. అనుకున్నదే తడవుగా అడవికి దగ్గర్లో ఉన్న ఆనందపురం అనే గ్రామానికి వెళ్లాయి. అక్కడ మనుషుల సందడి చూసి అవి ఆశ్చర్యపోయాయి.

Published : 14 Oct 2022 00:07 IST

దండకారణ్యంలో ఉండే ఓ కోతుల గుంపునకు జనారణ్యం ఎలా ఉంటుందో చూడాలని కోరిక కలిగింది. అనుకున్నదే తడవుగా అడవికి దగ్గర్లో ఉన్న ఆనందపురం అనే గ్రామానికి వెళ్లాయి.

అక్కడ మనుషుల సందడి చూసి అవి ఆశ్చర్యపోయాయి. ఆరోజు దీపావళి కావడంతో ఊర్లో కళగా ఉంది. ప్రతీ ఇల్లు బంధు మిత్రులతో కళకళలాడుతోంది. పసందైన వంటకాల కమ్మటి వాసనలు కోతులకు నోరూరించాయి. అక్కడే చెట్ల మీద నుంచి పండగ సందడిని ఆశ్చర్యంతో చూస్తున్నాయి కోతులు.

వానరాల రాకను గమనించిన వెంకట్రామయ్య అనే వ్యక్తి తన ఇంట్లో ఉన్న కొన్ని పిండి వంటలను వాటికి కనబడేలా చెట్టు కింద ఉంచాడు. కోతులు క్షణం ఆలస్యం చేయకుండా చెట్టు దిగి వంటకాలను ఆరగించాయి.

ఎన్నడూ ఎరగని కమ్మని రుచితో వాటి మనసు ఆనందంతో నిండి పోయింది. ‘అయ్యా...మీరు పెట్టిన ఆహారం పసందుగా ఉంది. మీకు ధన్యవాదాలు...’ అంటూ వెంకట్రామయ్యకు కృతజ్ఞతలు తెలిపాయి అవి.

‘అయ్యా.. ఊరంతా సందడిగా ఉంది. ఈ సందడికి కారణం తెలుసుకోవచ్చా?’అని అంది కోతుల నాయకుడు అరుణధారి. అందుకు వెంకట్రామయ్య... ‘అవును, ఈ రోజు దీపావళి. చెడుపై మంచి గెలిచిన శుభదినం. అందుకే అందరం సంతోషంగా పండగ చేసుకుంటాం. రాత్రి అయితే దీపాలను వెలిగించి చీకటిని పారదోలుతాం’ అని బదులిచ్చాడు.

అందుకు అరుణధారి... ‘అయ్యా, సంతోషం! పండగ విశిష్టతను తెలియచేశారు. మంచి విందుతో మమ్మల్ని ఆనందింపజేేశారు. మీకు ధన్యవాదాలు. మాకూ ఇలాగే పండగ చేసుకోవాలని కోరిక కలుగుతోంది’ అని తన మనసులోని మాటను తెలియజేసింది. కోతుల కోరికను విన్న వెంకటరామయ్య తన ఇంట్లో ఉన్న మరికొన్ని పిండివంటలు, ప్రమిదలు, ఒత్తులు, నూనెను కానుకగా ఇచ్చాడు.

బహుమతులు తీసుకుని కోతుల గుంపు ఆనందంగా అడవికి వెళ్లింది. దీపావళి పండగ గురించి అడవిలోని జంతువులకు తెలియజేశాయి. మృగరాజు సింహం... ‘మనమూ.. దీపావళి పండగను ఘనంగా చేద్దాం’ అని అంది. వెంటనే అడవిలోని జంతువులన్నీ సంతోషంగా గంతులు వేశాయి. కోతులు తెచ్చిన పిండివంటలను రుచి చూశాయి.

కోయిలలు కమ్మని పాటలు పాడాయి. నెమళ్లు ఆనందంగా నృత్యం చేశాయి. ఏనుగులు ఘీంకారం చేశాయి. కుందేళ్లు చెంగు చెంగున గంతులు వేశాయి. ఎలుగుబంట్లు తేనెను సేకరించి జంతువులన్నింటికీ పంచాయి. దీపాలను వెలిగించి అడవి అంతా అలంకరించాయి. దీపాలతో అడవికి వచ్చిన శోభను చూసి మురిసిపోయాయి. చీకట్లో మెరుస్తున్న దీపాల కాంతులతో ఆ అడవి అందం రెట్టింపైంది. జాతి భేదాలు మరిచిన జంతువులు దీపావళిని సంతోషంగా జరుపుకొన్నాయి. గొప్ప సందేశం కలిగిన దీపావళిని ఇలాగే ప్రతి సంవత్సరం జరుపుకోవాలని మృగరాజు సింహం అంది.

అందుకు జంతువులన్నీ సంతోషంగా అంగీకరించాయి. ఆ విధంగా ఘనంగా దీపావళి నిర్వహించుకున్న జంతువులు మళ్లీ సంవత్సరం వచ్చే దీపావళి కోసం ఎదురు చూడసాగాయి.

- వడ్డేపల్లి వెంకటేష్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని