‘మాటా.. మాటా..’ ఓ చిన్నమాట!

హాయ్‌ నేస్తాలూ.. బాగున్నారా..! ఏంటి అలా విచిత్రంగా చూస్తున్నారు. నేను ఎవరనా? నేను కాస్త విచిత్రంగా ఉన్నా కదూ! నన్ను చూస్తుంటే మీకు భయం వేస్తోంది కదా! నేను డ్రాగన్‌లా కనిపిస్తున్నప్పటికీ నేను డ్రాగన్‌ను కానేకాదు.

Published : 14 Oct 2022 00:07 IST

హాయ్‌ నేస్తాలూ.. బాగున్నారా..! ఏంటి అలా విచిత్రంగా చూస్తున్నారు. నేను ఎవరనా? నేను కాస్త విచిత్రంగా ఉన్నా కదూ! నన్ను చూస్తుంటే మీకు భయం వేస్తోంది కదా! నేను డ్రాగన్‌లా కనిపిస్తున్నప్పటికీ నేను డ్రాగన్‌ను కానేకాదు. నేను ఎవరో తెలుసుకోవాలని ఉందా...! మరి.. నేను ఎవరంటే?...

నేను ఓ తాబేలును నేస్తాలూ! నా పేరు మాటా- మాటా. నేను దక్షిణ అమెరికాకు చెందిన జీవిని. నేను మంచినీటిలోనే నివసిస్తాను. ఉప్పునీటిలో బతకలేను. నేను ఎక్కువగా అమెజాన్‌, ఒరినోకో నదుల్లో కనిపిస్తుంటాను. నా ఒంటి మీద ముళ్లలాంటి నిర్మాణాలుంటాయి. నా తల కూడా మిగతా తాబేళ్లకు భిన్నంగా ఉంటుంది.

నా బరువెంతంటే...
మాలో కొన్ని బ్రౌన్‌, మరి కొన్ని నలుపు రంగులో ఉంటాయి. నేను 95 సెంటీమీటర్ల వరకు పెరుగుతాను. బరువేమో 21 కిలోల వరకు తూగుతాను. నా మెడ కూడా మిగతా తాబేళ్లతో పోల్చుకుంటే చాలా పొడవుగా పెరుగుతుంది.

ఏం తింటానంటే..
నేను చిన్న చిన్న పురుగులు, చేపల్ని ఆహారంగా తీసుకుంటాను. నా రూపం వల్ల నన్ను చేపలు గుర్తించలేవు. నేను నీటి అడుగున కదలక మెదలక ఉండిపోతాను. నా దగ్గరికి చేపలు రాగానే అమాంతం వాటిని మింగేస్తాను. మరో విషయం ఏంటంటే.. నేను చేపలు, పురుగుల్ని నమలలేను. నేరుగా మింగేస్తానంతే! కొన్ని ప్రత్యేక సందర్భాల్లో చిన్న చిన్న పక్షుల్ని కూడా తింటాను తెలుసా!

రాత్రి పూటే వేట..
నేను ఎక్కువగా రాత్రిపూటే వేటాడతాను. నీళ్లు బురదగా ఉన్నా నేను చక్కగా వేటాడగలను. కానీ నేను మరీ అంత మంచి వేటగాణ్నైతే కాదు. ఏదో అలా కష్టపడి నా బుజ్జి పొట్ట నింపుకుంటాను. మాలో ఆడవి ఏటా అక్టోబర్‌, నవంబర్‌ మధ్య గుడ్లను పెడతాయి. వీటి సంఖ్య 12 నుంచి 28 వరకు ఉంటుంది. కొన్ని రోజులు పొదిగిన తర్వాత వీటి నుంచి బుజ్జి బుజ్జి పిల్లలు బయటకు వస్తాయి. నేస్తాలూ.. మొత్తానికి ఇవీ నా విశేషాలు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని