శెభాష్‌ కనక్‌!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. మనం రోజూ ఎంతో హుషారుగా స్కూల్‌కి వెళ్లి వస్తుంటాం. అంతవరకూ బాగానే ఉన్నా.. పుస్తకాలు, నోట్‌బుక్స్‌తో బరువుగా ఉండే బ్యాగ్‌ను వీపున వేసుకొని మోసుకెళ్లేందుకు, మళ్లీ దాన్ని ఇంటికి తీసుకొచ్చేందుకు చాలా కష్టపడతాం కదూ!

Published : 15 Oct 2022 00:10 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌.. మనం రోజూ ఎంతో హుషారుగా స్కూల్‌కి వెళ్లి వస్తుంటాం. అంతవరకూ బాగానే ఉన్నా.. పుస్తకాలు, నోట్‌బుక్స్‌తో బరువుగా ఉండే బ్యాగ్‌ను వీపున వేసుకొని మోసుకెళ్లేందుకు, మళ్లీ దాన్ని ఇంటికి తీసుకొచ్చేందుకు చాలా కష్టపడతాం కదూ! కానీ, ఇప్పుడు మనం చెప్పుకోబోయే నేస్తం మాత్రం కిలోల కొద్దీ బరువులను సునాయాసంగా ఎత్తేస్తోంది. అరుదైన అవకాశాలనూ దక్కించుకుంటోంది. ఆ వివరాలే ఇవీ..

* గుజరాత్‌ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌కు చెందిన కనక్‌ అనే బాలికకు ప్రస్తుతం 10 సంవత్సరాలు. గత మే నెలలో మోతెరాలో జరిగిన రాష్ట్రస్థాయి పవర్‌లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో అద్భుత ప్రతిభ చూపింది. అంతేకాదు.. త్వరలో అమెరికాలో జరగనున్న ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో పాల్గొనే అవకాశం కూడా దక్కించుకుంది.

సరదాగా వెళ్లి..
కనక్‌ వాళ్ల తల్లిదండ్రులు ఇందర్‌సింగ్‌, ధరణి.. ఇద్దరూ పవర్‌లిఫ్టింగ్‌లో ఛాంపియన్లే. ఒకసారి వారిద్దరూ ఓ పోటీలకు ముఖ్యఅతిథులుగా వెళ్లారు. తనూ వస్తానని వెంటబడటంతో కనక్‌ను కూడా వారితోపాటు తీసుకెళ్లారు. ఆ పోటీల్లో ఓ మహిళ పవర్‌లిఫ్టింగ్‌ చేయడాన్ని ఈ నేస్తం చూసింది. ఆమె వయసు కాస్త ఎక్కువే అయినా, ఎత్తు మాత్రం తనకు సమానంగా ఉన్నట్లు గమనించింది. అప్పుడే.. తను కూడా పవర్‌ లిఫ్టింగ్‌ చేస్తానని తల్లిదండ్రులను అడిగింది. ‘ఇంత చిన్న వయసులోనే అవసరమా?’ అని వారు ముందు కాస్త తటపటాయించినా.. పాప ఆసక్తి చూసి సరేనన్నారు. అలా సరదాగా పోటీలకు వెళ్లిన కనక్‌.. దాన్నే కెరియర్‌గా మార్చుకుంది. చదువుకు ఇబ్బంది లేకుండానే పోటీలకు హాజరవుతోంది. టీచర్లు కూడా సహకరిస్తున్నారట.

నాన్నతోపాటు సాధన
ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం తండ్రితోపాటే జిమ్‌కి వెళ్లి ప్రాక్టీస్‌ చేయడం మొదలుపెట్టింది కనక్‌. అలా చిన్న చిన్న పోటీలకు వెళ్లడంతోపాటు ప్రతిభను మెరుగుపరుచుకుంటోంది. గత మే నెలలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో 102.5 కేజీల బరువు ఎత్తి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ నెల 30 నుంచి నవంబర్‌ 5 వరకూ అమెరికాలో జరగనున్న వరల్డ్‌ పవర్‌లిఫ్టింగ్‌ పోటీల్లో పాల్గొనే అవకాశం కూడా దక్కించుకుంది. అక్కడా అద్భుత ప్రతిభ చూపి.. ఛాంపియన్‌గా నిలవాలని మనమూ ఈ నేస్తానికి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పేద్దాం మరి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని